Sunday 19 December 2021

చదువులో ధ్యానం

 చదువులో ధ్యానం



ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు; జనాన్ని చదవకుండా చూడండి చాలు అంటాడు అమెరికన్‌ రచయిత రే బ్రాడ్బరీ. ఇదే అర్థం ఇచ్చే వాక్యాన్ని రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ ఇంకోలా చెబుతాడు. పుస్తకాన్ని కాల్చడానికి మించిన పెద్ద నేరాలు ఉన్నాయి; అందులో ఒకటి వాటిని చదవకపోవడం! చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం మనకు ఉండనే ఉన్నారు. చదవడం అనేది ఎంత ప్రాధాన్యత కలిగినదో చెప్పడానికి జార్జ్‌ ఆర్‌.ఆర్‌. మార్టిన్‌ ఉటంకింపు ఒక్కటి సరిపోతుంది. ప్రపంచాన్ని కుదిపిన ‘ఎ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, అది భాగమైన ‘ఎ సాంగ్‌ ఆఫ్‌ ఐస్‌ అండ్‌ ఫైర్‌’ సిరీస్‌ సృష్టికర్త అంటాడు: చనిపోయేలోగా ఒక పాఠకుడు వెయ్యి జీవితాల్ని జీవిస్తాడు. ఎప్పుడూ చదవనివాడు మాత్రం ఒకటే జీవితం గడుపుతాడు.

చదవడం అనేది ఒక ఈవెంట్‌. ఒక పోటీ. స్నేహితుల దగ్గర పుస్తకాలు తెచ్చుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం, లైబ్రరీలు, రీడింగ్‌ రూములు, అద్దె పుస్తకాల షాపులు, పాత పుస్తకాల షాపులు, అక్కడే నిలబడి పుస్తకంలో ఏ కొన్ని పేజీలనో ఆబగా చదువుకోవడం... అదంతా ఒక పాత కథ. వెయ్యి పేజీల పుస్తకమైనా ఇట్టే ముగిసిపోయేది. దిండు సైజు నవలైనా అసలు బరువయ్యేది కాదు. చదవడం అనేది గొప్ప విషయం అని అర్థమవుతూనే, దానికి దూరమైపోవడం కూడా నిజమని తెలుస్తూనే ఏమీ చేయలేని చిత్రమైన స్థితిలో ఉన్నాం.

టెలివిజన్‌ నన్ను చాలా ఎడ్యుకేట్‌ చేస్తుంది; ఎవరైనా టీవీ ఆన్‌ చేసిన ప్రతిసారీ నేను గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా గ్రూచో మార్క్స్‌. దృశ్యం రావడం అనేది చదవడాన్ని దెబ్బకొట్టిందని అందరికీ ఇప్పుడు తెలిసినదాన్నే అందరికీ తెలియకముందే చెప్పాడీ కమెడియన్‌. వేగవంతమైన రోజువారీ జీవితంలో నెమ్మదిగా సాగే చదువుకు స్థానం లేకుండా పోయింది. ప్రతిదాన్ని కథనంలో పెట్టాలనే సామాజిక మాధ్యమాల ధోరణి పుస్తకం మీద కాసేపు శ్రద్ధగా చూపు నిలపనీయని స్థితికి తెచ్చింది. ఒక అంచనా ప్రకారం, ప్రింటు కాగితాన్ని చదివేవాళ్లు దాన్ని సగం చదివి వదిలేస్తే, అదే అంశాన్ని డిజిటల్‌లో అయితే ఐదో భాగం చదవడమే ఎక్కువ.

అయితే చదవడం అనేది కొంతవరకూ రూపం మార్చుకుంది అని కూడా చెప్పొచ్చు. ఆడియో బుక్‌ వింటే చదవడం అవుతుందా, అవదా? ఆన్‌లైన్‌ క్లాసులు వింటే చదవడం వచ్చినట్టా, కాదా? ఏదైనా పీర్‌ ప్రెషర్‌. గొప్ప స్వీడిష్‌ సినిమా చూసినంత మాత్రాన దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే మళ్లీ సమూహంలో భాగం కావడానికి బిగ్‌బాస్‌ గురించి మాట్లాడవలసిందే. అందుకే ప్రతి మార్పునూ భౌతిక పరిస్థితులే శాసిస్తాయి. ఈ పరిస్థితులు చాలావరకూ సాంకేతికమని చెప్పక తప్పదు. చదవడం మీద ఆసక్తి ఉన్నవాళ్లను కూడా అందులో మునగనీయని స్థితి.

పాము మందును పాము విషంలోంచే తయారు చేస్తారు. పోయిన చోటే వెతుకు అన్నట్టుగా, పోవడానికి కారణమైనదే ఇప్పుడు కొత్తగా ఊతం అవుతోంది. ఏ డిజిటల్‌ మాధ్యమాలైతే చదువును చంపేశాయని భావిస్తున్నామో అవే మళ్లీ పెరగడానికి కారణమవుతున్నాయి. క్లబ్‌ హౌజ్‌ పుస్తకాలను చర్చించడానికి ఉపకరిస్తోంది. ఫేస్‌బుక్‌ గోడల మీద క థలు, వ్యాసాలు అచ్చవుతున్నాయి. చదివిన పుస్తకాల గురించి మాట్లాడే ‘బుక్‌టోక్‌’ విదేశాల్లో బాగా ఆదరణ పొందుతోంది. దీనివలన పుస్తకాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం ద్వారా కూడా సెలబ్రిటీలు కావొచ్చని ఇది నిరూపిస్తోంది. టిక్‌టోక్‌లో భాగమైన దీన్ని ఇండియాలో కూడా తిరిగి ప్రారంభం కావొచ్చన్న ఆశాభావాన్ని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు.

దృశ్యం విసుగెత్తి సృజనకు ఉన్న అవధులను గుర్తుతెస్తుంది. స్వీయ ఊహాత్మక ప్రపంచంలోకి వెళ్లాలంటే శబ్దమే దారి. బహుశా, అందువల్లే మళ్లీ ఆడియో బుక్స్‌ పాపులర్‌ అవుతున్నాయి. ఇంకొకటి: ఒకప్పుడు లోకానికి మన ముఖాన్ని చూపుకోవడమనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అదింక రొటీన్‌ స్థాయికి వచ్చేశాక, మన ముఖం కనబడటం అనేది ప్రాధా న్యత కోల్పోతుంది. ప్రైవసీ అనేది గొప్ప ప్రివిలేజ్‌ అవుతుంది. అందుకే ముఖం కనబడకుండా వినగలిగే, మనగలిగే సామాజిక మాధ్యమాలకు ఆదరణ దక్కుతుంది. అప్పుడు చూడటంలో కన్నా చదవడంలోనే ఎక్కువ ఆనందం దొరికే స్థితి వస్తుంది. బహుశా ప్రపంచం ఈ సంధికాలంలో ఉన్నదేమో.

ఈ స్థితిని దర్శించే కాబోలు కొందరు చదువరులు అప్పుడే ‘స్లో రీడింగ్‌’ అనేదాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ప్రతి అక్షరాన్ని ఆబగా కాకుండా, జీర్ణించుకుంటూ, ఆస్వాదించుకుంటూ చదవమని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఒకసారి స్లో మోషన్‌లో దర్శించండి. ఇంకా స్ఫుటంగా, స్పష్టంగా, దాని అన్ని సూక్ష్మ వివరాలతో, దానిదైన ప్రత్యేకతలతో. మీ చుట్టూ ఉన్నదే మరింత తదేకంగా, ఏకాగ్రతగా చూడటంలో ఎలాంటి ధ్యానస్థితి ఉంటుందో చదవడంలో కూడా అలాంటిదాన్ని అనుభవంలోకి తెచ్చుకొమ్మని సూచిస్తున్నారు. ‘ఆధునిక జీవితంలోని వేగాన్ని తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన ప్రతిక్రియల్లో నెమ్మదిగా చదవడం ఒకటి’ అంటాడు కార్ల్‌ హోనోరే. ‘ఇన్‌ ప్రెయిజ్‌ ఆఫ్‌ స్లో’ అనే పుస్తకాన్ని కూడా రాశాడీ కెనడా పాత్రికేయుడు. ఏ రిజొల్యూషన్స్‌ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నవాళ్లు ఈ రానున్న కొత్త సంవత్సరంలో ఇదొకటి తీర్మానం చేసుకోవచ్చు. చదవడం అనేది ఎటూ ఉంటుంది. కానీ దాని పూర్ణరూపంతో మనలోకి ఇంకేలా చదవాలని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక హైకూను చదివినంత మెత్తగా, నెమ్మదిగా చదవడాన్ని ఆనందిద్దాం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top