ఘర్షణ వాతావరణం తీసుకురావొద్దు : బొప్పరాజు
ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావొద్దని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర మంత్రులకు విజ్జప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్ వద్ద పీఆర్సీ సాధన సమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్న ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మంత్రుల కమిటీ పేరిట చర్చలకు పిలిచారని, కానీ ఆ చర్చలకు రాలేదని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎస్మా చట్టానికి భయపడేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతాం. చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే మేము నాలుగు అడుగులు ముందుకు వేస్తాం. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ లిఖితపూర్వకంగా ఇచ్చిన వాటికి ముందు సమాధానం చెప్పాలి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చెయ్యొద్దు. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టొద్దు. కార్మిక, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఈ ఉద్యమన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఫిబ్రవరి 3న లక్షలాది మందితో నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
0 Post a Comment:
Post a Comment