Tuesday 18 January 2022

ప్రతి ఉద్యోగికీ నెలకు 4 వేలు నష్టం : కొత్త సూత్రం చెప్పిన జగన్‌

 ప్రతి ఉద్యోగికీ నెలకు 4 వేలు నష్టం : కొత్త సూత్రం చెప్పిన జగన్‌



పీఆర్‌సీ అంటే జీతం తగ్గింపు!

కొత్త సూత్రం చెప్పిన జగన్‌

ఆర్థిక లబ్ధిలోనూ భారీ కోత

ఐఆర్‌ అమలు తేదీ నుంచి ఇవ్వాల్సి ఉండగా 9 నెలలు కోత

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ వల్ల ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున రూ.4 వేల నష్టం. అది కూడా బేసిక్‌ జీతం సగటున రూ.35 వేలు ఉన్నవాళ్లకు. ఆ వేతనం ఇంకా ఎక్కువ ఉన్నవాళ్లకు ఇంకా ఎక్కువ నష్టం. పీఆర్‌సీపై ప్రభుత్వం చేసిన కసరత్తులు, గిమ్మిక్కులు చరిత్రలోనే తొలిసారని అంటున్నారు. అసలు పీఆర్‌సీ నివేదికే బయటపెట్టకపోవడం నుంచి.. వేతన సవరణ అంటే జీతాలు పెంచడం కాకుండా తగ్గించడం అని చెప్పడం కూడా ఇదే మొదటిసారి. మధ్యంతర భృతి (ఐఆర్‌) కంటే పీఆర్‌సీ తక్కువ ఇస్తారని ఏ ఒక్కరూ ఊహించలేదు. కనీసం ఐఆర్‌ ఇచ్చినంత అయినా ఫిట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఐఆర్‌ 27 శాతం ఇస్తే.. ఫిట్‌మెంట్‌ 23 శాతమే ఇచ్చారు. అంటే నాలుగు శాతం తగ్గించారు. పీఆర్‌సీ అమలు 2020 నుంచి కాబట్టి ఈ రెండేళ్లలో రెండు ఇంక్రిమెంట్లు తగ్గిపోయినట్లు లెక్క.

 4 వేలు తగ్గిందిలా...

బేసిక్‌ పే రూ.35 వేలు ఉన్న ఉద్యోగికి ఐఆర్‌ కంటే 4శాతం తక్కువగా ఫిట్‌మెంట్‌ రావడం వల్ల నెలకు రూ.1400 చొప్పున తగ్గిపోయింది. ఈ రెండేళ్లలో రెండు ఇంక్రిమెంట్లు అంటే రూ.2,800 తగ్గింది. దీనిపై డీఏ 20 శాతం (రూ.560) తగ్గినట్లే. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) తగ్గింపు వల్ల కనీసం 8 శాతం తగ్గిందనుకున్నా రూ.224 తగ్గినట్లే. సిటీ కాంపెన్సెటరీ అలవెన్స్‌ (సీసీఏ) రూ.500-700 వరకు తగ్గింది. ఇవన్నీ కలిపితే సగటు బేసిక్‌ పే రూ.35 వేలు ఉన్న ఉద్యోగికి నెలకు రూ.4 వేల వరకు నష్టం జరిగినట్లే! ఈ నష్టం సదరు ఉద్యోగి ఉద్యోగ కాలమంతా కొనసాగుతుంది. సర్వీసు పెరిగి.. బేసిక్‌ వేతనం పెరిగేకొద్దీ నష్టం పెరుగుతూనే ఉంటుంది.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో మార్పు వల్ల ప్రతి ఉద్యోగికీ నష్టం జరిగింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో.. పనిచేసే ప్రదేశాన్ని బట్టి ఇప్పటివరకు ఇంటి అద్దె భత్యం 12, 14.5 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున ఉండేది. ఇప్పుడు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్న ఉద్యోగులకు ఇకనుంచి 8 శాతమే ఇవ్వనున్నారు. 14.5 శాతం పొందుతున్నవారికీ 8 శాతమే. 20 శాతంలో ఉన్నవారు 12 శాతమే పొందుతారు. ఇక గతంలో సచివాలయంలో పనిచేసేవారికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వగా దానిని 16 శాతానికి తగ్గించేశారు. ఒక ఉద్యోగి బేసిక్‌ జీతం రూ.13 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. సగటున రూ.40 వేలు బేసిక్‌ జీతం అనుకుంటే ఒక్క హెచ్‌ఆర్‌ఏ తగ్గింపుతోనే నెలకు రూ.1,600 నుంచి రూ.6,400 వరకు నష్టపోతున్నారు. ఈ శ్లాబులు కూడా 2021 జనగణన ఆధారంగా కాకుండా 2011 జనగణన ప్రకారం ఇస్తామన్నారు.

ఫిట్‌మెంట్‌లో మెలిక...

ఫిట్‌మెంట్‌లో పెట్టిన మరో మెలికతో ఉద్యోగులకు రావలసిన డీఏ బకాయిలు ఎగిరిపోయాయి. సాధారణంగా ఐఆర్‌ అమలు చేసిన తేదీ నుంచి పీఆర్‌సీ ఆర్థిక లబ్ధి ఇస్తారు. జగన్‌ ప్రభుత్వం మాత్రం 2019 జూలై 1నుంచి ఐఆర్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు దానికంటే పెరిగిన మొత్తాన్ని కలిపి.. ఐఆర్‌ కాలానికి కూడా కలిపి చెల్లించాలి. అయితే సర్కారు ఐఆర్‌ కంటే తక్కువగా ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఇక అదనంగా చెల్లించాల్సిందేమీ లేకుండా చేసింది. అంతేకాకుండా ‘పీఆర్‌సీని అమలుచేయాల్సింది 2020 ఏప్రిల్‌ 1నుంచి. కానీ మేం 2019 జూలై 1 నుంచే ఐఆర్‌ ఇచ్చాం కాబట్టి ఆ 9 నెలల కాలానికి మేం ఇచ్చిన ఐఆర్‌ 27 శాతం వెనక్కి ఇవ్వాల్సిందే. దానిని మినహాయించుకునే మీకివ్వాల్సిన డీఏలు చెల్లిస్తాం’ అని స్పష్టం చేసింది. *ఉదాహరణకు రూ.37,100 బేసిక్‌ జీతం ఉన్న ఉద్యోగి.. ఆ 9 నెలల కాలానికి పొందిన ఐఆర్‌ రూ.90,153. ఆ మొత్తాన్ని తామివ్వాల్సిన డీఏ బకాయిల నుంచి, అవీ సరిపోకుంటే భవిష్యత్‌ డీఏల నుంచి మినహాయించుకుంటామని* ప్రభుత్వం పేర్కొంది. 

గ్రాట్యుటీపై భిన్నంగా...

ఐఆర్‌ను ముందే ఇచ్చేశామంటూ 9 నెలల కాలానికి కోత వేసేసిన ప్రభుత్వం.. రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ విషయంలో మాత్రం భిన్నంగా వెళ్లింది. గ్రాట్యుటీని రూ.12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. మరి దీనిని కూడా 2020 ఏప్రిల్‌ 1 నుంచే.. అంటే పీఆర్‌సీ అమలు తేదీ నుంచే చేయాలి కదా! కానీ చేయలేదు. ఫిట్‌మెంట్‌పై జీవోలిచ్చిన తేదీన అంటే సోమవారం నుంచి అమలు చేస్తామన్నారు. దాదాపు ఈ 20 నెలల కాలంలో రిటైరైన వారికి కొత్త గ్రాట్యుటీ వర్తించదు. అదేవిధంగా పదవీ విరమణ వయసు రెండేళ్లు పెంచడంతో రాబోయే రెండేళ్ల కాలంలో రిటైర్మెంట్లు ఉండవు. అంటే రెండేళ్ల వరకూ గ్రాట్యుటీ చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఎవరైనా ఉద్యోగి చనిపోతే.. అంత్యక్రియల ఖర్చులకు అతడి చివరి ఫించ ను మొత్తం.. లేదంటే కనీసం రూ.15వేలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.20 వేలకు పరిమితం చేశారు. 

సీపీఎస్‌ కాదు.. సీపీఏ రద్దు :

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎ్‌స)ను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. గద్దెనెక్కాక మాట తప్పారు. మడమా తిప్పారు. కానీ ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే సిటీ కాంపెన్సెటరీ అలవెన్స్‌(సీపీఏ)ను మాత్రం రద్దు చేసేశారు. నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఈ అలవెన్స్‌ ఇచ్చేవారు. ఇది దశాబ్దాల నుంచీ అమల్లో ఉంది. రూ.500-700 వరకు వచ్చేది. ఇప్పుడిది రాదు.

ఇక ఆశలు వదులుకోవడమే...

అన్నిటికంటే ఉద్యోగులను కలవరపెడుతున్న అంశం.. ఇక రాబోయే రోజుల్లో ఐదేళ్లకోసారి పీఆర్‌సీ వేయరు. రాష్ట్రప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పించుకుంది. కేంద్రప్రభుత్వ పీఆర్‌సీ ప్రకారమే జీతాలు పెంచుతామని స్పష్టం చేసింది. కేంద్ర పీఆర్‌సీ పదేళ్లకోసారి ఉంటుంది.

పెన్షనర్లకూ కోత...

కోతకు కారెవరూ అనర్హం అన్నట్లుగా పదవీ విరమణ చేసి పింఛన్లు అందుకుంటున్నవారికీ ప్రభుత్వం కోతలు పెట్టింది. 70-80 ఏళ్ల మధ్య వయసున్న పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ పింఛనును తీసేసింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top