బొమ్మలే పాఠాలు చెప్తాయి
బొమ్మలంటే ఇష్టపడని పిల్లలుండరు. మరి స్కూళ్లోనే బొమ్మలుంటే.. ఆ బొమ్మలే పాఠాలు చెప్తే.. ఇలాంటి వినూత్న విద్యావిధానాన్ని అందిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, చినజగ్గంపేట మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గోవిందరాజులు. ఎన్నో రకాల బొమ్మలు తయారు చేయడం, వాటితోనే పాఠాలు చెప్పించడం ఆయన ప్రత్యేకత.
గోవిందరాజులు కాకినాడ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు వృత్తిలో భాగంగా రాష్ట్రం నుండి కొంతమంది ఉపాధ్యాయులను రాజస్థాన్ సెంట్రల్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ (సిసిఆర్‌టి)కి పంపించారు. అక్కడ కాగితపు బొమ్మలు, పప్పెట్లు తయారు చేయడం నేర్చుకున్నారు. ఆ కళను వదలకుండా గోవిందరాజులు ఆచరణలో పెట్టారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను, శాస్త్రీయ దృక్పథాన్ని, కళలను వెలికి తీసేందుకు వినూత్న పద్ధతిలో బోధన చేస్తున్నారు. బొమ్మల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, ఆలోచన విధానాన్ని పెంచుతున్నారు.
అంతరించిపోతున్న తోలుబొమ్మల కళపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యా విధానంలో ఉపయోగిస్తున్నారు. జంతువులు, పక్షులు, వివిధ రూపాల్లో చేసిన పప్పెట్ల ద్వారా పాఠంలోని విషయాలను వెంట్రిలాక్విజం తరహాలో ఆ బొమ్మలచేత పలికిస్తారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కథలను పప్పెట్ల సహాయంతో, విద్యార్థులతో నాటకీకరణ పద్ధతిలో చెప్పిస్తారు. 6, 7, 8 తరగతులకు సైన్సు బోధించే గోవిందరాజులు పాఠాలు, కథలతో పాటు సామాజిక అంశాలపై బొమ్మల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మౌత్ పప్పెట్లు, స్ప్రింగ్ పప్పెట్లు, రాడ్ పప్పెట్లు, షాడో పప్పెట్లతో అన్ని సబ్జెక్టులనూ బోధించవచ్చంటున్నారు.
తాటాకులతో గ్రీటింగులు :
గతంలో గ్రామాల్లో తాటాకులతో బొమ్మలు అల్లేవారు. ఈ కళను నేర్పిస్తూ పక్షులు బొమ్మలు, పువ్వులు అల్లిస్తున్నారు. పేద విద్యార్థులు డబ్బు ఖర్చు చేయకుండా తాటాకులతో క్రిస్మస్, నూతన సంవత్సరానికి గాను గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం నేర్పించారు. ప్రకృతి, పరిసరాలను వినియోగించుకోవాలని గోవిందరాజులు చెప్తారు. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, కాగితాలతో బొమ్మలు చేసే ఓరిగామి కళను నేర్పుతున్నారు.
మొక్కజొన్న దారాలతో టీ తయారీ :
గోవిందరాజులు విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతి సైన్స్‌ఫెయిర్‌కూ తీసుకెళతారు. ఆయన బొమ్మలు అనేక జాతీయస్థాయి టార్సుఫెయిర్లలో పాల్గొన్నాయి. ఏడు రకాల పప్పెట్లు నేషనల్‌కు ఎంపికయ్యాయి. ఒకసారి మొక్కజొన్న దారాల ఉపయోగం ఏమిటని విద్యార్థి అడిగిన సందేహాన్ని నివృత్తి చేయడానికి రీసెర్చ్ మొదలుపెట్టారు గోవిందరాజులు. కాకినాడ జెఎన్‌టియు ఫుడ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ ద్వారా మొక్కజొన్న దారాల్లో కె, సి విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయని నిర్ధారించుకున్నారు. వాటితో టీ చేసి, సైన్స్‌ఫెయిర్లలో ప్రదర్శించగా జిల్లా, రాష్ట్ర, సౌత్ ఇండియా, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచించి. 17 దేశాలతో పోటీ పడి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించింది. దీనిపై త్వరలో పేటెంట్ హక్కునూ పొందనున్నారు.
మట్టి బొమ్మలు చేయడమంటే ఇష్టపడే గోవిందరాజులు సబ్బులు, ఆకులు, చాక్‌పీసులపై కూడా అజంతా, ఎల్లోరా శిల్పాలు, జాతీయ నాయకుల బొమ్మలు చెక్కుతారు. ప్రతిరోజూ ఇంటికి వెళ్లగానే బొమ్మల తయారీలో కొత్త ఆలోచనలు చేస్తారు. ఎలిమెంటరీ స్కూల్ టీచరైన ఆయన భార్య బొమ్మల తయారీలో సహకరిస్తారు. తన స్కూల్ పిల్లలకూ ఇదే తరహాలో కథలు చెప్తారు. స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చారు.
ప్రకృతి ఒడిలో పాఠాలు : గోవిందరాజులు
వ్యవసాయ సంబంధిత పాఠాలను నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లి చెప్తాను. పంటలెలా పండిస్తారు, వాటి ఉపయోగాలు, సంరక్షణ చర్యల గురించి ప్రత్యక్షంగా చూపిస్తాను. పరిశ్రమలకు, మడ అడవులకు తీసుకెళతాను. ఈ విధానంలో విద్యార్థులకు పాఠాలు సులభంగా, స్పష్టంగా అర్థమౌతాయి. కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. పిల్లలు అలిసిపోరు. ప్రతి బొమ్మనూ విద్యార్థులతో చేయించి ఆ వీడియోలను అందరికీ అందుబాటులో ఉండేలా పిల్లి గోవిందరాజులు పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను.
ఇంకా నేర్చుకోవావలనిపిస్తుంది : ఎస్. అపర్ణ, 8వ తరగతి
తాటాకులలతో గ్రీటింగులు, పక్షుల బొమ్మలు చేయడం సరదాగా ఉంటుంది. మట్టి బొమ్మలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. పాఠాలు బాగా అర్థమౌతున్నాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. నేను మా తమ్ముడు, చెల్లికి, చుట్టూ ఉన్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను.
ఇంట్లో మెచ్చుకుంటారు : యమ్. వరలక్ష్మి, 8వ తరగతి
సబ్బులతో బొమ్మలు చెక్కడమంటే చాలా ఇష్టం. ఇలాంటి ఉపాధ్యాయుడు మాకు ఉన్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. మాతో ప్రయోగాలు చేయిస్తారు. ఇలా పాఠాలు వింటుంటే రోజూ స్కూలుకు రావాలనిపిస్తుంది. బొమ్మలు తయారు చేసి పిల్లలకు గిఫ్టులు ఇస్తాను. నేను పెద్దయ్యాక టీచరై పిల్లలకు నేర్పిస్తాను. ఇంటి వద్ద చేస్తున్నప్పుడు నానమ్మ, తాతయ్య మెచ్చుకుంటారు.
0 Post a Comment:
Post a Comment