Saturday 29 January 2022

కొత్త పింఛనర్లకు షాక్‌ - కొత్త పెన్షన్‌ ఇవ్వలేదు... పాత మొత్తమూ రాలేదు.

కొత్త పింఛనర్లకు షాక్‌ - కొత్త పెన్షన్‌ ఇవ్వలేదు... పాత మొత్తమూ రాలేదు. 





డిసెంబరుతో పోల్చితే రూ.5వేల నుంచి రూ.15వేల వరకు తగ్గుదల.

భవిష్యత్తులో బకాయిలు వచ్చినా ప్రస్తుతానికి మాత్రం కోత.


రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి 2018 జులై 1 తర్వాత పదవీ విరమణ చేసిన కొత్త పింఛనర్లు తాజా పెన్షన్‌ స్లిప్పులు చూసి హతాశులయ్యారు. 2022 జనవరి నెలకు వారికి ఇచ్చే పింఛను మొత్తం ఎంతో సీఎఫ్‌ఎంఎస్‌ సాయంతో ఖజానా అధికారులు ఖరారు చేశారు. ఆ మొత్తం 2021 డిసెంబర్‌ నెల పింఛనుతో పోలిస్తే విశ్రాంత ఉద్యోగి స్థాయిని బట్టి సుమారు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు తగ్గిపోయింది. 2022 సవరించిన పీఆర్‌సీ నిబంధనల ప్రకారం కొత్త పింఛను లెక్కకట్టి కొత్త పెన్షన్‌ స్కేల్‌ నిర్ధారించి ఇవ్వలేదు. అలాగని 2021 డిసెంబర్‌లో ఇచ్చినంత మొత్తమూ రాలేదు. విశ్రాంత ఉద్యోగుల పింఛను లెక్కలు ఆయా ప్రభుత్వ శాఖలే సిద్ధం చేసి, ఏజీ కార్యాలయానికి పంపి ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారికి కొత్త పింఛను అందుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు కొత్త పీఆర్సీకి సహకరించేందుకు సిద్ధంగా లేనందున ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమవుతుంది. దీంతో కొన్ని నెలలపాటు ఇలా కోత పడ్డ పింఛన్లే అందే పరిస్థితి ఉందని సమాచారం. ఆనక 2022 పీఆర్‌సీ ప్రకారం మూల పింఛను లెక్కించి, ప్రస్తుతం ఎంత కోతపడిందో అన్ని నెలలదీ కలిపి ఎరియర్స్‌గా చెల్లిస్తారు. నెలనెలా ఈఎంఐలు, వైద్యఖర్చులు వంటి అనేక తప్పనిసరి అవసరాలున్న పింఛనర్లు పెన్షన్‌లో ఇలా కోత పెట్టడంతో కలవరపడుతున్నారు. కొత్త పింఛను ఖరారయ్యేవరకు పాత విధానంలోనే ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి. 

గతంలో ఇలా ఎందుకు జరగలేదంటే...

ఎప్పుడు కొత్త పీఆర్సీ అమలు చేసినా కొత్త పింఛనర్ల పెన్షన్‌ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి వెళ్లి రావడం సహజమే. అంతవరకు పాత మధ్యంతర భృతి, పాత పింఛను విధానమే కొనసాగేది. అందువల్ల ఎప్పుడూ కోత పడలేదు. పీఆర్సీ చరిత్రలో తొలిసారి ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గిపోవడం, ఆ ఐఆర్‌ను సర్దుబాటు చేయాలని నిర్ణయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అసలు పింఛను ఎంతో తేలిన తర్వాత ఎరియర్స్‌ చెల్లించేస్తామని.. ఇది తాత్కాలిక కోత మాత్రమేనని ఖజానా అధికారులు చెబుతున్నారు. ‘చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. పింఛనులో కోత వల్ల పింఛనర్లు ఇబ్బందులు పడతారు. కొత్తది ఖరారయ్యే వరకు పాత పింఛనులో కోత లేకుండా చూడాలి’ అని రాష్ట్ర పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షులు ఈదర వీరయ్య కోరారు. బకాయిలు రావడానికి చాలా సమయం పడుతుందని, ఈ లోపు చాలీచాలని పింఛనుతో ఇబ్బందులు పడవలసి వస్తుందని వాపోయారు.

ఇప్పుడు ఎందుకీ కోత...?

* ప్రస్తుత పీఆర్సీ 1.8.2018 నుంచి నోషనల్‌ రూపంలో, 2020 ఏప్రిల్‌ నుంచి మానిటరీ (ఆర్థిక ప్రయోజనం) రూపంలో, 1.1.2022 నుంచి నగదు రూపంలో జీతాల్లో లేదా పెన్షన్లలో కలిపి ఇచ్చేలా అమలు చేస్తున్నారు.

* 1.7.2018 ముందు పదవీవిరమణ పొందిన ఉద్యోగికి.. ఫిట్‌మెంట్‌ను బట్టి, అంతవరకు ఉన్న డీఏను కూడా మూల పెన్షన్‌తో కలిపి 2022 పీఆర్సీ ప్రకారం కొత్త మూల పెన్షన్‌ లెక్కిస్తారు. దానిపై కొత్తగా ఇవ్వాల్సిన కరవు భత్యం లెక్కించి 2022 జనవరి నుంచే కొత్త పెన్షన్‌ ఇస్తున్నారు.

* అదే 1.7.2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి సర్వీస్‌ రికార్డ్‌ (ఎస్‌ఆర్‌)ను చూసి, ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి పంపాలి. అక్కడి నుంచి ఆమోదం పొంది తిరిగొచ్చాకే కొత్త పింఛను అందుతుంది. 

* ప్రస్తుతం ప్రభుత్వం మధ్యంతర భృతి (ఐఆర్‌) మొత్తం లెక్కించి దాన్ని సర్దుబాటు చేసేయాలని కొత్త పీఆర్సీలో నిర్ణయించింది. ఆ ప్రకారం 1.7.2019 నుంచి 31.12.2021 వరకు ఐఆర్‌ ఇస్తూ వచ్చారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గడంతో.. పాత పెన్షన్‌తో పోలిస్తే జనవరి పింఛనులో కోత పడింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top