పీఆర్‌సీకి చట్టబద్ధత లేదు - అది సిఫారసులు మాత్రమే చేయగలదు.
వాటిని ఆమోదించడం, తిరస్కరించడం అన్నది ప్రభుత్వ ఇష్టం
ఉద్యోగులతో వివాదం సమసిపోయింది
అందువల్ల వ్యాజ్యాన్ని కొట్టేయండి
హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వినతి
తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా
వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ)కు ఎలాంటి చట్టబద్ధత లేదని, అది సిఫారసులు మాత్రమే చేయగలదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పీఆర్‌సీ నివేదికను ఆమోదించాలా? తిరస్కరించాలా? అన్నది ప్రభుత్వ విచక్షణ అని వివరించింది. ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయలేదని, జీతాలను తగ్గించలేదని తెలిపింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏను ప్రతి ఏడాది పొడిగిస్తున్నామని, ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన, కార్యనిర్వాహక నిర్ణయమని చెప్పింది. 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరడం సమర్థనీ యం కాదంది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
11వ వేతన సవరణ కమిషన్ చేసిన 18 కీలక సిఫారసుల్లో 11 సిఫారసులను పూర్తిగా, ఐదింటిని సవరణలతో కార్యదర్శుల కమిటీ ఆమోదించిందని వివరించింది. రెండింటిని మాత్రమే ఆమోదించలేదని చెప్పింది. కార్యదర్శుల కమిటీ సిఫారసులను యథాతథంగా ఆమోదించామంది. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం – ఉద్యోగుల మధ్య వివాదం సమసినందున జీవో 1పై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. వేతన సవరణపై ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారణ జరుపుతోంది. కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు అవకాశమివ్వాలని పిటిషనర్ న్యాయవాది పదిరి రవితేజ కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 6కి వాయిదా వేసింది.
కేంద్ర వేతన సవరణ కమిషన్ సైతం హెచ్‌ఆర్‌ఏను సవరించింది :
వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపిందని, ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయం కాదని రావత్ ఆ కౌంటర్‌లో పేర్కొన్నారు. వేతన సవరణ ఉత్తర్వులు 2018 నుంచి అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2015 పీఆర్‌సీని ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు అనుగుణంగా అమలు చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధంగానే 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ ఇస్తున్నట్లు చెప్పారు. వేతన సవరణ తరువాత హెచ్‌ఆర్‌ఏ సవరణ సర్వ సాధారణమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6వ వేతన సవరణ కమిషన్ 50 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో హెచ్‌ఆర్‌ఏను 30 శాతం, 50 లక్షల వరకు ఉన్న చోట 20 శాతం, 5 లక్షలకు లోబడి ఉన్న చోట 10 శాతం సిఫారసు చేసిందన్నారు. 7వ వేతన సవరణ కమిటీ హెచ్‌ఆర్‌ఏను 24 శాతం, 16 శాతం, 8 శాతానికి సవరించిందని వివరించారు. కేంద్ర వేతన సవరణ కమిషన్ సవరణలను ప్రభుత్వం అనుసరించిందని తెలిపారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఐఆర్ :
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) నిర్ణయించామన్నారు. పే అండ్ డీఏ బకాయిలకన్నా ఎక్కువ మధ్యంతర భృతి పొందుతున్న వారి నుంచి ఆ మొత్తాన్ని భవిష్యత్తులో డీఏ బకాయిల్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. కమిషన్ సిఫారసులకు మించి ఉద్యోగులకు ఎక్కువ లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా వేతన సవరణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వేతన సవరణపై చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏను 24 శాతంగా నిర్ణయించి, గరిష్టంగా రూ.25 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
0 Post a Comment:
Post a Comment