పత్రికా ప్రకటన - పాఠశాలలు రూపాంతరం చెందుతాయి. పాఠశాలలు మూతపడటం అనేది జరగదు : ముగిసిన అవగాహన సదస్సులు.
జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై గత మూడురోజులు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. పాఠశాలల మ్యాపింగ్ వల్ల పాఠశాలలు రద్దు కానేకావని తరగతులు, విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సు సచివాలయంలోని 5 వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో మూడురోజులుగా నిర్వహించారు. శనివారం చివరిరోజు సదస్సు కు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరు కాగా డిప్యూటీ సి ఎం అంజద్ భాషా, ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఎదో జరిగిపోతుందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. పాఠశాలలు రద్దు కావని ఇప్పుడున్న పాఠశాలలు ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్, హై స్కూల్స్, హై స్కూల్స్ ప్లస్ అని రూపాంతరం ( మార్పు) చెందుతాయన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మూడురోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామన్నారు. ఇంకా త్వరలోనే జిల్లాల వారీగా అధికారులు సదస్సు లు పెట్టి మారుతున్న పాఠశాలల స్వరూపాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విద్యా సంస్కరణ ల వల్ల నేడు ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పాఠశాలల మ్యాపింగ్ తరువాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌళిక వసతులు అవసరమో గుర్తించి నాడు నేడు ద్వారా పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం అనేక మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ విద్యాసంవత్సరం ఎన్ని అవరోధాలు వచ్చినా ఇప్పటికి దాదాపు 5 నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ భయంతో పాఠశాలలు మూసివేసిన పొరుగు రాష్ట్రాలు కూడా తిరిగి పాఠశాలలు తెరుస్తున్నారని, మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు తో పాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ విద్యకు ఆటంకం లేకుండా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని అన్నారు. అతి తక్కువగా ఉండే ఉర్దూ పాఠశాలలను మ్యాపింగ్ చేసే విషయంలో పునరాలోచించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్ మురళి, అడిషనల్ డైరెక్టర్లు పార్వతి, సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జేడీ రామలింగం, మున్సిపల్ కమిషనర్ లు, స్పెషల్ ఆఫీసర్ లు, ఆర్ జే డీ లు, డీఈఓ లు పాల్గొన్నారు.
పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.
0 Post a Comment:
Post a Comment