Tuesday 8 September 2020

బలమైన పునాది అమ్మ భాషతోనే...

 

బలమైన పునాది అమ్మ భాషతోనే...






అందుకే 5వ తరగతి దాకా మాతృభాషలోనే...!

చదవడం కాదు... నేర్చుకోవడం ముఖ్యం.

విద్యార్థులపై ఒత్తిడి తగ్గాలి... సృజన పెరగాలి.

చిన్నప్పటి నుంచీ వృత్తిపర నైపుణ్యం అలవర్చాలి.

మనలో మంద మనస్తత్వం పోవాలి.

విద్యాసంస్థల్లో ప్రభుత్వ జోక్యం ఉండరాదు.

కాలేజీలతో వర్సిటీల పోటీకే గ్రేడెడ్‌ అటానమీ.

నైపుణ్య విద్య కోసమే విదేశీ వర్సిటీలకు చాన్స్‌.

స్వావలంబన భారత్‌ సాధించడమే లక్ష్యం.

నవ భారత నిర్మాణమే పాలసీ ఉద్దేశం.

నూతన విద్యావిధానంపై ప్రధాని మోదీ


‘‘ఇన్నాళ్లూ ఏం ఆలోచించాలి అన్న దానిపై మన దృష్టి ఉండేది. నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020) దీనిని మార్చి ‘‘ఎలా ఆలోచించాలి’’ అనేది నేర్పుతుంది. రొడ్డకొట్టుడు చదువు కాదు. నేర్చుకోవడం ముఖ్యం. జ్ఞానం పెంపొందించుకోవడం ముఖ్యం. ఒకరేది చదివితే అదే మనమూ చేద్దాం. అన్న మంద మనస్తత్వం పోవాలి. సృజనకు, నవ్యరీతుల్లో ఆలోచనకు అవకాశం ఇవ్వాలి.విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించాలి.. వారు కొత్తగా, విభిన్నంగా ఆలోచించేట్లు అవకాశం ఇవ్వాలి. పుస్తకాల బరువులు, పరీక్షల ఒత్తిళ్లనుంచి విద్యార్థులను బయటపడేయాలి వారికి చిన్న వయసు నుంచే వృత్తిపరమైన కోర్సులకు, ప్రాక్టికల్‌ శిక్షణకు అవకాశం ఇవ్వాలి. తద్వారా వారు దేశీయంగా గానీ ఇతర దేశాల్లో గానీ ఉపాధి సాధించడానికి వీలు కలుగుతుంది.’’   

నూతన విద్యావిధాన లక్ష్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ :

ఐదో తరగతి దాకా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్నది నూతన విద్యా విధానంలో అత్యంత కీలకాంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘‘విద్యార్థుల మాతృభాష, స్కూల్లో చెప్పే చదువు ఒకే భాష అయితే సదరు విద్యార్థి నేర్చుకునే సామర్థ్యం ఇతోధికమవుతుందనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే ఐదో తరగతి దాకా మాతృభాషలో బోధన జరగాలన్నది చేర్చాం. ఇది జరిగిన నాడు ఆ విద్యార్థికి విద్యావిషయకంగా బలమైన పునాది పడుతుంది. అంతేకాక దేశ సాంస్కృతిక మూలాలను విద్యార్థి మరువకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది’’ అన్నారు. ఉన్నత విద్యలో నూతన విద్యావిధాన మార్పులనే అంశంపై సోమవారం రాష్ట్రాల గవర్నర్లు, విద్యా మంత్రులు, మేధావులు, వీసీలతో జరిగిన వర్చువల్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ‘‘34 ఏళ్ల తరువాత విద్యావిధానంలో సమూల మార్పులు తెచ్చాం. ఇది రక్షణ, విదేశాంగ విధానం లాంటిదే.  ఇప్పటిదాకా  ఏ చదువైనా నిరుపయోగంగా ఉంటూ వచ్చింది. దాన్ని ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా మార్చాం. ఎన్‌ఈపీ కేవలం ఓ సర్క్యులర్‌ కాదు, నోటిఫికేషన్‌తో అమలు చేయడానికి... భవిష్యత్‌ భారత నిర్మాణానికి ఉపకరించేది’’ అని వివరించారు. 

‘‘పాలనపరమైన అడ్డుకట్లను పరిమితం చేయాలన్నదే లక్ష్యం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తలిదండ్రుల భాగస్వామ్యం పెరిగితేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలం. చాలా ఏళ్లుగా ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. ఇది మంద మనస్తత్వానికి తావిచ్చింది. ఆసక్తి, అనురక్తి, కొత్త ఆలోచన  పక్కన పడిపోయాయి. దీన్ని మార్చేందుకే ఈ విద్యావిధానం. బోధన పద్దతులు కూడా మారాలి. ప్రశ్నించే తత్వం, అన్వేషణ, విశ్లేషణలకు ఆస్కారమివ్వాలి. అప్పుడే విద్యార్థులు తరగతి గదుల్లో ఆసక్తితో చర్చల్లో పాల్గొనగలుగుతారు’’ అని మోదీ వివరించారు.

‘‘ఇన్నాళ్లూ విద్యార్థులు తమ స్థాయికి మించిన కోర్సులను ఎంపిక చేసుకుని కొన్నేళ్ల తరువాత పశ్చాత్తాప పడుతున్నారు.  ఈ సమస్యను కొత్త విధానంలో పరిష్కరించాం. వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పుడు ఏది కావలిస్తే అది నేర్చుకునే వెసులబాటు మన యువతకు ఉంటుంది’ అని విశదీకరించారు. ‘ఫలానా పని పెద్దది లేదా చిన్నది అని భావించకూడదు. కష్టపడి పనిచేసే శ్రామికుల పట్ల ఎందుకీ వివక్ష వస్తోంది? కారణం... మన విద్యావ్యవస్థ దీని నుంచి దూరం జరగడమే. అందుకే ఈ ఎన్‌ఈపీలో శ్రమకు తగిన గౌరవం ఉండాలన్న దానికి ప్రాధాన్యం ఇచ్చాం. విద్యార్థులు పల్లెలకు వెళ్లాలి. రైతుకూలీలతో మాట్లాడాలి. అప్పుడే వారి కష్టం ఏంటో ఎంతో తెలుస్తుంది’’ అని ఆయన సూచించారు. ‘‘కొత్త విద్యావిఽధానంలో పక్షపాతం లేదు. ఇందులోని అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఈనెల 25లోగా వర్చువల్‌ సదస్సులు నిర్వహించి ఈ విధానానికి సంబంధించిన వివిధ ప్రశ్నలకు అభిప్రాయాలు సేకరించాలి. స్వయం ప్రతిపత్తి విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విద్య అందించే సంస్థలకే మరింత స్వేచ్ఛ, అటానమీ ఇచ్చే అంశం పరిశీలనకు వస్తుందన్నది ఈ విద్యావిధానంలో ఉంది. విశ్వవిద్యాలయాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తేవడానికి, నాణ్యమైన విద్య అందేట్లు చేయడానికే ఈ గ్రేడెడ్‌ అటానమీ కాన్సె్‌ప్టను ప్రవేశపెట్టాం. విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంప్‌సలను పెట్టడానికి అనుమతివ్వడం వెనుక లక్ష్యం ప్రతిభావంతులు దేశం విడిచిపోకుండా కాపాడుకోవడమే(బ్రెయిన్‌ డ్రెయిన్‌ నివారించడం)’’ అని వివరించారు.

పాల్గొన్న కాళోజీ, కేయూ వీసీలు, నిట్‌ డైరెక్టర్‌ :

జాతీయ నూతన విద్యా విధానంపై జరిగిన సదస్సులో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇంచార్జి వైస్‌చాన్స్‌లర్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, రెక్టార్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, వరంగల్‌ నిట్‌ కళాశాల డైరెక్టర్‌ వి రమణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అయితే మాట్లాడేందుకు వీరికి అవకాశం రాలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యా విధానంలో మొదటి ఏడాది విద్యార్థికి సర్టిఫికేట్‌ జారీ చేస్తారని, రెండో ఏడాదిలో డిప్లొమా, మూడవ ఏడాదిలో అడ్వాన్స్‌ డిప్లొమా ఇస్తారని, నాల్గవ ఏడాదిలో డిగ్రీ ప్రదానం చేస్తారని వివరించినట్లు వీసీలు తెలిపారు.  విద్యార్థి క్రెడిట్‌ బ్యాంకింగ్‌ విధానం అమల్లో ఉంటుందని తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top