విద్యా సంక్షోభానికే జీవో 85 _ ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో...
దేశవ్యాప్తంగా ‘బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం’ 2010 ఏప్రిల్ 1 నుంచి అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, వివిధ సంఘాలతో చర్చించి చట్టం అమలుకు సంబంధించిన నిబంధనలను రూపొందించింది. ఆ నిబంధనలను 2011 మార్చి 3వ తేదీన జీవో నెంబరు 20 ద్వారా ప్రకటించింది. ఆ విధంగా రూపొందిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, ఎవరితోనూ చర్చించకుండా, డిసెంబర్ 24, 2021న జీవో 85 ద్వారా తీవ్రంగా మార్చివేసింది. అన్నింటికంటే ప్రధానమైనది 3, 4, 5 తరగతుకు సంబంధించి సామీప్యత నిబంధనకు చేసిన మార్పు. ఈ మార్పు అసలు చట్టం మూల ప్రయోజనానికే భంగం కలిగిస్తుంది. విద్యాహక్కు చట్టంలో సెక్షన్ 38(4) ప్రకారం నిబంధనలలో మార్పు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సదరు సవరణలను చట్టసభల ముందు పెట్టాలి. ఈ మార్పులను చట్టసభలు తిరస్కరించే అవకాశం కూడా ఉంది. మరి ఈ నిబంధనల సవరణ జీవోను ప్రభుత్వం చట్టసభల ముందు పెడుతుందని, చట్టసభలలో అవసరమైన చర్చ జరుగుతుందని ఆశిద్దాం. అయితే ఈ విషయమై ముందుగా ప్రజల మధ్య విస్తృతమైన చర్చ జరగాలి.
నిజానికి, ప్రభుత్వం ఈ పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ఆరు నెలల క్రితమే ప్రారంభించింది. మే 31, 2021న అప్పటి పాఠశాల కమిషనర్ సర్క్యులర్ 172 ఇచ్చారు. ప్రభుత్వరంగ ఉన్నత పాఠశాలలకు 2 కి.మీ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులను ఆయా ఉన్నత పాఠశాలలకు తరలించాలనేదే ఆ సర్క్యులర్ సారాంశం. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా పరిధిని 250 మీటర్లకు కుదించారు. అయినప్పటికీ, సుమారు నాలుగువేల ప్రాథమిక పాఠశాలలు ప్రభావితం అయ్యాయి. ఆ బాలలు తమకు కేటాయించబడిన ఉన్నత పాఠశాలలకు వెళ్ళారు. ఆయా ఉన్నత పాఠశాలలలో అప్పటికే వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత ఉంది. కొత్తగా వచ్చిన చిన్నతరగతుల బాలలకు బోధన కోసం గదులు కాదు కదా వరండా కేటాయించే పరిస్థితి కూడా కొన్ని పాఠశాలల్లో లేదు. ఉద్యమాల ద్వారా, పత్రికల ద్వారా సమస్య బలంగా ముందుకు వచ్చిన తరువాత ఉన్నత పాఠశాలలలో వసతులు లేకపోతే 3, 4, 5 తరగతుల బాలలు తమ ప్రాథమిక పాఠశాల్లోనే ఉండాలనీ, అయితే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వారికి సబ్జెక్టులవారీగా బోధించాలని ఆదేశాలు ఇచ్చారు. అదనపు ఉపాధ్యాయులు ఏ ఉన్నత పాఠశాలలోనూ లేరు. అనేక ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ప్రాథమిక పాఠశాలలకు పోయి ఎవరు చెప్పాలి? దీనిని పరిష్కరించడానికి ప్రాథమిక పాఠశాలల నుంచి మిగులు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకు పంపాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లోనూ మిగులు ఉపాధ్యాయులు లేరు. అయినప్పటికీ ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు పంపారు. దీనివలన కొత్తగా వేలాది ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. అప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీరలేదు. పరిష్కారంగా ఉన్నత పాఠశాలలలో సమాంతరంగా కొనసాగుతున్న మాతృభాషామాధ్యమాన్ని రద్దుచేశారు. దీనివల్ల ఆంగ్ల మాధ్యమం తమకు ఇబ్బందని, కోరి తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అదలా ఉంచితే– ఆంగ్ల మాధ్యమాన్ని రద్దుచేసినా ఉపాధ్యాయులు చాలలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పునర్ వ్యవస్థీకరణ ఫలితంగా మొత్తం పాఠశాల వ్యవస్థ గందరగోళానికి గురైంది. ఇంకా, ఇప్పుడు 250 మీటర్ల పరిధికి కూడా పరిమితం కాకుండా 2కి.మీ వరకు 3, 4, 5 తరగతుల విలీనానికి మ్యాపింగ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు (జీవో 20) ప్రకారం బాలబాలికలకు 5వ తరగతి వరకు విద్య ఒక కిలోమీటరు సామీప్యంలోనే ఉండాలి. అందుకే జీవో 20 (మార్చి 2011)ని సవరిస్తూ జీవో 85ని తీసుకువచ్చారు. ఇందులో సామీప్య పరిమితిని ఒకేసారి ఒక కి.మీ నుంచి 3కి.మీ.కి పెంచివేశారు. 3 కి.మీ దూర పరిధిలో ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలలు ఇప్పటికే ఉన్నాయి. జీవో 85 అమలు జరిగితే రాష్ట్రంలో ఉన్న మొత్తం 32వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కూడా ముక్కలవుతాయి. వాటిలో ఉన్న 3, 4, 5 తరగతుల బాలలు ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు పంపబడతారు. ఆ భవనాలలో 1, 2 తరగతులు కొనసాగుతాయి. అక్కడికి ఆగలేదు. ఈ భవనాలకు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అంగన్‌వాడీలను మారుస్తారు. అంటే అంగన్‌వాడీలు ఆవాసాలకు దూరం అవుతాయి. బాలింతలకు, గర్భిణీలకు దూరం అవుతాయి. ఈ ప్రక్రియ ఒక గొలుసుకట్ట సంక్షోభాలను సృష్టిస్తున్నది.
ఇన్ని సంక్షోభాలు సృష్టిస్తున్న ఈ పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేస్తున్నట్లు? విద్యా ప్రమాణాల పెంపుదలకే ఇదంతా చేస్తున్నామని అధికారులు, మంత్రులు చెబుతున్నారు. నిజమే ప్రభుత్వ పాఠశాలలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ విద్యను మెరుగుపరచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి, తగినంతమంది ఉపాధ్యాయులను నియమించాలి. అయితే, మౌలిక సదుపాయాల విషయమై కొంతలో కొంత శ్రద్ధ చూపిస్తున్న ఈ ప్రభుత్వం రెండున్నరేళ్ళుగా ఉపాధ్యాయ ఖాళీలకు నియామకాలు మాత్రం జరపలేదు. ప్రభుత్వ కాలం సగం గడిచింది. కాని ఇంత వరకు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా విద్యా ప్రమాణాలు ఎలా పెంచగలుగుతారు?
3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు తరలించడం ద్వారా వారికి సబ్జెక్టులవారీ బోధన సాధ్యమవుతుందని, ఫలితంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం అంటుంది. ఇది సబబైన కారణం కాదు. 5వ తరగతి వరకు విద్యార్థులకు తరగతుల వారీ సమన్వయ బోధన అవసరం. సబ్జెక్టుల వారీ బోధన మంచిది కాదు. ఉన్నత పాఠశాలలలో విశ్లేషణా పద్ధతి ఉంటుంది కాబట్టి సబ్జెక్టుల వారీ బోధన అక్కడ అవసరం. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు భాషలు, గణితం, పరిసరాల విజ్ఞానం మధ్య ఒక సమన్వయాన్ని సాధిస్తూ బోధన చేయాలి. ఆ పని తరగతి ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడు. అందుకే ప్రాథమిక స్థాయిలో విషయ ఉపాధ్యాయులు కాకుండా తరగతి ఉపాధ్యాయుల అవసరం అవుతారు. ప్రాథమిక స్థాయిలో తరగతి ఉపాధ్యాయుడు, సమన్వయ విద్య అన్న భావనలనే ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వం రద్దుచేస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి బోధనా విషయానికి ఒక ఉపాధ్యాయుడు ఆదర్శమైన విధానం. విద్యావ్యాపారీకరణ వలన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున కనీసం ఇద్దరు ఉపాధ్యాయుల నిబంధన పాటిస్తూ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని బట్టి అదనపు ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాల కొరకు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రస్తుతం ఉన్న 30:1 నుంచి 20:1గా మార్చాలని, అందులో భాగంగా ఆంగ్లోపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలనే విజ్ఞప్తులను ఈ ప్రభుత్వం పెడచెవిని పెడుతున్నది. అవసరమైన పనిచేయకుండా అనవసరమైన గందరగోళాలు సృష్టిస్తున్నది. ఆపైన విద్యారంగ సంస్థల సూచన మేరకు గత ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు నాలుగువేల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఈ ప్రభుత్వం రద్దుచేసింది. ఆంగ్లోపాధ్యాయ పోస్టు అడిగితే ఇవ్వకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుడిని ఇవ్వను, నిఘంటువును ఇస్తానంటుంది.
విద్యాహక్కు చట్టం మూల లక్ష్యాలకే ప్రభుత్వ చర్యలు భంగకరంగా ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేది పేద, నిరుపేద కుటుంబాల బాలబాలికలు. వారి ఇళ్ళల్లో తల్లిదండ్రులు ఉదయాన్నే పనికి వెళ్ళిపోతారు. వారిని పాఠశాల వద్దకు దిగబెట్టేవారు ఎవరూ ఉండరు. ప్రధానంగా 3, 4, 5 తరగతుల బాలల విషయం తీసుకుంటే వారు స్వయంగా పొరుగూరికి 2, 3 కిలోమీటర్ల దూరం ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్‌కు, హైస్కూలుకు వెళ్ళలేరు. పాఠశాల గ్రామంలోనే ఉంటే వారు తోటి పిల్లలతో కలసి పాఠశాలకు వెళ్ళగలరు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు తరలించడం ద్వారా ఈ బాలలకు విద్య దూరం అవుతుంది. వారికి ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు ఇస్తామంటున్నారు. పాఠశాల సమయానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉంటుందని గ్యారంటీ ఏమిటి. ప్రైవేటు వారు అయితే పాఠశాల బస్సులో వెళతారు. ప్రభుత్వం పాఠశాలలకు బస్సులు వేయబోతుందా, వేసినా అవి సక్రమంగా నడుస్తాయా? అసలు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి ఈ బాలలను దూరం ఎందుకు పంపించాలి? పట్టణాలలో సమస్య మరొక రకమైనది. అక్కడ ఉన్నత పాఠశాలలలో గదులు కడదామన్నా స్థలం లేదు. అనేక మున్సిపల్ ఉన్నత పాఠశాలలలో విద్యార్థులు సైకిళ్ళు పెట్టుకోవడానికి స్థలం లేదు. ఇంకా చెప్పాలంటే అందరూ నిలవడానికే స్థలం లేదు. అసలు పట్టణాలలో ప్రమాదకరమైన రోడ్లు దాటుకుని ఈ చిన్న తరగతుల బాలలు ఏవిధంగా ఉన్నత పాఠశాలలకు వెళ్ళగలరు. ప్రమాణాలు గల విద్య ఇస్తామన్న పేరుతో ఉన్న విద్యావకాశాలను కూడా ఈ ప్రభుత్వం రద్దుచేస్తున్నది.
💥 రమేష్ పట్నాయక్‌కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ
0 Post a Comment:
Post a Comment