Monday 31 January 2022

కొత్త జీవోల ప్రకారమే జీతాలు : మంత్రి బొత్స స్పష్టీకరణ - క్రమశిక్షణ మీరితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుగా అని వ్యాఖ్య

కొత్త జీవోల ప్రకారమే జీతాలు : మంత్రి బొత్స స్పష్టీకరణ - క్రమశిక్షణ మీరితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుగా అని వ్యాఖ్య



కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు ఇస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘ఉద్యోగ సంఘాల నాయకులు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెబుతూనే.. మరోవైపు జీతాల బిల్లులు చేయాల్సిన వారిని పని చేయొద్దంటున్నారు. ఇదేం ద్వంద్వ వైఖరి? జీతాలిచ్చాక వాటిలో హెచ్చుతగ్గులు, కష్టసుఖాలంటే వచ్చి చెబితే చర్చిస్తాం. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకే కదా ప్రభుత్వం కమిటీని వేసింది’ అని వ్యాఖ్యానించారు. సోమవారం బొత్స ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. జీతాల బిల్లులు చేయని అధికారులు, ఉద్యోగులపై చర్యలుంటాయా అని విలేకరులు అడగ్గా.. ‘క్రమశిక్షణను మీరిన వారిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా? అయితే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తాం, ఇంటికి పంపేస్తామంటూ కఠినంగా మాట్లాడటం ఎందుకు? అలాంటివి చేయకూడదనే కోరుకుంటున్నాం. జీతాలు ప్రాసెస్‌ చేయాలని, పని చేయాలనే విజ్ఞప్తి చేస్తున్నాం. జీతాలిచ్చేందుకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలుంటాయి. నూటికి నూరు శాతం మందికి ఇవ్వాలనుకుంటున్నాం. 90 శాతమో, 50 శాతమో ఎంత మందికి అయితే అంతమందికీ ఒకటో తేదీ నుంచి జీతాలిచ్చుకుంటూ వెళతాం. రెండు రోజులు ఆగితే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కదా’ అని అన్నారు. ప్రభుత్వం చర్చించడం లేదనే వాదన ఉంది కదా అని విలేకరులు అడగ్గా మంత్రి స్పందిస్తూ.. ‘అపోహలు తొలగించేందుకు, సమస్యలుంటే చర్చించేందుకు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించింది. వారు రాకుండా ద్వితీయశ్రేణి నాయకులను పంపారు. మూడు రోజులు మేం వేచి చూసినా ఉద్యోగ సంఘాల నాయకులు రాలేదు. అందువల్లే వారెప్పుడు సిద్ధంగా ఉన్నాం.. రమ్మంటే అప్పుడే చర్చలకు వెళతాం. మేమేమీ డెడ్‌లైన్‌ పెట్టలేదు. సమస్య పరిష్కారం కావాలని, ఉద్యోగులంతా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ అభిమతం. పదవీవిరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలా వద్దా అనే దానిపైనా భిన్నాభిప్రాయాలుంటే ఉద్యోగులు వచ్చి మాట్లాడితే చర్చిస్తాం. ఇదే కాదు ఏ అంశమైనా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది’ అని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని ఉద్యోగులు అంటున్నారు కదా అని విలేకరులు అడగ్గా బొత్స స్పందిస్తూ.. ‘ప్రభుత్వంపైన నమ్మకం లేకపోవడమేంటి? ఎక్కడ పనిచేస్తున్నాం? ఏపీ ప్రభుత్వం, ఏపీ నాయకత్వంపైన కాకుండా తెలంగాణ, తమిళనాడు నాయకత్వంపై నమ్మకం ఉంటుందా? అలా మాట్లాడడం భావ్యమా? అనవసరంగా ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై దుర్భాషలాడితే దాని పర్యవసానాలకు ఉద్యోగ సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేం మాట్లాడలేమా? మాటలతో దూరం పెరుగుతుందనే సంయమనంతో వ్యవహరిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top