కలిసొచ్చే సంఘాలతో కొత్త జేఏసీ : ఫ్యాఫ్టో సమావేశంలో నిర్ణయం
ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పీఆర్సీ సాధన సమితి విఫలమైన నేపథ్యంలో.. ప్రస్తుత జేఏసీ నుంచి విడిపోయి కొత్త జేఏసీని ఏర్పాటుచేసి పోరాటాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) నిర్ణయించింది. ఫిట్‌మెంట్ 27 శాతం పైగా సాధించడం, సీపీఎస్ రద్దు, ఇతర సమస్యల పరిష్కారానికి కలిసొచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని జేఏసీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఉద్యోగ జేఏసీ ఏమీ సాధించకుండానే ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడంపై నిరసన వ్యక్తం చేసిన ఫ్యాఫ్టో.. తదుపరి కార్యాచరణ కోసం ఆదివారం విజయవాడలో సమావేశమైంది. ఫ్యాఫ్టో చైౖర్మన్ జోసెఫ్ సుధీర్‌బాబు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో యూటీఎన్, ఏపీటీఎఫ్, ఎస్‌టీయూ, ఎపీపీటీఎఫ్, యూటీఎఫ్ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.
సోమవారం నుంచి వారం రోజుల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నెల 11న అన్ని జిల్లాల కలెక్టర్‌లకు వినతిపత్రాలు ఇవ్వాలని, కలిసొచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 12న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు. చలో విజయవాడ విజయవంతమైన తర్వాత ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవచ్చనే ఉద్దేశంతో ఉండగా.. ఏపీ జేఏసీ అర్ధంతరంగా ప్రభుత్వం చెప్పిదానికి ఒప్పుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
0 Post a Comment:
Post a Comment