Friday 7 January 2022

ఉన్నంతలో ఉత్తమ పీఆర్సీ : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

 ఉన్నంతలో ఉత్తమ పీఆర్సీ : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిఉన్నంతలో సాధ్యమైనంత ఉత్తమ(బెస్ట్‌ పాజిబుల్‌) పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్‌ ఉద్యోగుల మనసు గెలుచుకోగలిగారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొవిడ్‌ ఊహించని రీతిలో దెబ్బకొట్టింది. ఇప్పుడు ఒమిక్రాన్‌ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియదు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. ‘చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలనే ఆలోచన జగన్‌కు ఉంది. కానీ... పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఏదో చెప్పామని కాకుండా... దాంతో తర్వాత వచ్చే పరిణామాలకూ బాధ్యత వహించాలని భావించారు‘ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘ఎవరూ అడక్కపోయినా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు సీఎం పెంచారు. మరోవైపు యువతకూ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. బహుశా ఏ ప్రభుత్వమూ చేయనంతగా అధికారంలోకొచ్చిన సంవత్సరంలోనే 1.30 లక్షల ఉద్యోగాలను సచివాలయ వ్యవస్థతో కల్పించాం. ఆ ఉద్యోగులకు జూన్‌తో రెగ్యులర్‌ స్కేలు ఇవ్వనున్నారు. దానివల్ల ప్రభుత్వంపై రూ.1,700 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 40 వేల నియామకాలను చేపట్టనున్నారు’ అని వివరించారు.  

ఉద్యమ ఫలితమే హామీల అమలు : ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఉద్యమ ఫలితంగానే ఉద్యోగుల హామీలు అమలయ్యాయని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘‘ఉద్యోగుల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతాన్ని పక్కన పెట్టి, పీఆర్సీ కమిషనర్‌ అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సు చేసినట్లు 23% ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఇళ్లులేని ఉద్యోగులకు ఎంఐజీలో ఇళ్లు ఇవ్వాలన్న సీఎం నిర్ణయానికి ధన్యవాదాలు. ఐకాసలు పెట్టిన 71 డిమాండ్లలో 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది. ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వానికి ఏడాదికి రూ.10,250 కోట్లు వ్యయమవుతుంది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ఫిట్‌మెంట్‌ తగ్గడంపై కొంత బాధ కలిగింది : ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రస్తుతం 27% ఐఆర్‌ ఇస్తున్నందున అదేస్థాయిలో ఫిట్‌మెంట్‌ను ఆశించామని, 23 శాతానికి తగ్గడం కొంత బాధ కలిగించిందని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘ఫిట్‌మెంట్‌ కొంత తగ్గినా ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం, ఇతర హామీలు పరిష్కారమైనందున సంతోషం కలిగింది. కొన్ని కావాలనుకున్నప్పుడు, కొన్ని పోతాయి. మెజారిటీ లబ్ధి వస్తున్నందున హర్షం వ్యక్తంచేస్తున్నాం. ఇదంతా ఐకాసల ఉద్యమ ఫలితమే. మేం కోరుకున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైంది. ఉద్యోగుల సొంతింటి కలనూ మా డిమాండ్లలో పెట్టకపోయినా నెరవేర్చారు. రెండు వారాల్లో ఉద్యోగుల ఆరోగ్యకార్డుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పే స్కేళ్లను అమలు చేస్తామన్న దానిపై ఒకసారి అందరం మాట్లాడుకుని, ప్రభుత్వంతో చర్చిస్తాం’’ అని వివరించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించాం : సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

ఫిట్‌మెంట్‌ కొంచెం తగ్గినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ‘‘ఒమిక్రాన్‌ వస్తున్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్‌మెంట్‌కు అంగీకరిస్తున్నాం. ఒక్క ఫిట్‌మెంట్‌ తప్ప మిగిలిన అంశాలు మేం ఊహించిన దానికంటే మిన్నగా వచ్చాయి. ఫిట్‌మెంట్‌, డీఏలు కలిపితే వేతనాల్లో మంచిపెరుగుదల ఉంటుంది’’ అని తెలిపారు.

ఉద్యోగులను వంచించారు: ఏపీసీపీఎస్‌ఈఏ

కంట్రిబ్యూటరీ పింఛను పథకం ఉద్యోగులను సీఎం జగన్‌ మరోసారి వంచించారని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్‌ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి విమర్శించారు. వారానికే విశ్వసనీయత కరవైనప్పుడు, 6నెలల తర్వాత నిర్ణయం అనడం మరోసారి వంచించడమేనని ధ్వజమెత్తారు. ‘అధికారులు సొంత నివేదికను ముందుకు తీసుకురావడం దుర్మార్గం. ఇప్పటికే రావాల్సిన మూడు డీఏల బకాయిల గురించి మాట్లాడకపోవడంతో ఉద్యోగులు రూ.లక్షలు నష్టపోయే అవకాశముంది. సీపీఎస్‌ ఉద్యోగుల పట్ల సీఎం విశ్వసనీయతను చాటుకోవాలి. లేనిపక్షంలో కుటుంబాలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.

ప్రభుత్వంపై విశ్వాసం పోయింది: పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

సీఎం జగన్‌ ప్రకటించిన పీఆర్సీ నిరాశ కలిగించిందని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరరావు, షేక్‌సాబ్జీ వెల్లడించారు. ‘మధ్యంతర భృతికంటే ఫిట్‌మెంట్‌ తక్కువగా ఇవ్వడం చరిత్రలో ఇది మొదటిసారి. ఇలాంటి పీఆర్సీ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఇంటి అద్దెభత్యం యథాతథంగా ఉంటుందా? తగ్గిస్తారా? చూడాలి. అన్నింటికంటే ఘోరం భవిష్యత్తులో పీఆర్సీకి మంగళం పాడుతూ కేంద్ర ప్రభుత్వ వేతన సవరణతో ముడిపెట్టడం. ఇదే జరిగితే 2023 పీఆర్సీ గల్లంతు ఖాయం. సీపీఎస్‌పై సీఎం చర్చించనే లేదు. దీంతో సీపీఎస్‌ను మర్చిపోండని చెప్పినట్లయింది. ఈ విధానం ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వైఖరిని ప్రకటించలేదు. పీఆర్సీ వర్తిస్తుందని చెప్పి సరిపెట్టారు’ అని వివరించారు.

ఉద్యోగులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్సీ కత్తి :

పీఆర్సీ ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దెభత్యం స్లాబులపై ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ‘23శాతం ఫిట్‌మెంట్‌ ఉద్యోగులను నిరాశపర్చింది. 27శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. ప్రస్తుతం పొందుతున్న ఇంటి అద్దెభత్యం స్థానంలో 8%,16%,24% అమలుచేస్తే ఆర్థికంగా నష్టపోతారు’ అని పేర్కొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top