ఉద్యోగులపై ఎస్మా...?
ప్రభుత్వ కసరత్తు
జీతాలు కేంద్రంగా సర్కారు వ్యూహం
శాతమే సిద్ధమైన బిల్లులు
న్యాయమైన పిఆర్‌సి కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే మరోవైపు కఠిన చర్యలకూ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఉద్యమిస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఎంత వ్యతిరేకిస్తున్నా కొత్త పిఆర్‌సి ప్రకారమే జీతాలివ్వడానికి మొండిగా ముందుకు పోతున్న ప్రభుత్వం ఎస్మా విధించడానికి కూడా దానినే కారణంగా చూపే అవకాశం ఉందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు తయారు చేయడానికి శుక్రవారాన్ని డెడ్‌లైన్‌గా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజుకు బిల్లులు పూర్తికావాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఆచరణ దానికి పూర్తి భిన్నంగా ఉంది. డెడ్‌లైన్ ముగిసే సమయానికి కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే తయారైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇది మొత్తం 4.50 లక్షల బిల్లుల్లో పాతిక శాతం మాత్రమే. వీటిలో కూడా అత్యధికం పోలీస్‌శాఖ బిల్లులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కాక వివిధ జిల్లాలకు సంబంధించిన బిల్లులు కూడా తయారయ్యాయి. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్థికశాఖ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా స్థాయిలో కొన్ని బిల్లులను తయారుచేశారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు ట్రెజరీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. మరికొన్ని బిల్లులు కూడా సిద్ధమయ్యాయని,అయితే, సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తడంతో పూర్తి చేయలేకపోయామని అధికారులు అంటున్నారు. మరో రెండు రోజులు కూడా బిల్లుల తయారీకి అవకాశం ఉందని వారు చెబుతున్నప్పటికీ నిర్ధేశించిన సమయానికి బిల్లులు సిద్ధం కాకపోవడం పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమమాచారం. మరోవైపు ఉద్యోగసంఘాలు చర్చకు రావడం లేదంటూ మంత్రులు పదేపదే చెప్పడం కూడా ప్రభుత్వ వైఖరికి సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి పిఆర్‌సికి సంబంధించిన జిఓలను ఏకపక్షంగా జారీ చేసి చర్చల ప్రక్రియ ముందుకు సాగే మార్గాన్ని ప్రభుత్వమే మూసివేసిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా జారీ చేసిన జిఓలను రద్దు చేస్తే చర్చలకు వస్తామని ఉద్యోగసంఘాలు చెబుతుండగా, ఆ పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. అదే సమయంలో చర్చల కమిటీలోని సభ్యుడైన ఒక మంత్రి ఉద్యోగులు వస్తే చర్చలు సాగుతాయి..లేదంటే చట్టం తన పనితాను చేసుకుపోతుంది అంటూ వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి తగ్గట్టే తమను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని జెఎసి నేతలు చెబుతుండటం కూడా గమనార్హం. అయితే 14 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఎస్మావంటి చట్ట ప్రయోగం ఎంత వరకు సాధ్యమవుతుందని చర్చ సాగుతోంది. రానున్న ఒకటిరెండు రోజుల్లోనే ఈ దిశలో ప్రభుత్వ వ్యూహమేమిటో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.
ఎటువంటి పరిణామాలు ఏర్పడినా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యంతో జెఎసి కార్యాచరణను రూపొందిస్తోంది.
0 Post a Comment:
Post a Comment