Sunday 19 December 2021

ఉన్నత విద్య ప్రైవేటీకరణ - పరిమిత భాగస్వామ్యమే మేలు

 ఉన్నత విద్య ప్రైవేటీకరణ - పరిమిత భాగస్వామ్యమే మేలుప్రపంచ బ్యాంకు 1994లో ప్రకటించిన కళాశాల చదువుల మీద ప్రత్యేక ప్యాకేజీ, గ్యాట్‌ ఒప్పందాలు ఉన్నత విద్యారంగంలో వాణిజ్య ధోరణికి నాంది పలికాయి. ఆ రంగంలో ప్రభుత్వ నిధులను తగ్గించాలని, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రపంచ బ్యాంకు ప్యాకేజీ సూచించింది. విద్యార్థుల రుసుములు అధికం చేయాలని, క్యాపిటేషన్‌ ఫీజును ప్రవేశపెట్టాలని, విశ్వవిద్యాలయాలు ప్రైవేటు సంస్థల నుంచి నిధులను సమీకరించి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచనలిచ్చింది. ఉన్నత విద్యలో వ్యాపార దృక్పథంతో అధిక ఫీజులు వసూలు చేసే సంస్థలు నాణ్యమైన విద్యనూ అందిస్తాయనే ఉద్దేశంతో ఆ ప్యాకేజీని రూపొందించారు. అయితే, ఆ ధోరణి విద్యార్థులను వినియోగదారులుగా, కోర్సులను ఉత్పత్తులుగా, విద్యాసంస్థలను అధిక లాభాలు ఆర్జించే పరిశ్రమలుగా మార్చివేసింది

దూరమవుతున్న పేదవర్గాలు :

ప్రభుత్వాలు ఉన్నత విద్యను పెద్దగా ప్రాధాన్యం లేని(నాన్‌ మెరిట్‌)అంశంగా గుర్తించి గ్రాంట్లను రాయితీలను ఉపసంహరించడంద్వారా సంస్కరణలు చేపట్టాయి. అమెరికా, కెనడా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం చాలా తక్కువ. సింగపూర్‌, హాంకాంగ్‌, శ్రీలంకల్లో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర పరిమితం. అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌, భారత్‌లలో ప్రైవేటు రంగంలో నమోదు దాదాపు 70శాతం. చైనా, పాకిస్థాన్‌, ఇండియాల్లో ప్రైవేటు సంస్థలే ఉన్నత విద్యను శాసిస్తున్నాయి. ఉన్నత, సాంకేతిక విద్యారంగాల్లో ప్రభుత్వ రాయితీలను ఉపసంహరించేందుకు నియమించిన బిర్లా అంబానీ కమిటీ, జస్టిస్‌ పున్నయ్య కమిటీ, నాలెడ్జ్‌ కమిషన్‌ దేశంలో ఉన్నత విద్యను సరళీకరించాలని సిఫార్సు చేశాయి. ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులో 25శాతమే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వంటి నియంత్రణ సంస్థలను రద్దు చేయాలని యశ్‌పాల్‌ కమిటీ 1992లో పేర్కొంది. ఉన్నత విద్యను సరళీకృతం చేసి ప్రపంచ స్థాయి పోటీకి తట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని 12వ పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. ఉన్నత విద్యలో రాయితీలపై భారీ కోత విధిస్తూ 1997లో కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ యూనివర్సిటీలు ఆర్థిక వనరులను సమీకరించుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని యూజీసీ 2003లో స్పష్టం చేసింది. ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచాలని నాలెడ్జ్‌ కమిషన్‌ జూన్‌ 2005లో ప్రధానమంత్రికి నివేదికను సమర్పించింది. నూతన విద్యావిధానం చేసిన పలు సిఫార్సులు విద్యావ్యవస్థలో ప్రైవేటు ఆధిపత్యాన్ని పెంచే దిశగానే ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. సంస్కరణల పేరిట యూజీసీ ఇటీవలి కాలంలో చేపడుతున్న చర్యలు సైతం ఉన్నత విద్యపై ప్రభుత్వ ఖర్చును తగ్గించడానికే తప్ప- విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకో, సామాజిక న్యాయాన్ని సాధించడానికో ఉద్దేశించినవి కావని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. యూజీసీ చర్యల ఫలితంగా కోర్సుల ఫీజులు భారీగా పెరగడమే కాక సమాజంలోని అల్పాదాయ వర్గాలకు ఉన్నత విద్య దూరమయ్యే ప్రమాదం నెలకొందని అంటున్నారు. ప్రభుత్వ రంగాల్లో వాణిజ్య ధోరణులవల్ల స్థూల జాతీయోత్పత్తి పెరగడం, నిరుద్యోగ సమస్య తీవ్రత తగ్గడం వంటి ప్రయోజనాలు సిద్ధించినా- మరోవైపు సామాజిక అసమానతలు పెచ్చరిల్లాయి. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో అన్ని వర్గాలకూ సమన్యాయం జరగడంలేదు. భారతీయ నైపుణ్యాల నివేదిక-2019 ప్రకారం ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల్లో 47.38శాతం మాత్రమే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో 94శాతం విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు లోపించడంవల్ల తాము ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వవలసి వస్తోందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.

ఉమ్మడి కృషి అవసరం :

అధిక జనాభా కలిగిన దేశాల్లో అందరికీ ఉన్నత విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమష్టిగా కృషి చేయడం అత్యావశ్యకం. ప్రభుత్వం ప్రైవేటు సంస్థల సహకారం, భాగస్వామ్యంతో ఉన్నత విద్యను విస్తరించాల్సిన అవసరం ఉంది. అల్పాదాయ, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందించి వారు ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలి. విద్యార్థులకు వ్యయ భారాన్ని తగ్గించడానికి సార్వత్రిక, ఆన్‌లైన్‌ బోధన పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలి. అధికాదాయ దేశాల్లో దూర విద్య అభ్యాసం 80-85 శాతం ఉంటే, అల్పాదాయ దేశాల్లో అది 50శాతం కంటే తక్కువ. పదో అఖిల భారత సర్వే (2019-20) ప్రకారం దేశంలో 11.1శాతం విద్యార్థులు దూర విద్యావిధానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యను తక్కువ ఖర్చుతో అధిక జనాభాకు చేరువ చేసేందుకు సార్వత్రిక పద్ధతి ఉత్తమ సాధనం. ఈ విధానంలో నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరచేందుకు ప్రత్యేక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు, సార్వత్రిక సంస్థల ఉమ్మడి కృషితోనే ప్రైవేటీకరణ ప్రభావాన్ని తగ్గించి, నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందించవచ్చు.

- డాక్టర్‌ సీహెచ్‌.సి.ప్రసాద్‌

(విద్యారంగ నిపుణులు)

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top