తరగతి గదులు కిటకిట - పాఠశాలల్లో కరోనా టెన్షన్ : : అదనంగా చేరిన వారితో క్లాస్ రూమ్లు ఇరుకిరుకు - ఒమిక్రాన్ హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన
రాష్ట్రంలోని పాఠశాలలన్నీ విద్యార్థులతో కిటకిటలాడుతు న్నాయి. ప్రభుత్వ పథకాలు, కరోనా సంక్షోభం తో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు ఈ విద్యా సంవత్సరంలో భారీగా చేరికలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తరగతి గదులు సరిపోక ఇరుకిరు గా కూర్చోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ప్రాథమిక తరగతుల విలీనంతో ఉన్నత పాఠశాలలకు మరింత మంది విద్యార్థుల తాకిడి పెరిగింది. దీంతో ఎక్కడా భౌతిక దూరం పాటించగలిగే పరిస్థితులు లేవు. కరోనా మూడో వేవ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజు రోజుకూ విస్తరిస్తున్న పరిస్థితుల్లో స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్(ఎస్వోపీ) పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఈ ఎస్వోపీని అమలు చేయడం సాధ్యమయ్యేలా లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అయితే నాడు- నేడు పథకం కింద ఉన్న తరగతి గదులను బాగు చేయించారే కానీ.. అదనపు గదుల నిర్మాణం జరగలేదు. దీంతో ఉన్న గదుల్లోనే విద్యార్థులను సర్దాల్సి వస్తోంది.
సెక్షన్ల సంఖ్య పెంచకుండా...
ప్రభుత్వ పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ప్రతి నలభై మంది విద్యార్థులకు ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలి. అయితే అదనంగా పది, 20 మందే ఉన్నారని, సెక్షన్కు సరిపడా లేరనే కారణంతో 40 మంది ఉండాల్సిన సెక్షన్లో 50 నుంచి 60 మందికిపైగా కూర్చోబెట్టేస్తున్నారు. దీంతో తరగతి గదులు మరింత ఇరుకైపోయి ఎస్వోపీ పాటించగలిగే పరిస్థితి ఉండటం లేదు. అదే విధంగా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి కూడా అమలు కావడం లేదు. గతంలో 1:20 ఉన్న నిష్పత్తిని1:30కి పెంచినా ఆ మేరకు కూడా బోధనా సిబ్బంది లేరు.
వ్యాక్సినేషన్ లేక ఆందోళన :
రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 సంవత్సరాల పైబడిన వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం 15 ఏళ్లు నిండిన వారికి కూడా టీకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే పాఠశాలల్లో ఉండే పిల్లలంతా ఆలోపు వయసు వారే కావడంతో టీకాలు అందే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి మాత్రం నూరు శాతం టీకాలు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ అదే సందర్భంలో పిల్లలకు టీకాలు ప్రారంభం కాకపోవడంతో కొత్త వేరియంట్ టెన్షన్ పట్టుకుంటోంది. విద్యార్థులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి పాఠశాలలకు వస్తుండటం, అంతా గదుల్లో దాదాపు ఆరేడు గంటలపాటు కూర్చోవడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందనే ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతుండటంతో గతేడాదిలాగే ఎస్వోపీని అమలు చేయాలని పేరెంట్ కమిటీల సమావేశాల్లో తల్లిదండ్రులు కోరుతున్నారు. భౌతిక దూరం అమలయ్యేలా చూడటంతోపాటు, రోజు విడిచి రోజు తరగతులను పక్కాగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
0 Post a Comment:
Post a Comment