ప్రతి పాఠశాలలో కౌన్సెలింగ్ నిపుణులుండాలి - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచన
విద్యారంగంలో పెరుగుతున్న ఒత్తిళ్లతో చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, ఆ పరిస్థితుల నుంచి విద్యార్థులు బయటపడాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కౌన్సెలింగ్ నిపుణులు చొరవ చూపించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో కౌన్సెలింగ్ నిపుణులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉత్తర అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇన్నర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ (సీఐఆర్డీ) ఆధ్వర్యంలో శనివారం వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘5వ ప్రపంచ భగవద్గీత సదస్సు’ను ఆయన చెన్నై నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ...విద్యార్థులు తమ సమస్యల్ని స్వేచ్ఛగా చెప్పుకునేలా ప్రోత్సహించాలని, మార్కుల కోసం ఒత్తిడి తేకూడదని సలహా ఇచ్చారు. భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని యువతకు చేరవేయాలన్నారు. కౌన్సెలింగ్ నిపుణుల నియామకానికి ప్రభుత్వాలు ముందుకురావాలని కోరారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు ఏకతాటిపైకి వచ్చి భారతీయ సమాజాన్ని మానసిక ఆరోగ్యం దిశగా తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల టెలీ మెంటల్‌హెల్త్ కార్యక్రమాల్ని ప్రారంభించిందని, ఇదెంతో ఉపయుక్తంగా ఉందని గుర్తుచేశారు. ప్రత్యేకించి గ్రామీణులకు లబ్ధి కలుగుతోందని చెప్పారు. ప్రజలు కూడా తమ జీవనశైలిలో మార్పులు చేసుకుని.. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకునేలా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవడం చాలా కీలకమని తెలిపారు. తద్వారా ప్రశాంతతను, అంతఃశక్తిని పెంచుకునేలా ఆధ్యాత్మికవేత్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, నారాయణ ఆశ్రమ తపోవనం వ్యవస్థాపకులు స్వామి భూమానంద తీర్థ, సీఐఆర్డీ అధ్యక్షుడు పంకజ్ భాటియా, ఉపాధ్యక్షుడు రవి జంధ్యాల తదితరులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment