వేతనాల కోతతో 750 కోట్లు మిగులు - 11వ పీఆర్సీతో వేతనాల పద్దులో భారీ కోత
వచ్చే నెల నుంచి సర్కారుకు భారీగా ఆదా
స్కీమ్‌లు వాయిదా, బిల్లులన్నీ పెండింగ్‌లోనే
ఆదాయమూ ఉంది.. అప్పూ అందుతోంది
కానీ, అత్యవసర ఖర్చులకూ మొండిచేయే
పదకొండో పీఆర్సీ అంటూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన జగన్ ప్రభుత్వం.. దానివల్ల నెలకు రూ.750 కోట్లకు పైగానే మిగుల్చుకోనుంది. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు కూడా సకాలంలో పూర్తిగా ఇవ్వడం లేదు. ఈ నెలలో అమలు చేయాల్సిన రెండు పథకాలు అమ్మఒడి, ఈబీసీ నేస్తం సైతం వాయిదా వేశారు. ఈ రెండు పథకాల వాయిదా ద్వారా ప్రభుత్వానికి రూ.7,000 కోట్లు మిగులుతోంది. ఇవి చాలవు అన్నట్టు రాష్ట్రానికి ఏదో మార్గంలో అప్పులు వస్తూనే ఉన్నాయి. అయినా.. కొత్తగా ఒక్క పెండింగ్ బిల్లును కూడా ప్రభుత్వం క్లియర్ చేయడం లేదు. అత్యవసర సేవలపై ఒకపైసా అదనంగా పెట్టడం లేదు. జీతాలకు, పెన్షన్లకు ప్రతిసారీ వెతుక్కోవడమే. దీంతో వచ్చిందేంతో.. తెచ్చిందేంతో.. వాటిలో ఖర్చు చేసిందేంతో తెలియని అయోమయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకున్నాయి. రాష్ట్ర ఖజానాకు ప్రతి నెలా రూ.11వేల కోట్ల ఆదాయం వస్తోంది. ప్రభుత్వ అత్యవసర ఖర్చులన్నీ వాయిదా పడినప్పుడు ఖజానాకు వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడానికి కొత్త అప్పుల కోసం ఎదురుచూడాల్సివస్తోంది. ఈ నెల అయితే అవ్వాతాతల పెన్షన్లకు కూడా చివరి నిమిషంలో ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. అప్పొస్తేనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇస్తున్నారు. లేదంటే జీతాలు, పెన్షన్లు పెండింగ్‌లో ఉంచుతున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి రూ.2,500 కోట్ల కొత్త అప్పునకు అనుమతి తెచ్చారు. వాటితోకూడా పూర్తిగా వేతనాలు, పెన్షన్లు చెల్లించలేదు. ఆ డబ్బు ఏం చేశారో తెలీదు. మళ్లీ వారాంతం వచ్చేసరికి కొత్త అప్పుల కోసం ఢిల్లీ వెళ్లారు. పైగా ‘కాగ్’ ప్రతి నెలా ఇచ్చే నివేదికలో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోందని చెప్తోంది. కానీ సీఎం మాత్రం తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం తగ్గుతోందంటూ ఇటీవల ఉద్యోగులకు చెప్పారు. ఆదాయం పెరుగుతోంది. అమ్మఒడి లాంటి పెద్ద ఖర్చులు వాయిదా వేసుకుంటున్నారు. కచ్చితంగా ఇ వ్వాల్సిన వేతనాలు, పెన్షన్ల విషయానికొచ్చే సరికి నాన్చివేత ధోరణి అ వలంబిస్తున్నారు. మరోవైపు అప్పుల కోసం కేంద్రం చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పులు తెచ్చుకుంటున్నారు. కానీ, వాటిలో ఒక్క పైసా కూడా ఖర్చు పెడుతున్నట్టు కనిపించడం లేదు.
0 Post a Comment:
Post a Comment