Tuesday 8 September 2020

మాస్క్‌ మస్ట్‌ - భౌతికదూరం బెస్ట్‌ : : కరోనా వైరస్ పై ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

మాస్క్‌ మస్ట్‌ - భౌతికదూరం బెస్ట్‌ : :  కరోనా వైరస్ పై ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి


శానిటైజర్‌ కంటే ఇప్పుడు మాస్క్, భౌతికదూరాలతోనే నివారణ ఎక్కువ.

ఇప్పుడు నేసల్‌ శ్వాబ్‌ కంటే కూడా ఉమ్మితోనే సులువుగా నిర్ధారణ సాధ్యం.

మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌లో మరింత సమర్థమైన చికిత్స.

డిసెంబరు / జనవరి నాటికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం.





కరోనా విషయంలో జరుగుతున్న అధ్యయనాలు, తెలియవచ్చిన ఎన్నెన్నో కొత్త విషయాలు. అత్యంత ఆసక్తికర అంశాలు.

 మన దేశంలో మార్చి నెలలో కరోనా ముమ్మరమయ్యే నాటికి మనకు తెలిసిన విషయాలకంటే ఇప్పుడు మరింత విస్తృత సమాచారం తెలుసు అంటున్నారు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అధినేత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి. ఆ పరిజ్ఞానంతో మనం చేసే పరీక్షల్లో, చికిత్స ప్రక్రియల్లో ఎన్నో మార్పులు చేసుకోగలిగామంటున్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా వచ్చే కోవిడ్‌–19 వ్యాధి ఏమాత్రం ఆందోళన పడదగినది కాదనీ, దాని గురించి ఎలాంటి అనవసర భయాలూ అవసరం లేదని చెబుతున్నారు. 

ప్రశ్న : కరోనా వైరస్‌ మన దేశంలోకి జనవరిలోకి వచ్చినప్పటికీ మార్చి నుంచి ముమ్మరంగా విస్తరించడం మొదలైంది కదా. అప్పటికి ఇప్పటికి వైరస్‌లో ఏవైనా మార్పులు వచ్చాయా ? 

జ : అవును. వైరస్‌లో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు 200 పైగా మ్యుటేషన్స్‌ జరిగాయి. ఇప్పుడు దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ను  ‘ఏ 2 ఏ టైప్‌’గా చెబుతున్నారు.  డి614జీ అనే మ్యూటేషన్‌తో ఇప్పుడీ వైరస్‌ విస్తరిస్తోంది. అయితే ప్రస్తుత ‘ఏ 2 ఏ టైప్‌’  వల్ల వైరల్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అన్న అంశంపై అంతగా స్పష్టత లేదు కానీ... మన పరిశీలన మేరకు తక్కువైందనే అనుకుంటున్నాం. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. 


ప్రశ్న : ప్రస్తుతం వచ్చిన డి614జీ మ్యూటేషన్‌ వల్ల వైరస్‌ స్వరూపం మారినందున...  ఇప్పటికే రూపొంది, ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్‌లు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయా? ఈ మార్పు కారణంగా ఇంతగా కష్టపడి రూపొందించిన ప్రస్తుత వ్యాక్సిన్‌లు నిష్ప్రయోజనం అయ్యే అవకాశాలేమైనా ఉన్నాయా ? 

జ : ఇప్పటివరకూ వైరల్‌లో ఎన్నో రకాల మార్పులు వచ్చినప్పటికీ ‘రిసెప్టార్‌ బైండింగ్‌ ఏరియా’లో మ్యుటేషన్లు ఏవీ రాలేదు. ఈ కారణంగా...  వైరస్‌లో మ్యుటేషన్స్‌ వచ్చినప్పటికీ... ఇప్పటికి రూపొందిన వ్యాక్సిన్లు పని చేస్తాయనే  తేలింది. కాబట్టి ప్రస్తుతం తయారై క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్‌ అన్నీ ప్రభావపూర్వకంగానే పనిచేస్తాయి. అయితే అవెంత ప్రభావపూర్వకం అన్నది క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వ్యాక్సిన్‌పై మనం ఆశలు పెట్టుకోవచ్చు. 


ప్ర: అయితే వ్యాక్సిన్‌తో తప్పక పరిష్కారం ఉంటుందని మనం ఆశించవచ్చన్నమాట.

జ : ఇక్కడో చిన్న లొసుగు ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ పనిచేసినప్పటికీ. దాని ప్రభావం మనిషి దేహంలో ఎంత కాలం ఉంటుందన్న విషయంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఇప్పటికి మూడు నెలలు మాత్రం ప్రభావం ఉండటాన్ని  శాస్త్రవేత్తలు గమనించారు. అయితే ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం... వ్యాక్సిన్‌ ప్రభావం ఒక ఏడాది పాటు ఉండవచ్చనీ, అందుకే దీన్ని ప్రతి ఏడాదీ తీసుకోవాల్సి రావచ్చన్నది ఓ ప్రాథమిక అంచనా. 


ప్ర: రష్యాలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు కదా. దాన్ని మనమూ కొనుగోలు చేసి ప్రయోజనం పొందవచ్చు కదా ?

జ: సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీ తర్వాత దాన్ని మూడు దశల్లో పరీక్షించాలి. కానీ రష్యన్‌ వ్యాక్సిన్‌ను కేవలం రెండోదశ పరీక్షల తర్వాత... వెంటనే వాళ్లు కమర్షియల్‌ తయారీకి ఉపక్రమించారు. అయితే రోగులకు ఎంతమేరకు సురక్షితం అని నిర్ణయించే విషయంలో కేవలం రెండు దశల పరీక్షలు సరిపోవు. కాబట్టి మళ్లీ వాళ్లు మూడో దశ ప్రయోగాలకు పూనుకున్నారు. 


ప్ర : మరి పూర్తి ప్రయోజనకరమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ ఎప్పటికల్లా అందుబాటులోకి రావచ్చని అనుకుంటున్నారు ? 

జ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 230 రకాలు వ్యాక్సిన్‌లు తయారై ఉన్నాయి. అయితే అందులో కేవలం 25 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఆ ట్రయల్స్‌లోనూ  ఆరు వ్యాక్సిన్లు మూడో దశ (ఫేజ్‌ త్రీ) పరీక్షల్లోనూ, 19 వ్యాక్సిన్లు ఒకటీ / రెండూ దశ (ఫేజ్‌ 1 అండ్‌ 2)ల్లో ఉన్నాయి. మన ఇండియాలోనూ మూడు వ్యాక్సిన్స్‌ ప్రయోగదశలో ఉన్నాయి. ప్రస్తుతం అవి రెండోదశ (ఫేజ్‌ 2 లో) పరీక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇక మాడర్నా, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్లు మూడో దశలో విజయవంతంగా తమ ప్రభావాన్ని నిరూపించుకుంటూ ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం డిసెంబరు లేదా జనవరి మొదటివారం నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ప్ర : చాలాచోట్ల మొదటిసారి కరోనా విజృంభించిన ప్రాంతాల్లో మళ్లీ రెండోసారి కూడా వస్తుందని చెబుతున్నారు కదా. ఇలా రెండోసారి రావడం ప్రమాదకరమా ? 

జ: హాంగ్‌కాంగ్‌ లో ఇలా రీ–ఇన్ఫెక్షన్‌ వస్తోంది అంటున్నారు. తెలంగాణ లోనూ ఒకటి రెండు కేసులు వచ్చాయి. కానీ ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... మొదటిసారి కరోనా వైరస్‌ సోకడం వల్ల కోవిడ్‌–19 అనే వ్యాధి వస్తుంది కదా. కానీ రెండోసారి వైరస్‌ సోకినప్పటికీ కోవిడ్‌గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్‌ సోకడం వల్ల కోవిడ్‌ వ్యాధి వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. 

ప్రశ్న : వైరస్‌ సోకే విషయంలో అప్పటికీ ఇప్పటికీ ఏవైనా మార్పులున్నాయా? కొత్త విషయాలేమైనా తెలిశాయా ? 

జ: వైరస్‌ విషయంలో మనకిప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు తెలిశాయి. గతంలో మన నోటి నుంచి వచ్చే తుంపర్లు వస్తువుల మీద పడటం, వాటిని ముట్టుకుని అవే చేతుల్ని మనం మన ముక్కు, నోరు, కళ్లకు అంటించుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అనుకునేవాళ్లం కదా. దీన్నే ‘డ్రాప్‌లెట్‌ ట్రాన్స్‌మిషన్‌’ అంటారు. ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే... ఈ ‘డ్రాప్‌లెట్‌ ట్రాన్స్‌మిషన్‌’ కంటే ఇప్పుడు ‘ఏరోసాల్‌ ట్రాన్స్‌మిషన్‌’ కారణంగానే వైరస్‌ సోకడం ఎక్కువగా జరుగుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అంటే తుంపర్ల కంటే మనుషులు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలికి ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం వల్లనే వ్యాప్తి ఎక్కువన్న మాట. దీని వల్ల తెలిసిన కొత్త విషయం ఏమిటంటే... గతంలో మాటిమాటికీ శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడానికి మనం ప్రాధాన్యం ఇచ్చాం. కానీ దాని కంటే... మాస్క్‌ పెట్టుకోవడమే కరోనా నివారణకు బాగా ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాదు... మాట్లాడుతున్నప్పుడు  నోటి నుంచి వెలువడే గాలితుంపర్లు సోకకుండా ఉండటానికి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఇలా భౌతిక దూరం పాటించడం అన్నది లాక్‌డౌన్‌ అంతటి ప్రభావపూర్వకం అన్నమాట. అంటే... ఇప్పుడు లాక్‌డౌన్‌కు బదులుగా భౌతికదూరాలు పాటిస్తూ అందరూ తమ పనిపాటలు చేసుకుంటూనే లాక్‌డౌన్‌ ప్రయోజనాలు పొందవచ్చన్నమాట. కాకపోతే ప్రతివారూ మాస్క్‌ పెట్టుకుని అవతలి వ్యక్తి నుంచి కనీసం 6 నుంచి 9 అడుగుల దూరంలో ఉండటం వల్ల చాలా సురక్షితంగా ఉండవచ్చు. దీని వల్ల తెలుస్తున్నదేమిటంటే... ఇప్పుడు ఇన్‌డోర్స్‌ కంటే ఔట్‌డోర్స్‌లోనే ఏరోసాల్‌ ట్రాన్స్‌మిషన్‌కు అవకాశం తక్కువగా ఉండటం వల్ల బయటకు వెళ్లి భౌతిక దూరాలు పాటిస్తూ సురక్షితంగా పనిచేసుకోవచ్చని తేలింది.

ఇక మరి ఏరోసాల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎక్కువ అంటున్నారు కాబట్టి గాలి ద్వారా వ్యాపించవచ్చా అని అడిగితే ‘గాలి ద్వారా వ్యాపించదు’ అని గట్టిగా చెప్పవచ్చు. అంటే ఓ వ్యక్తి సమీపంలో ఉండి మాట్లాడుతుంటేనే ఆ గాలి ద్వారా వ్యాపించవచ్చు గానీ... ఎవరూ లేని చోట వైరస్‌ గాలిలో ఉండిపోవడం... మనం అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ వైరస్‌ వ్యాపించి ఉండటం, అది మనకు సోకడం జరగదు. మరి ఏసీ ఉండే ఇన్‌డోర్స్‌ ప్రమాదకరమా అంటే... ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే... లామినార్‌ ఫ్లో ఉండే ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యం ఉన్న చోట కూడా వైరస్‌ వ్యాప్తి జరగదు. లామినార్‌ ఫ్లో ఉండే ఎయిర్‌కండిషనింగ్‌లో తాజా గాలి పై నుంచి వస్తూ... కలుషితమైన గాలులు కిందికి వెళ్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్‌లో ఉండే ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యాలను లామినార్‌ ఫ్లో ఉండేలా చాలా యాజమాన్యాలు మార్పులు చేసుకుంటూ ఉన్నాయి. 


ప్ర : గతంతో పోలిస్తే వైరస్‌ దేహాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో ఏమైనా కొత్త విషయాలు తెలిశాయా ? 

జ: అవును... గతంలో వైరస్‌ దేహంలోకి ప్రవేశించినప్పుడు అది గొంతు ద్వారా ఊపిరితిత్తులను ప్రభావం చేస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే... అది నోరు, ముక్కు ద్వారా ప్రవేశించాక నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్తుందని స్పష్టమైంది. అక్కడ రక్తనాళాల గోడలకు అది అంటుకుంటుంది. అలా రక్తనాళాలను దెబ్బతీయడం జరుగుతుంది. వైరస్‌ ప్రవేశించిన మొదటి వారం అది రక్తంలోకి (బ్లడ్‌లోకి) ప్రవేశించడాన్ని ‘వైరీమియా’ అంటాం. ఈ వైరీమియా దశలోనే రెమ్‌డిస్‌విర్, ఫావీపిరావిర్‌ (ఫాబి ఫ్లూ) వంటి యాంటీవైరల్‌ మందులు ఇవ్వాలి. రెండోవారంలో వీటిని ఇచ్చినా అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. అందుకే యాంటీవైరల్‌ డ్రగ్స్‌ మొదటివారంలోనే ఇచ్చేయాలి. ఇక రెండోవారం అది ఊపిరితిత్తులను ఎటాక్‌ చేస్తుంది. వైరస్‌ సోకిన రెండోవారం మన దేహంలో సైటోకైన్స్‌ విరివిగా తయారవుతాయి. వైరస్‌ను ఎదుర్కొని పోరాడేందుకు మన దేహం ఉత్పత్తి చేసే ఈ కణాలు మన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు... ఇలా మన దేహభాగాలనే దెబ్బతీస్తాయి. అందుకే సైటోకైన్స్‌ ప్రభావం వల్ల మన దేహానికి జరిగే ప్రమాదాలను నివారించడానికి రెండో వారంలో డెక్సామిథోజోన్‌ వంటి స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి. గతంలో దీనికి భిన్నంగా రివర్స్‌లో ఇచ్చేవారు. ఇప్పుడు మనకు తెలిసిన పరిజ్ఞానంతో కొత్త ప్రొటోకాల్‌ ప్రకారం తగిన మందులిస్తూ మరణాలను చాలా వరకు తగ్గించగలిగాం. అందుకే మరణాలు బాగా తగ్గాయి. 

ప్ర: రోగి తాలూకు ప్రమాదకరమైన పరిస్థితులను తెలుసుకుని, మరింత ప్రభావపూర్వకమైన చికిత్స ఇచ్చేందుకు ఏమైనా కొత్త పరీక్షలున్నాయా ? 

జ: కొత్త పరీక్షలేమీ లేవు గానీ... ఐఎన్‌6 అనే పరీక్షతో సైటోకైన్‌ కణాల తీవ్రతను తెలుసుకోవచ్చు. అలాగే ఫెరిటిన్, ఎల్‌డీహెచ్, సీఆర్‌పీ, డీడైమర్‌ అనే పరీక్షల ద్వారా సైటోకైన్‌ కణాలు ఓ తుఫాను లాగా విజృంభిస్తున్నాయా... ఆ తుఫాను (సైటోకైన్‌ స్టార్మ్‌) తీవ్రత ఎంతో అంచనా వేయవచ్చు. అంటే సైటోకైన్స్‌ ఎంత ఎక్కువగా ఉంటే ఈ పరీక్షల్లో విలువలు అంత ఎక్కువగా వస్తుంటాయి. ఇక డీడైమర్‌ అనే పరీక్ష ద్వారా రక్తంలో గడ్డలు రావడం (బ్లడ్‌క్లాటింగ్‌) ఎక్కువగా ఉందా అన్న విషయం తెలుస్తుంది. దాని ఆధారంగా రక్తాన్ని పలుచబార్చే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇక గతంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడానికి ముక్కు నుంచి శాంపుల్స్‌ (నేసల్‌ స్వాబ్‌) తీసుకుని పరీక్ష చేసేవాళ్లం. ఇప్పుడు ఉమ్ము టెస్ట్‌ చేసినా తెలిసిపోతుంది. దీంతో ప్రజలకు పరీక్షలు చేయడం మరింత సులువు, తేలిక అవుతాయి. 


ప్ర : ఇప్పుడు మరింత ప్రభావపూర్వకమైన కొత్త చికిత్సలు ఏవైనా అందుబాటులోకి వచ్చాయా ? 

జ: గతం నుంచి ఇప్పటివరకూ మనం దాదాపుగా వెంటిలేటర్‌పై ఎక్కువగా ఆధారపడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు మనం వెంటిలేటర్‌ కంటే ‘హై ఫ్లో నేజల్‌ ఆక్సిజన్‌’ ఇస్తున్నాం. అంటే ముక్కు ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ పంపడం ద్వారా సత్ఫలితాలు రాబడుతున్నాం. దీనివల్ల వెంటిలేటర్‌లపై భారం, అవసరాలు తగ్గుతాయి. ఇక ఇప్పటివరకూ ప్లాస్మాథెరపీ మీద చాలా వివాదాలు ఉంటూ వచ్చాయి. అది ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని కొందరు, అంతగా ప్రభావం లేదని మరికొందరు అభిప్రాయపడుతూ ఉండేవారు. అయితే కన్వలసెంట్‌ ప్లాస్మాథెరపీలో ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌’ ఎక్కువగా ఉంటేనే ఈ చికిత్స ప్రక్రియ ప్రభావపూర్వకంగా పనిచేస్తుందని తేలింది. అంటే ప్లాస్మాలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉన్నాయా లేదా అన్నది పరీక్ష చేసి, వాటిని ఎక్కువగా కలిగివున్న ప్లాస్మాను ఎక్కించడం వల్లనే ప్రయోజనం ఉంటుందని స్పష్టంగా తెలిసింది. ఇక ఈ ప్లాస్మా చికిత్సను సైతం వ్యాధి సోకిన మొదటివారంలో ఇస్తేనే ఎక్కువ ప్రయోజనం. 

అలాగే మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అనే యాంటీబాడీస్‌తో చేసే చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. మనకు రోగనిరోధకతను ఇచ్చే యాంటీబాడీన్‌ మన దేహంలో ‘బి సెల్స్‌’అనే కణాల్లో తయారవుతాయి. ఈ ‘బి సెల్స్‌’ తీసుకుని, వాటి నుంచి పెద్ద సంఖ్యలో యాంటీబాడీస్‌ తయారు చేసి, ఎక్కించే చికిత్సనే ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌’ చికిత్సగా చెప్పవచ్చు. ఇలా తయారు చేసిన మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌తోనూ కరోనాకు ప్రభావపూర్వకంగా చికిత్స చేయవచ్చని తేలింది.  


ప్ర : కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పండి. అలాగే ఈ విషయంలో మీరు  చూపించే ఆశారేఖ ఏదైనా ఉందా ? 

జ: మనం చేస్తున్న పరీక్షల్లో కేవలం 10 శాతం మందికే పాజిటివ్‌ వస్తున్నాయి. ఆ పది శాతంలోనూ ప్రమాదకరమైన దశకు చేరేవారి సంఖ్య చాలా చాలా స్వల్పం. మరణాలు కేవలం 1 శాతం కంటే కూడా తక్కువే. అయితే స్థూలకాయం ఉన్నవారికి చాలా ప్రమాదం అని తేలింది. కాబట్టి ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం చాలా ముఖ్యం. పరీక్షలు చేసే విషయంలో చాలామందికి వ్యాధి లేకపోయినా, రాకపోయినా యాంటీబాడీస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు మన సమాజంలో 25% మందిలో ఇలా యాంటీబాడీస్‌ ఉన్నట్లే తేలింది. కొద్దిరోజుల్లో ఇది 60 శాతానికి చేరితే... అప్పుడు మనకు వ్యాక్సిన్‌ అవసరం కూడా పెద్దగా  ఉండకపోవచ్చు. అప్పటివరకూ ప్రతివారూ మంచి పోషకాలతో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి. రోజూ విటమిన్‌–సి 500 మి.గ్రా.; విటమిన్‌ బితో పాటు 60 మి.గ్రా. జింక్‌ ఉండే మాత్రలు తీసుకోవాలి. ఒకసారి 60,000 యూనిట్లు అందేలా వారానికోసారి విటమిన్‌–డి టాబ్లెట్స్‌ తీసుకుంటూ రోజూ ఉదయం, సాయంత్రం రెండుపూట్ల ఆవిరి పడుతూ ఉండటం వల్ల కరోనాను సమర్థంగా నివారించవచ్చు. పల్స్‌ ఆక్సిమీటర్‌తో చెక్‌ చేసుకుంటూ దాని విలువ 95 తక్కువ ఉంటే డాక్టర్‌ ను తప్పక సంప్రదించాలి. చివరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమం ఒక్కటే... ఆందోళన పడకండి. అప్రమత్తంగా ఉండండి.

Gampa Nageshwer Rao , 9849000026:

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top