Friday 7 January 2022

ఇలా అయితే నష్టమే : కరవు భత్యంతో పీఆర్సీకి మేకప్‌ అంటున్న విశ్లేషకులు, కొన్ని ఉదా హరణలు.

ఇలా అయితే నష్టమే : కరవు భత్యంతో పీఆర్సీకి మేకప్‌ అంటున్న విశ్లేషకులు, కొన్ని ఉదా హరణలు.



ఫిట్‌మెంట్‌ రూపంలో ఇప్పటికే 4 శాతం నష్టం

డీఏలు కలపకుండా లెక్కిస్తే ఇప్పటి జీతమూ రాదు

కరవు భత్యంతో పీఆర్సీకి మేకప్‌ అంటున్న విశ్లేషకులు

ఇంటి అద్దె భత్యంతో పాటు ఇతరత్రా అనేక అంశాలపై అస్పష్టత

కొత్త జీతంలో అవే కీలకం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణలో భాగంగా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతిగా చెల్లిస్తోంది. అయితే తాజాగా ఫిట్‌మెంట్‌ 23 శాతమే అని ప్రకటించడంతో అక్కడ 4 శాతం మేర కోల్పోతున్నామని- అదే సమయంలో ఇంటి అద్దె భత్యం, సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్సు) రూపంలోనూ మరికొంత నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేతన సవరణ ప్రకటన సమయంలో మధ్యంతర భృతి కన్నా ఫిట్‌మెంట్‌ తక్కువగా ప్రకటించడం ఇదే తొలిసారి అని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు చెబుతున్నారు. పీఆర్సీతో పాటు పెండింగులో ఉన్న అన్ని కరవు భత్యాలు (డీఏలు) 2022 జనవరి జీతంలో కలిపి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కరవు భత్యం వేరు, పీఆర్సీ వేరు అని పెండింగు డీఏలు పీఆర్సీకి కలిపి జీతంలో పెరుగుదల ఉన్నట్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థికశాఖ విశ్రాంత ఉద్యోగులు కొందరు విశ్లేషిస్తున్నారు. పెండింగులో ఉన్న డీఏలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పీఆర్సీ వరకే లెక్కిస్తే కొత్త వేతన సవరణ వల్ల ఇప్పుడు అందుకుంటున్న జీతాలు కూడా రావని విశ్లేషిస్తున్నారు. ఇంటి అద్దె భత్యంలో సీఎస్‌ కమిటీ ప్రతిపాదించిన తగ్గింపును పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది.  

ఇంటి అద్దె భత్యంపై రాని స్పష్టత : 

ఇంటి అద్దె భత్యంపై అశుతోష్‌ కమిటీ చేసిన సిఫార్సులకు- సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ చేసిన సిఫార్సులకు మధ్య బాగా వ్యత్యాసం ఉంది. సీఎస్‌ కమిటీ ఇంటి అద్దె భత్యాన్ని బాగా తగ్గించి చూపించింది. ఈ విషయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రకటనలోనూ ఎలాంటి స్పష్టతా లేదు. ఇంటి అద్దె భత్యాన్ని ఏ ప్రకారం అమలు చేస్తారో తేల్చాల్సి ఉంది. దీనిపై ముఖ్యమంత్రితో ప్రస్తావించామని, అది చిన్న విషయమే కదా.. అధికారులతో (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)తో మాట్లాడి తేల్చుకోవాలని సీఎం వ్యాఖ్యానించినట్లు ఉద్యోగ సంఘ నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం దాని గురించి మాట్లాడుకుందామని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత ఇంటి అద్దె భత్యం, అశుతోష్‌ మిశ్రా కమిటీ సిఫార్సులకు భిన్నంగా.. ఆ రెండింటి కన్నా ఇంటి అద్దె భత్యం తగ్గేలా సీఎస్‌ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. కొత్త పీఆర్సీ వల్ల మొత్తం ప్రయోజనం లెక్క తేలాలంటే ఇంటి అద్దె భత్యమూ కీలకమే అని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఆర్థికశాఖలోని కొందరు నిపుణులు లెక్క కట్టి చెప్పిన వివరాలివీ :

1. ఒక డిప్యూటీ తహసీల్దార్‌కు (గెజిటెడ్‌ హోదా) మరికొందరు నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులకు 2013 పీఆర్సీ ప్రకారం కనీస మూలవేతనం రూ.28,940 ఉంది. వీరు 27 శాతం ఐఆర్‌, ఇతర అన్ని అంశాలతో కలిపి ప్రస్తుతం రూ.49,932 జీతం పొందుతున్నారు.

అదే ఉద్యోగికి తాజా పీఆర్సీ ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్‌, సీఎస్‌ కమిటీ ప్రకటించిన ఇంటి అద్దె భత్యం పరిగణలోకి తీసుకుని అన్నీ కలిపి లెక్కిస్తే జీతం రూ.46,707 అవుతుంది. అంటే జీతం తగ్గిపోతోంది. ప్రస్తుతం డీఏలతో కలిపి కూడా కొత్త జీతం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ డీఏలు కూడా కలిపితే జీతం రూ.52,501 అవుతుంది. పీఆర్సీ వల్ల జీతం తగ్గుతోందని, ఎప్పుడో ఇవ్వాల్సిన కరవు భత్యం ఇప్పుడు ఇవ్వడం వల్ల మాత్రమే జీతం పెరుగుతున్నట్లుగా చూపుతున్నారని విశ్లేషిస్తున్నారు.

2.గ్రామీణ ప్రాంతంలో ఒక డ్రైవర్‌

గ్రామీణ ప్రాంతంలో పని చేసే ఒక ప్రభుత్వ డ్రైవర్‌ కనీస మూలవేతనానికి ప్రస్తుతం 27 శాతం ఐఆర్‌ కలిపి రూ.26,674 జీతం పొందుతున్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఆయనకు వచ్చే జీతం రూ.25,682 అవుతుంది. అంటే తగ్గిపోతుంది. కానీ ప్రభుత్వం పెండింగు డీఏలు కూడా ఇస్తామని చెప్పడంతో ఆయన జీతం రూ.30,442 అవుతుంది.

3.గ్రామీణ ప్రాంతంలో ఒక అటెండర్‌

గ్రామీణ ప్రాంతంలో పని చేసే ఒక అటెండర్‌ జీతం.. 2013 పీఆర్సీ కనీస మూలవేతనం  రూ.13,000, 27 శాతం ఐఆర్‌ తదితరాలతో ప్రస్తుతం రూ.22,430గా ఉంది. అదే కొత్త పీఆర్సీలో 23 శాతం ఫిట్‌మెంట్‌ తదితరాలతో లెక్కిస్తే రూ.21,600 అవుతుంది. వాటికి కొత్త డీఏలు కూడా జోడిస్తేనే జీతం రూ.25,604కు పెరుగుతుంది. పీఆర్సీకి కరవు భత్యం కూడా కలిపి ఇవ్వడం వల్లే జీతాలు పెరుగుతున్నాయే తప్ప కొత్త పీఆర్సీతో జీతాలు పెరగడం లేదని వీటిని చూస్తే స్పష్టమవుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటివి కీలకం కాబోతున్నాయి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.

వీటిపై స్పష్టత ఏదీ...?

ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ మొత్తంపై ప్రకటన లేదు.

పెన్షనర్లకు అదనపు మొత్తం ఏ వయసు నుంచి ఇస్తారో సీఎం ప్రకటనలో పేర్కొనలేదు.

ఆటోమేటిక్‌ అడ్వాన్సు స్కీంపై స్పష్టత ఇవ్వలేదు.

ఉద్యోగులకు ఇచ్చే ప్రయాణ భత్యాలు తదితరాలపైనా తేల్చలేదు.



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top