Friday 7 January 2022

45,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం

 45,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం



ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు పీఆర్సీ ఖరారైంది. ఫిట్‌మెంట్‌ 23.29 శాతంగా నిర్ణయించటంతో పాటు ఉద్యోగ విరమణ వయసును రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఏడాదికి సగటున 3వేల మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈనెలలోనే అన్ని కేటగిరీల్లో కలిపి 500 మంది వరకు విరమణ పొందనున్నారు. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచటంతో వారందరికి మరో రెండేళ్ల పాటు కొలువులో కొనసాగే అవకాశం వచ్చింది. ఈ పెంపుదల జిల్లాలోని 45 వేల మంది ఉద్యోగులకు వర్తిస్తుంది. జూన్‌, జులైలో అత్యధికంగా 1200 నుంచి 1500 మంది విరమణ పొందనున్నారు. వారందరిలో రెండేళ్లపెంపు కొత్త కాంతిని నింపినట్లేనని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పెంపుతో సగటున ప్రతి ఉద్యోగికి బేసిక్‌పై నికరంగా 9 నుంచి 10 శాతం వరకు పెరుగుదల ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. కొత్త జీతాలపై శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గుంటూరు నగరంతో పాటు జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాల్లో ఎన్జీవో సంఘ కార్యాలయాలు, టీచర్ల యూనియన్‌ ఆఫీసుల్లో కూర్చొని లెక్కలు వేసుకోవటం కనిపించింది.

జిల్లాలో అత్యధికంగా 20వేల మంది టీచర్లు మరో 15 వేల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, 3 వేల మంది గెజిటెడ్‌ ఉద్యోగులు, 3500 మరది పోలీసులు, మరో 3 వేల వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికి ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ వర్తించనుంది. 1.4.2020 నుంచి మానిటరీ ప్రయోజనాలు వర్తించనున్నాయి. అదేవిధంగా పెండింగ్‌ నాలుగు డీఏలు ఈనెల నుంచే చెల్లింపులు చేసేలా ప్రభుత్వం ప్రకటించింది.

ఆమోదయోగ్యంగా లేదు: ఏపీటీఎఫ్‌ : 

ఐఆర్‌ 27 శాతం కన్నా తక్కువ 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం ఆమోదయోగ్యంగా లేదని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మక్కెన శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలిపారు. ఐఆర్‌ కన్నా ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు ఇస్తామంటున్న ఫిట్‌మెంట్‌తో ప్రస్తుతం తీసుకుంటున్న జీతాలు తగ్గుతాయన్నారు. పెండింగ్‌ డీఏలను ఈనెలలో ఇస్తామనడంలో ఉద్దేశమేమిటని, జీతాలు తగ్గుదల కనబడకుండా ఉండడానికా అని ప్రశ్నించారు.

ఉద్యోగులకు ఊరట : 

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గుముఖం పట్టడం వంటివి అర్థం చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన 23.29 శాతం ఫిట్‌మెంట్‌కు జిల్లా, నగర నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, సుకుమార్‌ ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈపెంపు ఉద్యోగులకు ఊరటనిచ్చిందన్నారు. నాలుగు డీఏలకు ఆమోదం తెలపటం, కొత్త జీతాలు ఈనెల నుంచి అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటనలో వివరించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top