Saturday, 18 December 2021

వెనకబడిపోయారు... ఎదురుతిరుగుతున్నారు - బడి పిల్లల ప్రవర్తనలో తీవ్ర మార్పులు

వెనకబడిపోయారు. ఎదురుతిరుగుతున్నారు - బడి పిల్లల ప్రవర్తనలో తీవ్ర మార్పులునిర్లక్ష్యం పెరిగింది. క్రమశిక్షణ  లోపించింది. కొత్త అలవాట్లూ నేర్చుకున్నారు. మూడు నెలల కాలంలో గుర్తించిన ఉపాధ్యాయులు.వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.

ఓ పిల్లాడు బడిలోనే గుట్కా తింటున్నట్టు కరీంనగర్‌ జిల్లాలోని ఉపాధ్యాయుడు గుర్తించి ప్రశ్నించారు. ‘‘బడికి రాకూడదనే అనుకున్నాను  సర్‌. పరీక్షలు కదా! నాలుగు రోజులు  వచ్చిపోతా’’ అనే జవాబు అవతలవైపు నుంచి రావడంతో ఆయన  అవాక్కయ్యారు.

‘‘హోంవర్క్‌ చేయకుండా బడికెందుకొచ్చావు. ఇంటికిపో’ అని గద్దించిన ఉపాధ్యాయుడికి ఓ పాఠశాల  విద్యార్థి షాక్‌ ఇచ్చాడు. మారు మాట్లాడకుంటే ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. చివరికి ఆయనే బతిమాలి బడిలో కూర్చోబెట్టాల్సి వచ్చింది.

నిజామాబాద్‌లోని ఓ వైద్య   కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి విద్యార్థి తండ్రికి  ఫోన్‌ వచ్చింది. ‘మీ అబ్బాయి రోజూ ఆలస్యంగా వస్తున్నాడు. అడిగితే గుర్రుగా చూస్తున్నాడు. మీరు మార్చుకుంటారా? నన్నే మార్చమంటారా?’’ అనడంతో ఆయన అవాక్కయ్యాడు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ   ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తుండగా మొబైల్‌ ఫోన్లతో ఫొటోలు తీస్తూ పలుమార్లు విద్యార్థులు దొరికారు. తోటి అమ్మాయిల ఫొటోలు కూడా తీస్తున్నట్టు అక్కడి గురువులు గుర్తించారు.

కరోనా కారణంగా బడులు మూతపడటం, తర్వాత ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగడంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు విద్యార్థులు బడులకు దూరమయ్యారు. ఈ కాలంలో చాలామంది చదువులను అటకెక్కించేశారు. పొలం పనులు సహా ఇతర కూలీ పనులకు వెళ్లడం అలవర్చుకున్నారు.  కరోనా రెండో ఉద్ధృతి తర్వాత సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులు మొదలై పిల్లలు మళ్లీ బడిబాట పట్టినప్పటికీ దీర్ఘకాలం బడికి దూరమైన నేపథ్యంలో వారి ప్రవర్తనలో మార్పులు వచ్చినట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. మూడు నెలలుగా విద్యార్థులను గమనిస్తున్న ఉపాధ్యాయులు.. కొందరి వైఖరిలో తీవ్ర మార్పులను గమనించి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తున్నారు. ‘‘ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఏమైనా అంటే ఎదురు ప్రశ్నిస్తున్నారు. మాపైనే జోకులు పేలుస్తున్నారు. అందరూ అలాగే ఉన్నారని చెప్పలేంగానీ కనీసం 25 శాతం మంది వైఖరిలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బాలురలో క్రమశిక్షణ లోపించింది. నిర్లక్ష్య ధోరణి, మొండితనం పెరిగిందని’’ పలువురు ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల సమావేశాల్లో చెబుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు. ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్‌ సహా వృత్తి విద్య కళాశాల విద్యార్థుల్లోనూ ఇలాంటి వ్యవహార శైలే గుర్తించినట్లు అధ్యాపకులు చెబుతున్నారు.

మూడో వేవ్‌ వస్తుంది. పాసైపోతాంలే :

చాలా మందిలో చదువుపై గతంలో ఉన్నంత ఆసక్తి కనిపించడంలేదనే భావనను ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు. ‘బాగా గుర్తుండేలా చేసే క్రతువులో భాగంగా చదివింది రాసుకుని వచ్చే విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలుచేసి సత్ఫలితాలు సాధించా. ఇప్పుడు రెండు మూడు ప్రశ్నలకు కూడా జవాబులు రాయకుండా వచ్చేవాళ్లు అధికంగా ఉంటున్నారు’ అని మంచిర్యాల జిల్లాకు చెందిన గణితం ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. ‘‘పదో తరగతి కదా. పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. కష్టపడాలి’ అని చెబితే ‘‘కరోనా మూడో వేవ్‌ వస్తుంది. పాసైపోతాంలే’ అని సమాధానం కొందరి నుంచి వస్తోందని మరో ఉపాధ్యాయుడు వాపోయారు.

మొబైల్‌తో నాలుగు గంటలు :

పిల్లల వ్యవహార శైలి బాగా మారిపోయింది. హోంవర్క్‌ చేయడం లేదు. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకునే క్రమంలో ఒక్కో విద్యార్థిని పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించాం. ‘ఇంటికి వెళ్లిన తర్వాత కనీసం నాలుగు గంటలపాటు మొబైల్‌తో గడుపుతున్నట్టు తెలుసుకున్నాం’ అని ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు.

ప్రధానంగా విద్యార్థుల్లో గుర్తిస్తున్న మార్పులివీ :

✖ క్రమశిక్షణ లోపించింది. తల్లిదండ్రుల కోసం బడికొస్తున్నామనే భావన కన్పిస్తోంది. మందలించినా తేలిగ్గా తీసుకుంటున్నారు.

✖ ‘నాకు చదువు రాదు సార్‌’ అనే వాళ్లు ఎక్కువయ్యారు. చదవాలనే జిజ్ఞాస తగ్గింది.

✖ వేషధారణలో బాగా మార్పు వచ్చింది. ముఖ్యంగా చాలామంది తలకట్టు (హెయిర్‌ స్టైల్‌) మార్చారు.

✖ అమ్మాయిలపై జోకులు, వ్యాఖ్యలు(కామెంట్లు) చేయడం అధికమైంది. ఫొటోలు తీయడం వంటివీ  చేస్తున్నారు.

✖ వ్యసనాలకు బానిసలయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమకన్నా పెద్ద వయసు వాళ్లతో కలిసి తిరగడం, పనులకు వెళ్లడం వంటి కారణాలతో కొత్త అలవాట్లు అధికమయ్యాయి.

మాట్లాడుకోవడానికి సమయం ఇవ్వాలి : 

ఆన్‌లైన్‌ పాఠాలతో ఫోన్లు చేతుల్లోకి వచ్చాయి. చిన్న పిల్లలు వీడియో గేమ్‌లు, పెద్దవాళ్లు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ఉన్నట్టుండి వాటికి దూరమైనప్పుడు సహజంగానే తిరుగుబాటు వస్తుంది. తోటి పిల్లలతో మాట్లాడుకునేందుకు ఒక పీరియడ్‌ను కేటాయించే విధానాన్ని ఈ విద్యా సంవత్సరం వరకైనా అమలుచేయాలి. దానివల్ల ఏడాదిన్నరగా ఒంటరిగా ఉంటూ కోల్పోయిన జీవితాన్ని కొంత వరకు భర్తీ చేసుకునే అవకాశం వారికి వస్తుంది. ఉపాధ్యాయులు కూడా పిల్లలను గమనిస్తూ స్నేహపూర్వకంగా మెలుగుతూ సమస్యలు తెలుసుకుంటూ వారిలో మార్పుతెచ్చే ప్రయత్నం చేయాలి.

- వాసిరెడ్డి అమర్‌నాథ్‌, విద్యావేత్త

సెలబ్రేషన్‌ సంస్కృతి పెరిగింది : 

ప్రతి సందర్భాన్నీ ఉత్సవంగా జరుపుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, సినిమాలపై ముచ్చట్లు, దుస్తులు, హెయిర్‌ స్టైల్‌లో సినీనటులను అనుకరించడం లాంటి సంస్కృతి పెద్దవాళ్లతోపాటు పాఠశాల పిల్లల్లోనూ చూస్తున్నాం. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని కుటుంబాల్లోని పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంది. గతంలో బడి వదిలిపెడితే ఇంటికి వెళ్లేవారు. ఇప్పుడు బజార్లలో కాలక్షేపం చేసిన తర్వాతే వెళుతున్నట్లు గమనించాం.  

- బెండి ఆషారాణి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత

అందరిలో ఉన్నప్పుడు మందలించొద్దు : 

ఆన్‌లైన్‌ పాఠాలు వింటూ ఫోన్లకు అలవాటుపడ్డారు. పాఠాలు వింటున్నారనే భావనతో తల్లిదండ్రులు వారితో మాట్లాడటం మానేశారు. దాంతో పిల్లలు తమ భావాలను వ్యక్తపరచడానికి, గతంలో మాదిరిగా స్నేహితులతో మాట్లాడటానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుత విపరీతాలకు అదే ప్రధాన కారణం. ఇప్పుడు తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు వారితో స్వేచ్ఛగా మాట్లాడించాలి. వారి భావాలను వినాలి. ఆలోచనలను తెలుసుకోవాలి. తప్పుచేసినా అహం దెబ్బతినేలా అందరిముందు మందలిస్తే మొండిగా తయారవుతారు. కనుసైగలతోనే చేసే తప్పులను గమనిస్తున్నామనే సంకేతాలను వారికి పంపగలగాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడితే చేసిన తప్పులను తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం చేస్తారు.

- పి.జవహర్‌లాల్‌ నెహ్రూ, సైకాలజిస్టు

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top