Saturday 19 February 2022

గురువుల్లేని గురుకులాలు...!

గురువుల్లేని గురుకులాలు...!




◾2016లో హాస్టళ్లన్నీ గురుకులాలుగా మార్పు

◾అప్పటినుంచీ అభివృద్ధికి ఆమడ దూరంలో

◾8, 9, 10 తరగతులకు ఒక్క టీచరూ లేరు

◾ప్రిన్సిపాల్‌ మినహా అందరూ అవుట్‌సోర్సింగే

◾భవనాలు, సిబ్బంది కోసం ప్రభుత్వానికి వినతులు


రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లోని గిరిజన గురుకులాల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. 2016లో గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చిన తర్వాత వాటి అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. మైదాన ప్రాంతంలోని 81 గురుకులాల్లో అప్పట్లో నియమించిన ప్రిన్సిపాల్‌ పోస్టు తప్ప ఒక్క పోస్టును కూడా రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నామని స్వయంగా ప్రిన్సిపాళ్లు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో యానాదుల సంఘం నాయకులు సైతం ఇటీవల ఎన్నో రకాలుగా నిరసనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదంటున్నారు. గురుకులాల్లో దుస్థితిని ఆ శాఖ డైరెక్టర్‌ స్వయంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. అప్పట్లో ఒక్కో గురుకులానికి ఒక ప్రిన్సిపాల్‌, 8 బోధనా సిబ్బంది పోస్టులు మంజూరు చేయగా.... ప్రిన్సిపాల్‌ మినహా అన్నీ పోస్టుల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. వీటిని ప్రారంభించి ఐదేళ్లు కావడంతో అప్పట్లో చేరిన విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నారు. దీనికి అనుగుణంగా పోస్టుల సంఖ్యను 16కు పెంచాల్సి ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు లేకుండా టెన్త్‌ విద్యార్థులకు ఎలా బోధించాలని ఆందోళన చెందుతున్నారు. 8, 9, 10తరగతులకు సంబంధించి మొత్తం 486 మంది టీచర్లు ఉండాలి. అయితే ఒక్కరిని కూడా నియమించలేదు. ఈ  పరిస్థితుల్లో విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు ఎలా రాయగలరని ప్రశ్నిస్తున్నారు. తెనాలి బాలికల గురుకుల పాఠశాలలో 260 మంది పిల్లలకు నలుగురే టీచర్లు ఉన్నారు. ప్రకాశం జిల్లా కరేడులో 200 మంది విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్లున్నారు. నెల్లూరు జిల్లా కోట బాలిక పాఠశాలలోనూ 247 మంది విద్యార్థులకు ఉన్నది నలుగురు టీచర్లే. కడప జిల్లా మైదుకూరులో 231 మంది పిల్లలకు గాను ఐదుగురు టీచర్లు పనిచేస్తున్నారు. 

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో కాలక్షేపం 2016లో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో హస్టళ్ల కంటే గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందించవచ్చన్న సదుద్దేశంతో 200కు పైగా గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చారు. ఐదు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలు గాను, మైదాన ప్రాంతంలోని 8 జిల్లాల్లో 81 గురుకులాలను ఏర్పాటు చేశారు. నాలుగైదు హాస్టళ్లను కలిపి ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌గా మారు స్తూ అందులో పెద్దదిగా, అనుకూలంగా ఉన్న హాస్ట ల్‌ భవనాలను రెసిడెన్షియల్‌ స్కూల్‌గా ఎంచుకున్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్‌ను, 8 మంది టీచింగ్‌ సిబ్బందిని నియమించారు. అప్పట్లో మొదటి సంవత్సరం 6వ తరగతితో ప్రారంభించి ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచడంతో ఇప్పుడు ఈ పాఠశాలల్లో పదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు. అప్పటినుంచి రెగ్యులర్‌ సిబ్బందిని ప్రభుత్వం నియామకం చేయకపోవడంతో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. కొంతమంది పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు పదోన్నతి కల్పించి ఈ గురుకులాలకు ప్రిన్సిపాళ్లుగా నియమించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ పోస్టులు పెంచడం గానీ, సిబ్బంది నియామకం గానీ చేపట్టలేదు. 

సా....గుతున్న స్థల సేకరణ మైదాన ప్రాంతాల్లోని గిరిజన గురుకుల పాఠశాలల నిర్మాణానికి 2016లోనే స్థల సేకరణ ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదంటున్నారు. 81 పాఠశాలల్లో 65 గురుకులాలకు స్థల సేకరణ చేపట్టారని, ఇంకా 16 గురుకులాలకు చేపట్టాల్సి ఉందని చెప్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలకు భవనాలు మంజూరు కోసం 2016 నుంచి ప్రభుత్వానికి ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం లేదని అధికారులు వాపోతున్నారు. ఇటీవల నాడు-నేడు పథకం ద్వారా ఈ గురుకుల పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేపట్టారే తప్ప వసతులేమీ కల్పించకపోవడంతో గిరిజన విద్యార్థులకు చదువులు దుర్లభంగా మారాయంటున్నారు. అరకొర వసతులతో వంద మందికి సరిపోయే భవనాల్లో 320 మంది విద్యార్థులు ఉంటూ చదువుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకా వార్డెన్ల పెత్తనమే గురుకులాలుగా రూపాంతరం చెందిన ఈ హాస్టళ్లలో ఇంకా గిరిజన సంక్షేమశాఖ హాస్టల్‌ అధికారుల పెత్తనమే కొనసాగుతోంది. దీంతో ఇవి ఇంకా గురుకుల వాతావరణంలో కాకుండా హాస్టల్‌ వాతావరణంలోనే నడుస్తున్నాయంటున్నారు. పాలన మొత్తం వార్డెన్‌ పరిధిలో ఉండటంతో ఇక్కడ ప్రిన్సిపాల్‌ నామమాత్రంగా తయారయ్యారు. ప్రిన్సిపాల్‌ను హాస్టల్‌ సిబ్బంది ఖాతరు చేయకపోవడంతో గురుకులాల నిర్వహణ అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇక్కడి విద్యార్థులకు మెనూ సరిగా అందడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. హాస్టల్‌ వార్డెన్లును బదిలీ చేసి ప్రిన్సిపాళ్లకు అధికారాలు కల్పిస్తేనే గురుకులాలు బాగుపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top