Thursday 10 March 2022

విద్యకు రూ.90వేల కోట్లు ఖర్చు. పేదరికం అడ్డురావద్దని సీఎం జగన్​ లక్ష్యం

విద్యకు రూ.90వేల కోట్లు ఖర్చు. పేదరికం అడ్డురావద్దని సీఎం జగన్​ లక్ష్యంరాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. గత ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తే..తమ ప్రభుత్వం 33 నెలల్లోనే రూ.90వేల కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామన్నారు. పేదరికం విద్యకు అడ్డంకి కారాదనే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ అధిక నిధులు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అనే అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, మేరుగ నాగార్జున, కరణం ధర్మశ్రీ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, బియ్యపు మధుసూధన రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి రూ.13, 023 కోట్లు, మనబడి నాడు-నేడు కింద పాఠశాలలను పటిష్టం చేసేందుకు మొదటి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. రెండో దశలో 13,981 పాఠశాలల ఆధునీకరణకు రూ.4,535 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రతి ఏటా రూ.16వేల కోట్లు, జగనన్న విద్యాకానుక కిట్ల కోసం రూ.1437.31 కోట్లు ఖర్చు చేశామన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.444.89 కోట్లు, పాఠశాల నిర్వహణ నిధి ద్వారా నాడు-నేడు పథకం కింద కల్పించిన ఆస్తులను, సామాగ్రిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల సంస్కరణలను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి ఆదిమూలపు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యంతో కూడిన ఫౌండేషన్‌ అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో శక్తివంతం చేస్తున్నామన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్‌, వారధి వర్క్‌ పుస్తకాలను రూపొందించి పటిష్టమైన వ్యవస్థను తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుత మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు సీబీఎస్‌ఇకి అనుబంధం చేయబోతున్నామన్నారు.

ఉన్నత విద్యకూ...

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఉన్నత విద్యకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు తెలిపారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 2019-20లో జగనన్న విద్యాదీవెనకు రూ.2559.14 కోట్లు, వసతి దీవెనకు రూ.1280.98 కోట్లు, 2020-21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా దీవెనకు రూ.1648 కోట్లు, 2021-22 వార్షిక సంవత్సరంలో ఇప్పటి వరకు విద్యాదీవెనకు రూ.2051.98 కోట్లు, వసతి దీవెనకు రూ.3198 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పలువురు ఎమ్మెల్యేలు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల ఆధునీకరణ త్వరితగతిన చేపట్టాలని, సబ్జెక్టు టీచర్లను పెంచాలని తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకురాగా..పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.

విదేశీ విద్యా సాయం ఆగలేదు...

విదేశీ విద్యా పథకాన్ని మూసేస్తున్నట్లు విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ చెప్పారు. గత ప్రభుత్వం విదేశీ విద్యకు రూ.10లక్షలు మాత్రమే ఇవ్వగా తాము రూ.15లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో 99శాతం విద్యార్థులు వైద్య విద్య కోసం ప్రభుత్వ సాయంతో పిలిప్పీన్‌, ఉజ్బెకిస్తాన్‌ వంటి చిన్న దేశాలకు వెళ్లారన్నారు. తీరా వారు కోర్సు ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత భారత వైద్య మండలి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోని మొదటి వంద విశ్వవిద్యాలయాల్లో సీటు ఇచ్చిన వారికి విదేశీ విద్య కోసం సాయం చేయాలని నిర్ణయించామన్నారు. ఆశించిన మేర విద్యార్థులకు ఆయా విద్యా సంస్థల్లో సీటు రాకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీటు తెచ్చుకోవాలని చెపుతున్నామన్నారు. గతంలో విద్యా సాయం పొందిన వారికి కూడా కోర్సు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం ఇస్తామని మంత్రి చెప్పారు.

విదేశీ విద్య ప్రభుత్వ పాలసీ...

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు రూ.10లక్షల సాయం అనేది గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని తెదేపా ఉపనేత కే.అచ్చన్నాయుడు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సమాధానానికి ముందుకు విద్యపై జరిగిన చర్చలలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తదుపరి వచ్చిన వాళ్లు అమలు చేయాలని, కొత్తగా ఇవ్వకున్నా ప్రభుత్వ సాయంతో వెళ్లిన వారిని మధ్యలో వదిలేయడం సరికాదన్నారు. వాస్తవంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టతకు పలు చర్యలు తీసుకున్నట్లు వివిధ అంశాలను ప్రస్తావించారు. నాడు-నేడు పథకంలో నిధులు ఎప్పుడు మంజూరు చేశారనే దానిపై మంత్రి స్పష్టత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల విలీనం వలన దూర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు సభ దృష్టికి తీసుకెళ్లారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top