విద్య భారతీయీకరణ కావాలి. దేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలపాలి : ఉపరాష్ట్రపతి
దేశంలో విద్యను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మన ప్రాచీన జ్ఞాన సంపద ఆధారంగా భారత విద్యా విధానం ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. బ్రిటిష్ వలస విద్యా విధానాన్ని విడనాడాల్సిన అవసరాన్ని కూడా ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. ఈ విధానం భారతీయుల్లో ఆత్మన్యూనతా భావాన్ని కలిగించిందని, ఆత్మవిశ్వాస లేమిని సృష్టించిందని పేర్కొన్నారు. శనివారం ఉపరాష్ట్రపతి రిషిహుడ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ మళ్లీ విశ్వగురువుగా ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒకప్పుడు నలంద, తక్షశిల, పుష్పగిరి విద్యాలయాలకు ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం వచ్చేవారని అన్నారు. మళ్లీ భారత్ ఆ స్థాయికి చేరుకోవాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. సాంకేతికతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని, అప్పుడు విద్య అన్ని అవరోధాలను అధిగమించి సమాజంలో చిట్టచివరిస్థాయికి చేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, రిషిహుడ్ ఉపకులపతి సురేశ్‌ప్రభు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ భాష.. జాతీయ భాషే :
భావప్రకటనా స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. శనివారం భారతీయ జ్ఞాన్‌పీఠ్ నిర్వహించిన 33వ మూర్తిదేవీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రసంగాల్లో మర్యాద పాటించాలని, ఇతరుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినకుండా చూసుకోవాలని తెలిపారు. భారతీయ భాషల ప్రాముఖ్యత గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లా డుతూ.. ప్రతి భాష జాతీయభాషేనని పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీకి ఈ ఏడాది మూర్తిదేవీ అవార్డును బహూకరించారు.
మనవరాలికి ఉపరాష్ట్రపతి దంపతుల అభినందనలు
నోయిడాలోని అమిటీ విశ్వ విద్యాలయంలో శనివారం జరిగిన స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఇతర విద్యార్థుల కుటుంబసభ్యుల్లాగే వేదిక ముందు కూర్చుని భార్య ఉషతో కలిసి వేడుకలను తిలకించారు. తాను.. ఇక్కడికి ఉపరాష్ట్రపతి హోదాలో రాలేదని, తన మనవరాలు సుష్మా చౌదరి తాతగా వచ్చానని చెప్పారు. విద్యాభ్యాసంలో ఉన్నత విలువలు పాటించడంతో పాటు నిజాయతీగా ఉంటూ ఇతరులతో సత్ప్రవర్తనతో మెలిగినందుకుగానూ సుష్మా చౌదరి.. బల్జిత్ శాస్త్రి అవార్డుకు కూడా ఎంపికయ్యారు. అవార్డును, స్నాతకోత్సవ పట్టాను భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల చేతుల మీదుగా సుష్మా చౌదరి అందుకున్నారు. ఆ సమయంలో విశ్వవిద్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు ఉపరాష్ట్రపతి వేదిక మీదకు వెళ్లి ప్రసంగించారు. తన మనవరాలు డిగ్రీతో పాటు అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
0 Post a Comment:
Post a Comment