Saturday 18 December 2021

మార్కెట్ వలయంలో మాతృభాష

 మార్కెట్ వలయంలో మాతృభాష



వర్తమాన సమాజంలో తెలుగు భాష ఆంగ్లీకరణ అవుతోంది. సంస్కృతిని, దానిలోని మనిషిని నిర్దేశిస్తున్న మార్కెట్ వ్యవస్థ ప్రాంతీయ సమాజాల్లోకీ చొచ్చుకొని వచ్చేసింది. అది ప్రాంతీయ భాషల్లోకి రాలేదన్నది అసంపూర్ణ సత్యమే. ఈ నేపథ్యంలో తెలుగు భాష గుర్తింపు, అవసరం తగ్గింది. ఈ తరుగును పూడ్చేందుకు కృషి జరగాలి. మాతృభాష విషయంలో సైతం డిమాండ్‌ను బట్టే సప్లై ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు.

వస్తు వినియోగ సమాజంలో మనిషి సరుకుగా మారిన సందర్భం ఇది. ఆదాయ వ్యయ అంచనాల మధ్య జీవితాన్ని సరికొత్తగా నిర్వచించుకుంటున్న తరుణం ఇది. ఒకవైపు ప్రాంతీయ, కుల, వర్గ, లింగ, మత అస్తిత్వాలు, మరోవైపు అంతర్జాతీయ ఏకీకృత ఒడంబడికల ప్రభావంతో సంస్కృతిని సరికొత్తగా చూస్తున్నసమయం ఇది. మనిషి విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పెరుగుతున్న ప్రస్తుత కాలంలో మాతృభాషలను ఎలా చూడాలన్నది ప్రస్తుత సమస్య. పల్లె మొదలు మహానగరాల్లోని కార్పొరేట్ సంస్థల వరకు ఉన్న సంక్లిష్ట, సంయోజన, వైవిధ్య, భిన్నత్వాల మధ్య ఏకీకృతం అబద్ధమని అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవం. అవసరాలు, అవకాశాలు, ఆదాయాల చుట్టూ పరిభ్రమించే మనిషికి మాతృభాషా ప్రయోజనం ఏమేరకు అన్నది తప్పక గుర్తించాల్సిన చేదు నిజం. మాతృభాష ఆదాయ వనరుగా లేని సమకాలీన వ్యాపార సామాజిక పరిస్థితుల్లో ప్రేమ, అభిమానం, ఆత్మగౌరవం లాంటి భావోద్వేగాలతో తల్లి భాషను నిలబెట్టలేమన్నది అందరూ గుర్తించాల్సిన సత్యం.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆంగ్లవిద్య ప్రైవేటు విద్యాసంస్థలలో నల్లేరుమీద నడకలా సాగిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రజాభీష్టమై విజయకేతనాలు ఎగరవేస్తుంది. శాస్త్రీయతకు లొంగని మోహపు మాటలతో ఆంగ్లవిద్యావసరాలను అంతర్జాతీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వాలే కల్పించాయి. నిద్ర లేచింది మొదలు వాడే పేస్ట్, బ్రెష్ నుంచి రాత్రికి నిద్రపోయే బెడ్, బెడ్ షీట్ వరకు వాడుతున్న ఆంగ్ల పదజాలమంతా వ్యాపారంతో నిండిన ఆంగ్ల సంస్కృతీకరణకు ప్రతిరూపాలే. వాటిని బాల్యదశ నుంచే అలవాటు చేయడం నిత్యజీవనంలో భాగమైపోయింది. అంటే జీవితంలోని ప్రతి నిముషం ఆంగ్లీకరణమే, వ్యాపారమే అనడంలో అతిశయోక్తి లేదు. దీనిని నియంత్రించే శక్తి ప్రభుత్వాల దగ్గరే ఉంది. భాషాభిమానులు, భాషోద్యమకారుల దగ్గర సలహాలు, సూచనలు మాత్రమే ఉన్నాయి.

శాస్త్రీయమైన ఆలోచన లేకుండా నేటికీ చాలామంది తెలుగు అంటే పద్యాలు, పాటలు, రామాయణ, మహాభారతాలు వంటివే అనుకుంటున్నారు. తెలుగు మాతృభాష అనగానే ఉద్వేగానికి లోనవడం, తెలుగు గొప్పతనం గురించి, కవుల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం, పద్యాలు పాడటం అలవాటైపోయింది. భాషను సామాజిక, సాంస్కృతిక దృష్టితో గమనించి, అర్థంచేసుకునే ఆలోచనే విద్యావంతుల్లో కూడా లేకుండా పోతుంది. భాషకు ప్రామాణికం ఆ భాష మాట్లాడే వ్యక్తులు. పదజాలం. ఆ వ్యక్తులు లేని రోజు భాషే కనుమరుగవుతుంది. తెలుగుభాషను కేవలం సాహిత్య పరిధికి మాత్రమే కుదించే పని ఇంకా జరుగుతూనే ఉంది. భాషలో సాహిత్యం ఓ భాగం మాత్రమే. ఇద్దరు వ్యక్తుల భావ వాహిక భాష. భాషను సన్మానాలు, అవార్డులు, వేదికలపై చప్పట్లలో వెదికితే అది అసంపూర్ణ అసంకల్పిత చర్యే అవుతుంది. తెలుగుభాషా వ్యవహర్తలను పెంచేలా, ఎక్కువ మంది అభ్యసించేలా, తెలుగు పదజాలం తగ్గకుండా, కొత్తపదజాలం సృష్టించే దిశగా కృషి జరగాలి. అందుకు సాహిత్యం కూడా ఓ పునాదిరాయి అవుతుంది. 

ప్రవాహశీలమైన భాష మానవ అవసరాలకు అనుగుణంగా తనను తాను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఆ తర్వాతే వ్యాకరణాలు, నిర్మాణ పద్ధతులు, సాహిత్యం పుడుతూ, మారుతూ ఉంటాయి. భాషలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించాల్సిందే. అలాగే చారిత్రక, తులనాత్మక, వర్ణనాత్మక భాషా వ్యాకరణాలను నిర్మించుకొని వర్తమానం నుంచి భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసుకోవాల్సిందే. తెలుగు అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఈ దృష్టితో తెలుగును బోధించాల్సి ఉంది. గతంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోకుండానే వర్తమాన ఆవశ్యకతకై విద్యార్థులను సిద్ధం చేయాల్సిందే. ఇల్లు, బడుల్లో పద్యాలు, పాటలు నేర్పిస్తూ, వారిలో సృజనాత్మక ఆలోచనలకు బీజం వేస్తూ, భాషపై శాస్త్రీయమైన ఆలోచనలు కలిగించాలి. చిన్నారుల్లోనే కాదు వాళ్ల తల్లిదండ్రుల్లోనూ ఇలాంటి ఆలోచనలు రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఇవన్నీ ఆర్థికాంశంతో ముడిపడినవని గుర్తుంచుకోవాలి.

రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకోసం పనిచేస్తాయంటారు. దీనికున్న మరో కోణం అధికారం కోసం పనిచేయడం. ఆ అధికారాన్ని నిలబెట్టే ఓట్లకోసం పనిచేయడం. మరి మాతృభాషలు ఎంతవరకు ఓట్లకు పెట్టుబడిగా మారగలవు? ఎంతవరకు ప్రజలను తమవైపు, తమ పార్టీ వైపు తిప్పగలవు? అని రాజకీయ పార్టీలు, నాయకులు ఆలోచిస్తారు. మాతృభాషా చైతన్యం ఒకప్పుడు ప్రజలను ఓట్లుగా మార్చిన శక్తే. కానీ నేడు మార్కెట్ మయమైన జీవనంలో ప్రజల ఆలోచనలు వ్యాపారాత్మకమైన వస్తువులు, సుఖాలవైపు మరలాయి. అందుకే నాయకులూ, పార్టీలు భాషను, సాహిత్యాన్ని వదిలేసి ఉచిత పథకాలు, బహుమతులు, సంక్షేమ ఫలాలు, కులాలు, మతాలు వంటి వాటిని ఓట్లకోసం మార్గాలుగా ఎంచుకుంటున్నాయి.

అందువల్లే భాషా మంత్రిత్వశాఖ అటుంచి, భాషకోసం పనిచేసే అధికార భాషా సంఘాలు, అకాడమీలు వంటివాటిని నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి. అవి తెలుగునేలపై నిధుల కొరత, పర్యవేక్షణ కొరత, సభ్యుల కొరతతో ఉన్నా... లేనట్లే పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు వీటివైపు అరకొర చూపుల్ని సైతం సారించలేకున్నాయి. ఎందుకంటే ఇవి వారి అధికారంకోసం ఉపయోగపడని సంస్థలు. పైగా నిధులూ దుబారానే. పార్టీలు మేనిఫెస్టోల్లో భాషను చిన్న అంశంగా చేర్చినా, అది అంతవరకే. అధికారంలోకి వచ్చాక కనుమరుగయ్యేదే. మాతృభాషపై ఇలాంటి ఆలోచనలున్న పార్టీలు తెలుగు భాషను నవీకరించి, అభివృద్ధి పరిచి, తర్వాతి తరాలకు అందేలా కృషి చేస్తాయనడం కుందేటికొమ్మును వెతకడమే. 

నిజానికి తెలుగు చదువుకున్న వాళ్లకు విద్య, ఉద్యోగావకాశాల్లో కొంత రిజర్వేషన్ కల్పించాలి. తెలుగులో ఉన్నత విద్య అభ్యసించిన వాళ్లకు ప్రత్యేక ఉపాధి మార్గాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో, సాంకేతిక విద్యాసంస్థల్లో అవకాశాలు కల్పించి తీరాలి. అసలు మాతృభాష చదివిన వారికి ఉద్యోగ భద్రత ఉండేలా నిర్ణయం తీసుకుంటే తెలుగు చదివేవారి సంఖ్య పెరుగుతుంది. భాషాభివృద్ధీ జరుగుతుంది. తర్వాతి తరానికి తెలుగు భాషా సాహిత్యాలూ అందుతాయి. 

తెలుగుకు ప్రామాణికత కాదు, ప్రాణాలు ముఖ్యం. నేటికీ గ్రామాల్లో అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు బతికే ఉంది. ప్రసార మాధ్యమాలు తెంగ్లిషులో గగ్గోలు పెడుతున్నా పెద్దతరం వద్ద అచ్చమైన తెలుగు నిలిచే ఉంది. నవనాగరికతలో భాగస్వాములు కాని తరం వారిది. నేటితరం గ్రామాలకు, నగరాలకు, విదేశాలకు మధ్య తెరను తొలగించి, జీవనం సాగిస్తున్నారు. వీళ్ల దగ్గర కొంతవరకే తెలుగు మిగిలి ఉంది. కానీ నయా వినియోగ సమాజంలో భాగస్వాములైనందున వీళ్ల తెలుగులో ఆంగ్లం, ఆంగ్లీకృత తెలుగు కనిపిస్తుంది. భావితరంగా ఎదుగుతున్న వారు ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ, విదేశీ సంస్కృతిలో బతకడం వల్ల వీళ్ల నోటిలో తెలుగు భాష కూడా ఆంగ్లీకరించబడే వెలువడుతుంది. అందుకే భాషను బతికించే పని వర్తమాన తరం మీదే ఎక్కువగా ఉంది.

ఉన్నత వర్గాల వారు ఎప్పుడూ సామాజిక హోదా ఉన్న భాషలోనే మాట్లాడుతారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు, బడా వ్యాపారస్తులు, సమాజంలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వాళ్లు ఆంగ్లభాషలోనే ఎక్కువగా మాట్లాడతారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే తెలుగును ఉపయోగిస్తారు. ఇక మధ్యతరగతి వాళ్లు పై వర్గాన్ని అనుసరించే క్రమంలో వేషభాషల్లో, దైనందిన కార్యక్రమాల్లో వాళ్లే వీళ్లకు ప్రమాణం కాబట్టి, ఆంగ్లభాషపై, నయా సంస్కృతిపై ఇష్టాన్ని పెంచుకొంటారు. అలాగే వ్యవహరిస్తారు, ప్రవర్తిస్తారు. అనుకరిస్తారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఆంగ్లమే అవకాశాలను కల్పిస్తోందని భావిస్తున్నారు కాబట్టి దానినే మాట్లాడతారు. కింది వర్గం దైనందిన బతుకుకోసమే కష్టపడుతుంది, కాబట్టి వీళ్లకు ఈ భాషాగోల పట్టదు. వర్తమాన సమాజంలో అవసరాలకోసం ఉపయోగించాల్సిన భాషను మాత్రమే నేర్చుకుంటూ ఉంటారు. కానీ వీళ్లు టీవీ మాధ్యమ భాషను అనుకరించే అవకాశం ఉంది. కాబట్టి తెలుగును కాపాడాల్సిన బాధ్యత పై రెండు వర్గాల మీదా ఉంది.

మొత్తంగా వర్తమాన సమాజంలో తెలుగు భాష ఆంగ్లీకరణ అవుతుందనేది వాస్తవం. ఉపాధి, ఉద్యోగావసరాల కోసం ఆంగ్లం నేర్చుకోవడం తప్పనిసరైందని అందరూ అంగీకరిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ వ్యవస్థే సంస్కృతిని, దానిలోని మనిషిని నిర్దేశిస్తున్న మార్కెట్ వ్యవస్థ ప్రాంతీయ సమాజాల్లోకీ చొచ్చుకొని వచ్చేసింది. అది ప్రాంతీయ భాషల్లోకి రాలేదన్నది అసంపూర్ణ సత్యమే. ఈ నేపథ్యంలో తెలుగు భాష గుర్తింపు, అవసరం తగ్గింది. ఈ తరుగును పూడ్చేందుకు కృషి జరగాలి. మాతృభాష విషయంలో సైతం డిమాండ్‌ను బట్టే సప్లై ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని అసలు మర్చిపోకూడదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top