Saturday 8 January 2022

ఓటరు గుర్తింపు కార్డు - ఆధార్‌ అనుసంధానం

ఓటరు గుర్తింపు కార్డు - ఆధార్‌ అనుసంధానం



    పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆఘమేఘాల మీద ఆమోదించిన ఎన్నికల (సంస్కరణల) చట్టం 2021, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలను చేసింది. ఈ సవరణను ఆన్‌లైన్‌లో మొబైల్‌ ద్వారా ఓటింగు ప్రక్రియగా మార్చటానికి తొలి అడుగుగా చూడాలి. ఆది నుండే ఓటరు గుర్తింపును ఆధార్‌తో అనుసంధానం చేయడం బయో మెట్రిక్‌ ఆధారిత ఓటు వ్యవస్థను ఏర్పాటు చేయటానికే. ఈ పని, ఓటరు జాబితాలో నకిలీ-దొంగ ఓట్లను తొలగించడానికి ఉపయోగపడుతుందనేది అనుసంధానాన్ని బలపరుస్తున్న వారు చేస్తున్న వాదన. ఇప్పటికే ఈ ప్రక్రియ తెలుగు రాష్ట్రాలలో అమలుచేసినందున, పర్యవసానాలను పరిశీలించటం ముఖ్యం. అనుభవం చేబుతున్న పాఠం ఏమిటంటే, ఈ అనుసంధానం ఓటరు జాబితానుండి ఎంపిక చేసినవారిని తొలగించడానికి దోహదపడుతున్నదని.

ఓటరు జాబితా ఎందుకని కీలకం ?

మన దేశంలో ఓటు హక్కు సార్వజనికమైనది. కుల, మత, ప్రాంత, వర్గ రహితంగా 18 ఏళ్లు పైబడినవారు, భారత దేశపౌరులై ఉంటే నివాసమున్న ప్రాంతంలో ఓటు వినియోగించుకోవచ్చు. జాబితా తయారు చేసేటప్పుడు ఈ రెండంశాలను మాత్రమే పరిగణించాలి. ఇంటింటికి తిరిగి తనిఖీ చేయాలి. ఓటు వినియోగించుకునేటప్పుడు ధృవీకరణగా పదకొండు రకాల కార్డులలో ఏది ఉన్నా ఓటు వేయొచ్చు. కీలకమైనది ఓటరు గుర్తింపు కార్డు కాదు, జాబితాలో పేరుండటం. అందుకనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన దేశంలో ప్రజాతంత్ర ప్రక్రియ అయిన ఎన్నికలలో ఓటరు జాబితా ప్రామాణికమైనది. ఈ ఓటరు జాబితాలో పేరులేకపోతే ఓటరు కార్డుతో సహా ఏ గుర్తింపు కార్డున్నా ఓటు హక్కు వినియోగించుకోలేం.

తెలుగు రాష్ట్రాల అనుభవం ఏంటి ?

సరళీకరణ పర్వంలో సమైక్య రాష్ట్రం ఒక ప్రయోగశాలన్న విషయం తెలిసినదే. ఆ ఒరవడి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. ఈ ప్రయోగాలకవసరమైన సుశిక్షిత అధికార యంత్రాంగం తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలను ఎంచుకోవటానికి కూడా ఇదే ముఖ్య కారణం. ఆంధ్రా, తెలంగాణలు ఈ కార్యక్రమాన్ని 2014 నుండే మొదలుపెట్టాయి కనుక, ఈ రెండు రాష్ట్రాల ప్రజల ఒటరు గుర్తింపును ఆధార్‌తో అనుసంధానం చెయ్యడం దాదాపు పూర్తి అయిపోయింది. కోర్టు ఆదేశాన్ని ధిక్కరించి ఎన్నికల జాబితాను తాజా పరిచేటప్పుడు, ఆధార్‌ అనుసంధానంతో ఉన్న సమాచారాన్ని వాడారు. ఈ ఆధార్‌ అనుసంధానం కేవలం ఆధార్‌ సమాచారానికి మాత్రమే పరిమతమవ్వలేదు. ఆధార్‌తో అనుసంధానమైన అనేక రకాల సమాచారంతో దీనిని జతపరిచారు.

వివిధ డేటాబేసుల సమాచార అనుసంధానం :

ఆధార్‌ను వినియోగించి నకిలీ ఓటరును గుర్తించడానికి ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానం ఏమిటో సామాన్య ప్రజలకు తెలుపలేదు. దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రజలకు అందుబాటులో లేవు, సమాచార హక్కు కింద పంపిన ధరఖాస్తులకు జవాబులేదు. ఓటరు ఆమోదం లేకుండా ఆధార్‌ సమాచారాన్ని, సేకరించడంపై అనేక ప్రశ్నలు తలెత్తిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం కార్యక్రమానికి ఆధార్‌ సమాచార సేకరణకు అనుసరిస్తున్న పద్ధతిని తెలియజేయమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారులకు 2018లో లేఖ రాసింది. ఈ కరెస్పాండెన్స్‌ విషయమై సేకరించిన అర్‌టీఐల ద్వారా వెలుగు చూసిన విషయమేంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు స్టేట్‌ రిసోర్స్‌ డేటా హబ్‌ (ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌) లోని సమాచారాన్ని ఎన్నికల జాబితాను తాజా పర్చటానికి వాడినట్లు తేలింది.

     సాధారణంగా, స్టేట్‌ రిసోర్స్‌ డేటా హబ్‌ (ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌) లలో, రాష్ట్ర ప్రజల గురించి భారత ఏకైక గుర్తింపు అధికార వ్యవస్థ (యు.ఐ.డి.ఎ.ఐ) అందించిన సమాచారం, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన అదనపు సమాచారం కలిగి ఉంటుంది. ఈ సెంటరు రాష్ట్రాలకు ఆధార్‌ వంటిదేకాని, బయోమెట్రిక్‌ వివరాలు లేని సమాచారాన్ని రాష్ట్రాలకు అందించడానికి యు.ఐ.డి.ఎ.ఐ స్టేట్‌ రిసోర్స్‌ డేటా హబ్‌ (ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌)లను ఏర్పాటుచేసింది. ఆధార్‌ సమాచారం ఎంత సురక్షితమో అందరికీ తెలిసినదే. అనేక సార్లు ఆధార్‌-బయోమెట్రిక్‌ డేటాతో సహా లీక్‌ అయ్యింది. అంతేకాక ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థలు స్టేట్‌ రిసోర్స్‌ డేటా హబ్‌ (ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌)లను నిర్వహిస్తున్నాయి. కులం, మతం, ఇతర సున్నిత సమాచారాన్ని ఆధార్‌లో సేకరించకూడదనే నిబంధన ఉన్నందున యు.ఐ.డి.ఎ.ఐ ఈ సమాచారాన్ని రాష్ట్రాలు ఆధార్‌ సమాచార సేకరణలో భాగంగా సేకరించమని సిఫార్సు చేసింది.

    రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర సెన్సస్‌ను చేపట్టాయి. ఓటరు వివరాలు, అధార్‌ సమాచారం, కులం, మతం, రేషన్‌, సబ్సిడీలు, బ్యాంకు ఖాతా, ఆస్తి.. వగైరా వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పౌరునికి సంబంధించిన సంపూర్ణ సమాచారం సేకరించారు. ఈ సర్వేలు 'సమగ్ర కుటుంబ సర్వే 2014', 'స్మార్ట్‌ ప్లస్‌ సర్వే 2016 పేరుతో జరిగాయి. నిజానికి స్టేట్‌ రిసోర్స్‌ డేటా హబ్‌ (ఎస్‌.ఆర్‌.డి.హెచ్‌) రాష్ట్ర ప్రజలపై ఎక్కు పెట్టిన ఓ నిఘా వ్యవస్థ. దీనిలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాములను ఉపయోగించి ఎన్నికల జాబితాను తాజా పరిచారు. ఫలితంగా 2018లో తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. భారతదేశం అంతటా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటరు గుర్తింపును ఆధార్‌తో అనుసంధానం చేసింది. ఫలితంగా దాదాపు 30 కోట్ల మంది ప్రజల ఓటరు గుర్తింపును తొలగించడం జరిగింది.         

ఓటుహక్కు నిరాకరణ :

ఇంటింటికీ తిరిగి ధృవీకరించే పద్ధతి ద్వారా ఓటరును ధవీకరించే విధానాన్ని (2015లో) ఉపసంహరించారు (సమాచార హక్కు ద్వారా పంపిన ప్రశ్నలకు భారత ఎన్నికల సంఘం ఇచ్చిన జవాబుల ఆధారంగా). ప్రస్తుతం జాబితాలు తయారు చేసే ప్రాతిపదిక, నిర్ణయాధికారం, ఒక ప్రైవేటు ఐటి కంపెనీ నిర్వహణలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఆధీనంలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర, స్వయంప్రతిపత్తి డోలాయమానంలో పడగా, కీలకమైన ఓటర్ల జాబితాను సరిదిద్దడానికి ప్రజలకు తెలియని సాఫ్ట్‌వేర్‌ దయా దాక్షిణ్యాలపై ఆధారపడడం సార్వత్రిక వయోజన ఓటు హక్కు భావననే నిర్మూలిస్తున్నది. ఆంధ్ర, తెలంగాణ అనుభవం ఓటర్ల అణచివేత, ఓటుహక్కు నిరాకరణలను ఎత్తిచూపుతున్నది.                    

రహస్య ఓటు-మొబైల్‌ ఓటింగ్‌ :

ఇటీవలే అక్టోబరు 2021లో మొబైల్‌ ఓటింగు ప్రయోగాన్ని ఖమ్మం జిల్లాలో ఎన్నికల సంఘం చేపట్టింది. ఓటు వేసేటప్పుడు, తనిఖీకై ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఓటరు గుర్తింపు, ఆధార్‌ సంఖ్య, ఫోన్‌ నంబర్లను జతగా పరిగణించి మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు నమోదు చేయించారు. ఈ పద్ధతిలో ఓటు ఎవరికి వేశామనేది రహస్యంగా ఉండే ప్రసక్తే లేదు. ధన ప్రభావం ఎన్నికలను ఎంత అపహాస్యం చేస్తుందో చెప్పనక్కరలేదు. ఒక వ్యక్తి ఎవరికి ఓటు వేస్తున్న విషయం తెలుస్తుంది, దుండగులు, గూండాల పర్యవేక్షణలో ఓట్లు వేసే విధంగా మారుతుంది. ఈవీయంలు ట్యాంపరింగ్‌ చేయకుండా డిజైన్‌ చేస్తే, పేపర్‌ బేలెట్‌ కాలంలో బూత్‌లను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు అడ్డు పడుతుంది. కానీ ఇప్పుడు ప్రవేశ పెడుతున్న పద్ధతులు పాత పద్ధతులను కొత్త పుంతలు తొక్కించేవిగా ఉన్నాయి. అధునాతన సర్వర్లు, డేటా సెంటర్లు, సాంకేతిక సాధనాలపై ఆధిపత్యం పొందిన కార్పొరేషన్లు, దిగ్గజాలూ నయా దుండగులూ మాల్‌వేర్‌ను ఉపయోగించి ఎన్నికల ఫలితాలను తారుమారు చెయ్యడం సాధ్యమవుతుంది. తద్వారా ఇ-ఓటింగుతో ఎన్నికల ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చవచ్చు. ఇప్పుడు తీసుకు వచ్చిన చట్టం ఇ-ఓటింగు కేంద్రంగా కనిపించనప్పటికీ, ఈ అనుసంధానం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఒక ఓటును, వేసిన వ్యక్తి వివరాలతో జత చేయటమంటే 'రహస్య ఓటు పద్ధతిని' అంతమొందించటమే.

     ఈ అనుసంధానం ప్రతి వ్యక్తినీ ప్రొఫైల్‌ చేయటానికి, తద్వారా వారిని ఎలా ప్రభావితం చేయాలో నిర్ధారించుకోవటానికి రాజకీయ పార్టీలకి తోడ్పడుతుంది. ఓటింగ్‌ ప్రక్రియలో, ఓటింగ్‌ రోజున వ్యక్తులను, తమకనుగుణంగా మలుచుకోవటానికి అవకాశమిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీలకు ఈ అవకాశాలు మెండుగా ఉంటాయి. గత సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు సంక్షేమ పధకాల ప్రయోజనం పొందుతున్న వారి సామాచారాన్ని తీసుకు రమ్మని బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్‌ షా ఆదేశాలు జారీ చేశారు. 2019 ఎన్నికలలో ఈ సమాచారాన్ని ఎలా వినియోగించుకున్నారన్నది మనకు తెలుసు. ఆది నుండి ఆధార్‌ను దేశమంతటా రుద్దిన తీరే అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం.

    ఇప్పటికే మన దేశంలో బడా పెట్టుబడి ఎలక్టోరల్‌ బాండ్లద్వారా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది, ఇప్పుడు ఈ అనుసంధానం 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' వ్యవస్థ దిశలోకి పయనంగా మనం చూడాలి. స్థానిక, అసెంబ్లీ-సార్వత్రిక ఎన్నికలను ఏకకాలంలో జరపడం తమ లాభార్జనకు అనుకూల విధానాలను ముందుకు తీసుకువెళ్ళడానికి పాలక కూటమికీ, దానితో పాటు బడా పెట్టుబడిదారులకూ తోడ్పడుతుంది. ఓకే దేశం ఒకే ఎన్నికలు కేవలం ఎన్నికల వ్యవహారమే కాదు, ఇది భారత ఎన్నికల వ్యవస్థనంతటినీ భారత బడా పెట్టుబడిదార్ల అవసరాలకు తోకగా మార్చే పరివర్తన కూడా. ఈ దాడి నుండి భారత ప్రజాస్వామిక వ్యవస్థ బతికి బట్ట కట్టాలంటే ఈ అనుసంధానానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి.

వ్యాసకర్త సెల్‌: 9490098011/వై. కిరణ్‌ చంద్ర

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top