Saturday 29 January 2022

ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం - ఇక దేనికీ భయపడం.. వ్యవస్థను స్తంభింపజేస్తాం : పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు

 ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం - ఇక దేనికీ భయపడం.. వ్యవస్థను స్తంభింపజేస్తాం : పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజుఒకటో తేదీకి పాతజీతాలు వేయకపోతే సహించం

మూడేళ్లుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఒకటో తేదీకి పాత జీతాలు వేయకపోతే ఆ తరువాత పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. విశాఖపట్నం, విజయనగరాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షల శిబిరాలను శనివారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఫిబ్రవరి 3న లక్షల మందితో చలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రుల కమిటీ చర్చలకు పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తొమ్మిది మంది ప్రతినిధుల బృందం చర్చలకు వెళ్లామని, నలుగురు నేతలు నిర్ణయించుకుని లిఖితపూర్వకంగా తమ డిమాండ్లను ఇచ్చామని చెప్పారు. వాటికి సమాధానం చెబితే తాము చర్చలకు సిద్ధమేనన్నారు. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పోగొట్టుకుందని తెలిపారు. అశుతోష్‌ మిశ్ర నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి భారంగా ఉన్న రూ.10 వేల కోట్లు తమకొద్దని, పాత జీతాలివ్వండి చాలని పేర్కొన్నారు. రూ.1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. మా జీతాల్లో కోతలు వేసి, ప్రభుత్వం ఆ డబ్బులు మిగుల్చుకుంటోందని విమర్శించారు. పీఆర్సీ సమస్య పరిష్కారమైతే ఉద్యోగుల్లో ఆవేదన, ఆవేశం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తే అదంతా భ్రమేనన్నారు. ఎందుకంటే ఈ ఉద్యమం పీఆర్సీతోపాటు సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్‌ డిక్లరేషన్‌ వంటి ఇతర అంశాలపైనా చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించుకోవాలి :

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అశుతోష్‌ మిశ్ర రిపోర్టు ప్రకారం పీఆర్సీ ఇస్తామని.. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని పీఆర్సీ సాధన సమితి నేత, ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం నెల్లూరులో కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల రిలే నిరాహార దీక్షను ప్రారంభించి మాట్లాడారు. సాక్షాత్తు మంత్రులే 12సార్లు సమావేశాలు నిర్వహించి తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అన్యాయం చేసేలా పీఆర్సీ రిపోర్టును ముఖ్యమంత్రి చదివి వెళ్లారన్నారు. ఈ ఉద్యమం ఉద్యోగుల గుండెల్లో నుంచి పుట్టిందని, తమకు నమ్మకం కలిగిస్తే చర్చలకు సిద్ధమన్నారు. మంత్రులు ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగులపై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు బజారున పడ్డామని, ఈ ఘనత ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. చర్చలకు కూడా తలుపులు మూసేశామని చెబుతున్న ఘనతా సర్కారుదేనన్నారు. తాము రాజకీయాలు చేయడం లేదని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. లక్షల మంది ఉద్యోగులతో ఫిబ్రవరి 3న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని, సమ్మె చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సచివాలయంతో పాటు మొత్తం వ్యవస్థను స్తంభింపజేస్తామని, దీనికి తగిన మూల్యం ప్రభుత్వమే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఉద్యోగుల సమ్మెను పకడ్బందీగా నిర్వహించేందుకు పీఆర్సీ సాధన సమితి నాయకులు జిల్లాల పర్యటనలు చేపట్టారు. ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించగా.. ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు శనివారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మిగతా నాయకులూ జిల్లాలకు వెళ్లి, ఫిబ్రవరి 3న చలో విజయవాడ, ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లడంపై ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం రిలే దీక్షలు కొనసాగాయి. ప్రకాశంలో మహిళలు అధికంగా హాజరయ్యారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా ఉద్యోగులే దీక్ష చేశారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్‌లోని ఒప్పంద, పొరుగుసేవల ఐకాస ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దీక్షల్లో పాల్గొన్నారు. రిలే దీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ.. పీఆర్సీ సాధన సమితిలో లేని ఇతర సంఘాలతో జరిపిన చర్చల్లో ఏం హామీ ఇచ్చారో బహిర్గతం చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఫిట్‌మెంట్‌ పెంచుతామని చెప్పారా? హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏ సంఘాలతో చర్చలు జరిపినా పర్వాలేదని, తమ డిమాండ్లు పరిష్కరిస్తే చాలని ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు వెల్లడించారు. పింఛన్లను కొత్త పీఆర్సీ ప్రకారం చేస్తున్నారని, వాటిని వెబ్‌సైట్‌లో పెట్టారని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాద్‌ తెలిపారు. 2018 జులై తర్వాత పదవీవిరమణ పొందిన వారికి పాత పీఆర్సీ ప్రకారమే పింఛను చేసి, మధ్యంతర భృతి తొలగించారని వెల్లడించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top