Wednesday, 26 January 2022

‘ఖజానా’లో కలవరం - కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల బిల్లులు సమర్పించండి. నేటి ఉదయం 11 కల్లా మీ శాఖవి పూర్తిచేయండి

‘ఖజానా’లో కలవరం - కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల బిల్లులు సమర్పించండి. నేటి ఉదయం 11 కల్లా మీ శాఖవి పూర్తిచేయండి
ఆర్థిక శాఖ నుంచి నిరంతర సమీక్షలు

ఆందోళనలో ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. జీతాల బిల్లుల తయారీపై తమపై ఒత్తిడి తెస్తోందని ఖజానా శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఇప్పటికే నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి.. ప్రస్తుతానికి పాత విధానంలోనే జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఖజానా, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాల ఉద్యోగ సంఘాలు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం తాము బిల్లులు చేయబోమని తేల్చిచెప్పాయి. అయినా ప్రభుత్వం జనవరి జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారమే చెల్లించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు అవగతమవుతోంది. ఆర్థికశాఖ ఉన్నతాధికారుల నుంచి తమ విభాగంపై నిత్యం అదేపనిగా ఒత్తిళ్లు పెరిగాయని ఖజానా ఉద్యోగుల సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు కొత్త ఉత్తర్వులు, వీడియో కాన్ఫరెన్సులు, మౌఖిక హెచ్చరికలు అందుతున్నట్లు తెలిపారు.

ఉత్తర్వుల మీద ఉత్తర్వులు : 

* ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సహా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, ఎన్‌ఎంఆర్‌, తదితర ఉద్యోగులందరికీ కొత్త వేతన స్కేళ్ల ప్రకారమే జనవరి నెల జీతాలు చెల్లించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. అందుకు మార్గదర్శకాలను ఉటంకిస్తూ తాజాగా మంగళవారమూ ఆదేశాలు పంపించారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పొందుపర్చిన విధివిధానాల ప్రకారమే బిల్లులు తయారుచేయాలని, దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

* ఖజానా శాఖ సంచాలకులు బుధవారం సబ్‌ ట్రెజరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో)ల నుంచి ఏ మేరకు బిల్లులు వచ్చాయో ఆరా తీశారు. ఇతర ప్రభుత్వ శాఖల డీడీవోలు బిల్లులు సమర్పించని నేపథ్యంలో తొలుత ఖజానా శాఖలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

* గురువారం ఉదయం 11 గంటలకు ఖజానా శాఖలోని ఉద్యోగులందరి జీతాల బిల్లులను కొత్త పీఆర్సీకి అనుగుణంగా అక్కడి డీడీవోలు సమర్పించాలి. సబ్‌ ట్రెజరీ అధికారులు వాటిని పరిశీలించి, సీఎఫ్‌ఎంఎస్‌కు సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీసీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరికలు అందినట్లు ఖజానా విభాగం అధికారులు చెబుతున్నారు.

* పోలీసు శాఖకు ఇంటి అద్దె భత్యం సహా కొన్ని విషయాల్లో కొత్త పీఆర్సీ వర్తించడం లేదు. దీంతో ఆ శాఖకు సంబంధించి కొత్త పీఆర్సీ మేరకే డీడీవోలు బిల్లులు సమర్పించినట్లు తెలిసింది.

అంత సులువేమీ కాదు :

కొత్త పీఆర్సీ అమల్లో భాగంగా తప్పుల్లేకుండా బిల్లులు రూపొందించాలని, డీడీవోలు  పంపించిన వివరాలను ఖజానా, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాల్లోని అధికారులు సరిచూసుకొని సమర్పించాలని ఇప్పటికే ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తప్పులు జరిగితే బాధ్యత వహించడంతో పాటు చర్యలకూ సిద్ధపడాలని హెచ్చరికలు వెళ్లాయి. ‘ప్రతి ఉద్యోగి ఎస్‌ఆర్‌ను పరిశీలించాలి. ఇంక్రిమెంట్లు చేర్చడం నుంచి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని వేతన స్థిరీకరణ చేయాలి. ఇందుకు మార్చి 31 వరకు ప్రభుత్వమే గడువు ఇచ్చింది. అయినా ఆర్థిక శాఖ మమ్మల్ని తొందర పెడుతోంది. ఇంత హడావుడిగా వేతన స్థిరీకరణ చేస్తే భవిష్యత్తులో మేం ఇబ్బంది పడాల్సి వస్తుంద’ని ఖజానా విభాగం ఉద్యోగులు వాపోతున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top