Friday 11 February 2022

బడిలో స్వచ్ఛతకు పురస్కారం 60 ప్రశ్నలతో సర్వే : దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్ర విద్యాశాఖ

బడిలో స్వచ్ఛతకు పురస్కారం 60 ప్రశ్నలతో సర్వే : దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్ర విద్యాశాఖ



పాఠశాలల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత శుభ్రత, తాగునీరు ప్రధానాంశాలుగా కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల కోసం అంతర్జాలంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి మార్చి నెలాఖరు తుది గడువు. జిల్లాలో 2017-18లో ఏలూరు మండలం శనివారపుపేట జడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి పురస్కారాన్ని దక్కించుకోగా, 2016-17లో యలమంచిలి మండలం ఇలపకుర్రు జడ్పీ ఉన్నత పాఠశాల జాతీయస్థాయి పురస్కారం అందుకుంది.

ఎంపిక ఇలా...

జిల్లా స్థాయి పురస్కారాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మూడేసి చొప్పున, పట్టణ ప్రాంతాల నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఒక్కోటి చొప్పున మొత్తం ఎనిమిదింటిని ఎంపిక చేస్తారు. మరో 30 బడులకు ఉప కేటగిరీలో పురస్కారాలు అందజేస్తారు. ఐదు నక్షత్రాల రేటింగ్‌ ఆధారంగా రాష్ట్రస్థాయిలో 20, జాతీయ స్థాయిలో 40, సబ్‌కేటగిరీ విభాగంలో మరో ఆరు పాఠశాలలకు పురస్కారాలు ప్రకటిస్తారు.

పరిశీలించే అంశాలు :

ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత దరఖాస్తును ఆన్‌లైన్‌ చేసే క్రమంలో పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, చేతుల శుభ్రత, తడి, పొడి చెత్త నిర్వహణ, విద్యార్థుల సామర్థ్య నిర్మాణం, ప్రవర్తన మార్పులు, కొవిడ్‌-19 మార్గదర్శకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన 60 ప్రశ్నలకు(సర్వే) జవాబులు ఇవ్వాల్సి ఉంది. పాఠశాల ముఖచిత్రం, మరుగుదొడ్లు, వాష్‌ బేసిన్లు, బడితోట, ప్రాంగణ శుభ్రత, ఉపాధ్యాయ శిక్షణ, తాగునీటి పరీక్షల ధ్రువపత్రాలు, శానిటరీ న్యాప్‌కిన్ల నిర్మూలన యంత్రాలు తదితర తొమ్మిది అంశాలకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం కలెక్టరు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి, ముగ్గురు నిష్ణాతుల బృందం ప్రతిపాదనలను పరిశీలించి అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన పాఠశాలలను జిల్లా స్థాయి పురస్కారాలకు ఎంపిక చేస్తుందని సమగ్రశిక్షా సీఎంవో రవీంద్ర పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు దరఖాస్తులు సమర్పించేలా క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశామని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top