Sunday 30 January 2022

సమ్మెపై సీఎం జగన్ అస్త్రం సిద్దం - మంత్రులతో భేటీ : చివరి నిమిషంలో..!!

సమ్మెపై సీఎం జగన్ అస్త్రం సిద్దం - మంత్రులతో భేటీ : చివరి నిమిషంలో..!!



ఏపీలో ఒక వైపు ఉద్యోగులు సమ్మెకు సిద్దం అవుతున్నారు. ఎలాగైనా సమ్మె లేకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమ్మె దిశగా అందరినీ సిద్దం చేస్తున్నారు.

ఇదే సమయంలో సమ్మె నివారించేందుకు అన్ని ప్రత్యామ్నాయ మార్గాల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసేందుకు సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు చేయలేదు. వారు పంపిన ప్రతినిధులు మాత్రం సమావేశమయ్యారు.

చర్చలకు ఉద్యోగ నేతల షరతులు :

చర్చలకు వస్తేనే సమస్యలకు పరిష్కారం అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో..తాము చెప్పిన మూడు షరతులకు అంగీకరిస్తేనే చర్చలు అని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక, ఉద్యోగులు ముందుకు వస్తేనే చర్చలంటూ మంత్రులు తేల్చి చెప్పారు. ఈ సమయంలో ఆర్టీసీ..ఆరోగ్య శాఖల ఉద్యోగుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు పీఆర్సీ సాధన సమితి చేస్తోంది. అయితే, ఆర్టీసీలో వైసీపీ మద్దతు కార్మిక సంఘం తాము సమ్మెకు మద్దతు ఇవ్వటం లేదని తేల్చి చెప్పింది. ఇక, ఆరోగ్య శాఖ యానియన్ సీఎస్ కు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ సోమవారం ఉద్యోగులతో చర్చల కోసం నియమించిన కమిటీ సభ్యులు..మంత్రులతో సమావేశం కానున్నారు.

న్యాయస్థానాల్లోనూ సమ్మె ఇష్యూ :

మంత్రులు చివరి ఛాన్స్ గా చర్చలకు రావాలని మరో సారి అప్పీల్ చేయనున్నారు. అప్పటికీ ఉద్యోగ సంఘాలు నో చెబితే ఏం చేయాలనే దాని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చట్టాలతో పాటుగా.. గతంలో సుప్రీం కోర్టు సమ్మె విషయంలో ఇచ్చిన తీర్పులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సమ్మెకు వ్యతిరేకంగా పిల్ దాఖలైంది. హైకోర్టులో ఉద్యోగ సంఘా దాఖలు చేసిన పిటీషన్ విచారణ సమయంలోనూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల పైన చర్చ సాగుతోంది. ఎలాగైనా జనవరి వేతనాలు చెల్లిస్తే ..ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గలేదనే విషయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇక, ప్రభుత్వం వద్ద ఎస్మా అస్త్రం ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది.

మంత్రులతో సీఎం భేటీలో నిర్ణయాలు :

®️ఇప్పటికే ఆర్టీసీ -విద్యుత్ లో సమ్మెలను నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. అదే సమయంలో ఇక, సమ్మె అనివార్యంగా మారితే..చివరి అస్త్రంగా ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లుగా సమాచారం. అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా అత్యవసర సేవగా పరిగణించి, ఆయా సేవలకు సంబంధించి 'ఎస్మా' వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. నీటి సరఫరా, ఆస్పత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతి తపాలాలతో పాటు పెట్రోలు, బొగ్గు, విద్యుత్‌, ఉక్కు, ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి-రవాణా పంపిణీ సేవలకు, బ్యాంకింగ్‌, ఆహార ధాన్యాల పంపిణీకి దీన్ని వర్తింపజేయవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఇక ఆయా రంగాల్లో సేవలు అందించే ఉద్యోగులు సమ్మె చేయడం చట్టవిరుద్ధం అవుతుంది.

అటు ఎస్మా.. ఇటు కోవిడ్ చట్టాలు :

అదే సమయంలో కోవిడ్ కారణంగా అటు కేంద్రం జారీ చేసిన చట్టాలు సైతం సమ్మెకు వెళ్లకుండా అపేందుకు సహకరిస్తాయంటూ ఒక చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇక, కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ముందుగా ఫిబ్రవరి 1వ తేదీన జీతాలు చెల్లించి..జీతాలు పెరిగాయని అధికారికంగా ప్లే స్లిప్పుల ద్వారా వెల్లడవించి..ఆ తరువాత కూడా ఉద్యోగులకు ఒక అవకాశం ఇవ్వాలని..అప్పటికీ వారు దిగి రాకపోతే అప్పుడు కఠిన నిర్ణయాలు..అస్త్రాల ప్రయోగం మొదలు పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

సీఎం జగన్ నిర్ణయంపైనే ఉత్కంఠ :

దీంతో..సోమవారం మంత్రులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించి..అందులో పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమను ముందస్తు అరెస్టు చేస్తారంటూ గత నాలుగు రోజులుగా చెబుతూ వస్తున్నారు. కానీ, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు రాకూడదని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో..ఉద్యోగ సంఘాల నేతల అడుగులు కీలకం కానున్నాయి. దీంతో...సమ్మె విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top