Tuesday, 28 December 2021

విద్యకు వైరస్‌ _ ఆన్‌లైన్‌ చదువులకు పేదవర్గాలు సుదూరం : ఇంటర్‌లో వైఫల్యాల వెనుక ఎన్నెన్నో వేదనలు

 విద్యకు వైరస్‌ _ ఆన్‌లైన్‌ చదువులకు పేదవర్గాలు సుదూరం : ఇంటర్‌లో వైఫల్యాల వెనుక ఎన్నెన్నో వేదనలుమెరికల్లాంటి విద్యార్థులూ.. చదువులో వెనుకంజ వేస్తున్నారు.. టాపర్లు సైతం పరీక్షలు తప్పుతున్నారు.. కరోనా కల్పించిన పరిస్థితులు సర్కారీ చదువులపై ఆధారపడే బడుగు విద్యార్థుల బాధలను వర్ణనాతీతంగా మార్చాయి.. మహమ్మారి కారణంగా విద్యారంగంలో ఏర్పడ్డ సంక్షోభం ఓ తరం భవిష్యత్తును దెబ్బతీస్తోంది. ఇటీవల వెల్లడైన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే.. చదువులో అసమానతలను కొవిడ్‌ తీవ్రస్థాయికి తీసుకెళ్లినట్లు అర్థమవుతోంది. జూనియర్‌ ఇంటర్‌లో అత్యల్ప ఉత్తీర్ణత నేపథ్యంలో విద్యార్థుల్లో అశాంతి చెలరేగడంతో అందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. ‘ఈ ఫలితాలు’ సంక్షోభానికి ఓ సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో పలువురు సామాన్య, పేద వర్గాల పిల్లలు, వారి కళాశాలల అధ్యాపకులతో ‘ఈనాడు ప్రతినిధి’ మాట్లాడినప్పుడు విస్తుపోయే ఎన్నో కఠోర వాస్తవాలు వెలుగుచూశాయి. దాదాపు ఏడాదిన్నరకు పైగా పేద కుటుంబాల పిల్లలకు విద్యతో సంబంధం తెగిపోవడంతో వారి ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇంటర్‌ విషయానికే వస్తే వారికి మొదటి సంవత్సరం అంశాలపై ప్రాథమిక అవగాహన లేదని అధ్యాపకులు చెబుతున్నారు.ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ ప్రవేశ పరీక్షల్లో ఈ వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఆన్‌లైన్‌ కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించగల కుటుంబాల విద్యార్థులు ప్రస్తుత క్లిష్టస్థితిని దాట గలుగుతున్నారు. సామాన్య, బడుగు కుటుంబాల నుంచి మొదటిసారిగా ఇంటర్‌కు వచ్చిన అసంఖ్యాక విద్యార్థులు మాత్రం వెనుకబడిపోతున్నారు.

ఆడపిల్లలకు ఫోన్లా..?

సెల్‌ఫోన్‌ కొనిచ్చేందుకు తల్లిదండ్రులు సుముఖంగా లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల ఆన్‌లైన్‌ చదువుకు అవరోధమవుతోంది. ప్రేమ వ్యవహారాల భయంతో చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలకు ఫోన్లు కొనివ్వడంలేదని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ అధ్యాపకురాలు చెప్పారు. ‘మా అమ్మాయికి ఫోన్‌ ఇవ్వం. తన చదువు నాశనం అయినా ఫరవాలేదు. రేపు ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా?’ అని కొంత మంది తల్లిదండ్రులు నిలదీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అదనంగా పెళ్లిళ్ల బెడద...

సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌లో 23 మంది విద్యార్థినులు ఉన్నారు. కరోనా సమయంలో వీరిలో 13 మందికి పెళ్లిళ్లు అయ్యాయి. వారిలో 8 మంది ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా, అందరూ ఫెయిలయ్యారు. ఈ కాలేజీ నుంచి పరీక్షలు రాసిన మొత్తం 18 మందిలో ముగ్గురే పాసయ్యారు. దాదాపు అంతా పేద విద్యార్థులే చదువుకునే ఈ కాలేజీలో గతంలో 60-75 శాతం మంది ఉత్తీర్ణులయ్యేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో లేకపోవడం దారుణ పరిస్థితులకు కారణం. ఈ కళాశాలలో ప్రస్తుతం జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినులతో ‘ఈనాడు ప్రతినిధి’ మాట్లాడగా.. గత రెండేళ్లుగా వారిలో అయిదుగురు మాత్రమే అదీ అరకొరగా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యారని వెల్లడైంది. తమకు ఫోన్‌ లేదని.. ఇంట్లో కేబుల్‌ ఛార్జీలు కట్టలేకపోవడంతో టీవీ సౌకర్యాన్నీ వాడుకోలేకపోయామని పలువురు విద్యార్థినులు చెప్పారు

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఉన్న ఒక కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ ప్రాంగణం నుంచి వెయ్యి మంది జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాశారు. అక్కడ వార్షిక ట్యూషన్‌ ఫీజు బ్యాచ్‌ను బట్టి రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షలు. తరగతి గదులు, వసతి గదులు అన్నీ ఏసీవే. ఈ స్థాయి తల్లిదండ్రులు.. ఆన్‌లైన్‌ చదువులకూ ఏర్పాట్లు చేయగలగడంతో మంచి ఫలితాలొచ్చాయి. వెయ్యి మందిలో 920 మంది ఉత్తీర్ణులయ్యారు.

అతి తక్కువ ఫలితాలు :

ఈ ఏడాది సీనియర్‌ ఇంటర్‌ చదివే వారికి మేలో నిర్వహించాల్సిన ప్రథమ సంవత్సర పరీక్షలను కరోనా కారణంగా అక్టోబరు చివర్లో నిర్వహించారు.. 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు జరిపారు. ఐచ్ఛిక ప్రశ్నల సంఖ్యనూ పెంచారు. అయినా మొత్తం 4.59 లక్షల మందిలో 2.24 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

నష్టనివారణ చర్యలు చేపట్టాలి :

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ప్రవేశ పరీక్షల్లో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లను ఇప్పటి వరకూ పొందిన మేరకు పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులు సాధించుకోవడం అసాధ్యమని స్పష్టంగా అర్థమవుతోందని ఇంటర్‌ బోర్డు గవర్నింగ్‌ బాడీ పూర్వ సభ్యుడు, విశ్రాంత ప్రిన్సిపల్‌ ఎం.వి.గోనారెడ్డి అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ కోసం ఆ పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. వారికి కొన్ని ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్లను రిజర్వు చేయాలన్నారు. లేకపోతే ఆ సీట్లలో సింహభాగం నగరాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న పిల్లలకే చెందుతాయని ఆయన చెప్పారు.

‘ఆన్‌లైన్‌’ ఆమడ దూరం...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంచిపేరున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ అది. ఇక్కడ నిబద్ధత కలిగిన అధ్యాపక బృందం ఉన్నా, 156 మంది జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థుల్లో 11 మందే పాసయ్యారు. ఈ కాలేజీకి వెళ్లినప్పుడు విద్యార్థులతో ‘ఈనాడు ప్రతినిధి’ మాట్లాడగా.. ఆందోళనకర విషయాలు తెలిశాయి. వారిలో ఎవరూ ఆన్‌లైన్‌ తరగతులకు సరిగా హాజరు కాలేదు. ఎక్కువమందికి ఫోన్లు లేవని, కరోనా సమయంలో పొలం పనులకు వెళ్లాల్సి వచ్చిందని వారు చెప్పారు. తమ కాలేజీకి వచ్చే పిల్లల్లో కొంతమందికి చెప్పులు కూడా ఉండవని.. అలాంటి పేద పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులను అనుసరించడం ఎలా సాధ్యమని ఓ అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి జూమ్‌లో బోధించిన పాఠాలు పదిశాతం మందికి కూడా చేరలేదని తెలిపారు.

ఒకప్పటి టాపర్ల దుస్థితి...

* హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒక బాలిక చిన్నప్పటి నుంచీ చదువులో మంచి ప్రతిభ చూపించేది. ఊరిలో ఉన్న  కస్తూర్బా విద్యాలయంలో పది వరకూ చదివి టాపర్‌గా గుర్తింపు పొందింది. తండ్రి చనిపోయారు. తల్లి కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంటర్‌కు ఆ బాలిక కమలాపురం సమీపంలోని మరో కేజీబీవీలో చేరింది. గత ఏడాది జూనియర్‌ ఇంటర్‌ క్లాసులు ప్రారంభమైన కొద్ది రోజులకే కరోనా వల్ల కాలేజీని మూసేశారు. అప్పుడు ఇంట్లో ఎవరికీ సెల్‌ఫోన్‌ లేదు. టీవీ ఉన్నా సరిగా పనిచేయదు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పత్తి చేనులో పనికి వెళ్లాల్సి వచ్చేది. చివర్లో రోజూ సాయంత్రం అక్క ఫోన్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు విన్నా, పగటిపూట తరగతులు కోల్పోయింది. దీంతో జూనియర్‌ ఇంటర్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యింది.  

* మరో బాలిక పదోతరగతి వరకూ కమలాపురం సమీపంలోని కేజీబీవీలో 48 మంది విద్యార్థుల్లో అగ్రగామిగా ఉండేది. మేస్త్రీ పనిచేసుకునే తండ్రి కుమార్తెకు ఫోన్‌ కొనివ్వలేకపోయారు. ఈ బాలిక కూడా ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యింది.

కల చెదిరింది...కొల్లూరి వరుణ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన విద్యార్థి కొల్లూరి వరుణ్‌ ఇల్లు ఇది. తండ్రి హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. తాత, నాయనమ్మలతో కలసి ఉండే వరుణ్‌, గ్రామంలోని జడ్పీ హైస్కూలులో పదో తరగతి పూర్తిచేశాడు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్లో చేరాడు. లాక్‌డౌన్‌ ప్రకటించాక ఇంటికి వచ్చేశాడు. ఇంట్లో పాత టీవీ పాడైంది. స్మార్ట్‌ ఫోన్‌ కొనుక్కునేందుకు డబ్బులేదు. దీంతో ఆన్‌లైన్‌ విద్య దూరమైంది. తరగతులపై కనీస అవగాహన లేకుండా పోయింది. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రారంభమయ్యాక.. పెదనాన్న కుమారుడు వాయిదాల పద్ధతిలో వరుణ్‌కి సెల్‌ఫోన్‌ కొనిచ్చినా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. మొదటి సంవత్సరం ఫలితాలు ఈ నెల 16న వచ్చాయి. వరుణ్‌ అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. తీవ్ర నిరాశకు గురైన అతడు 17న ఉరేసుకుని చనిపోయాడు. వరుణ్‌ చురుకైన విద్యార్థేనని ఉపాధ్యాయులు చెప్పారు. సైన్యంలో చేరాలనేది తన కల అని చెప్పే వరుణ్‌.. సైనిక దుస్తుల్లో తరచూ ఫొటోలు దిగి స్నేహితులకి పంపేవాడు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top