10 పరీక్షలుమార్చిలో తప్పనిసరి ౼ పాఠశాలల మ్యాపింగ్ తర్వాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసే ఆలోచన లేదని.. మార్చిలో తప్పనిసరిగా ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో శుక్రవారం కస్తూర్బా గాంధీ, ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పాఠశాలల మ్యాపింగ్ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ఉన్నత పాఠశాలల్లో 1:40 విద్యార్థుల నిష్పత్తిని బట్టి ఖాళీలను ఒప్పంద ఉపాధ్యాయులు, అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడో విడత అమ్మఒడి ఇస్తామన్నారు. సీబీఎస్‌ఈ విధానంలో 2024- 25 నాటికి పదో తరగతి తొలి బ్యాచ్ విద్యార్థులు పరీక్షలు రాయాలన్నది సీఎం లక్ష్యమని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చట్ట సవరణ ద్వారా ఎస్‌ఆర్‌ఎం, విట్, సెంచురీ వంటి కార్పొరేట్ కళాశాలల్లో మూడు వేలమంది విద్యార్థులు ఉచిత సీట్లు పొందారని మంత్రి తెలిపారు. నిబంధనలు పాటించని 45 ఇంజినీరింగ్, 375 డీఎడ్, బీఈడీ కళాశాలలకు తాళాలు పడినట్లు చెప్పారు. వినుకొండ డిగ్రీ కళాశాలలో స్టేడియం నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని చెప్పారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ బాలిరెడ్డి, వైకాపా నేతలు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment