Tuesday, 21 December 2021

ఆధునిక జీవనానికి ఆలంబన - నేడు జాతీయ గణిత దినోత్సవం

ఆధునిక జీవనానికి ఆలంబన - నేడు జాతీయ గణిత దినోత్సవం



జగద్విఖ్యాత గణితవేత్త శ్రీనివాస రామానుజన్‌ జన్మదినమైన డిసెంబరు 22వ తేదీని ఏటా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ‘అనంతంపై అవగాహన ఉన్నవాడు’గా రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అన్ని దేశాల పాఠ్యప్రణాళికల్లో గణితం ప్రధాన అంతర్భాగం. అది సమస్యా పరిష్కార సాధనం. ఆధునిక శాస్త్రసాంకేతిక రంగాలకు గణితమే చోదక శక్తి. దురదృష్టవశాత్తు పిల్లల్లో అత్యధికులు గణితాన్ని పీడకలగా, తప్పని తలనొప్పిగా భావిస్తారు. ఈ దుస్థితికి కారణం గణితం కాదు, బాలల్లో అవగాహనా శక్తి కొరవడటమూ కాదు. గణితాన్ని బోధించే విధానంలోని లోటుపాట్లే అసలు సమస్య. ఏవో కొన్ని సూత్రాలను బట్టీపట్టి పరీక్ష కాగితంపై ఎక్కిస్తే చాలని విద్యార్థులు తలపోస్తున్నారంటే, అది బోధనా విధానంలోని లొసుగుల చలవే!

లెక్కలంటే భయమెందుకు : 

సమాచారం, విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనా పద్ధతులను అంచెలంచెలుగా వినియోగిస్తూ, సమస్యా పరిష్కారానికి తోడ్పడేదే గణిత శాస్త్రం. ఆర్థిక పురోగతికి సమర్థ నమూనాలను ఆవిష్కరించడానికి అది తోడ్పడుతుంది. గణితం లేనిదే కంప్యూటర్లు, కృత్రిమ మేధ, డేటా సైన్స్‌ వంటివి లేవు. అవి లేకుండా ఆధునిక శాస్త్రసాంకేతిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి సాధ్యం కావు. వివిధ సమాచార రాశుల మధ్య సంబంధాన్ని అంచనా వేసి, దాని ఆధారంగా భవిష్య కార్యాచరణను నిర్ణయించడానికి గణితం తోడ్పడుతుంది. భౌతిక, రసాయన శాస్త్రాలు, సాంకేతికత, వ్యాపారం, వైద్యం, జీవశాస్త్రం, ఆర్థిక సేవలతో పాటు పలు సామాజిక శాస్త్రాలకు గణితమే ఆయువుపట్టు. విమానయానం, శరీర స్కానర్లు- ఇవేవీ గణితం లేనిదే పనిచేయవు. భారతీయులు కనిపెట్టిన ‘సున్నా’, దశాంశాలు ప్రపంచ గణిత శాస్త్ర అభివృద్దికి సోపానాలయ్యాయి. సున్న వల్లే త్రికోణమితి, ఆల్జీబ్రా, అంక గణితం, రుణసంఖ్యలు సాధ్యమయ్యాయి. గణిత శాస్త్ర క్రమసూత్ర పద్ధతులు (అల్గొరిథమ్స్‌) లేకుండా కంప్యూటర్లు, మెషీన్‌ లెర్నింగ్‌ ఆవిర్భవించేవి కావు. కొవిడ్‌-19 వ్యాప్తి అంచనాలకు, ఔషధ పరిశోధనలకు గణాంక శాస్త్రం, కృత్రిమ మేధలే కీలకం. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయడానికి గణితశాస్త్ర ఆధారిత నమూనాలే ఆధారం. సమస్యలను ముందుగానే అంచనా వేసి, పరిష్కారాలను ప్రతిపాదించే శక్తి గణితానికి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆధునిక మానవ జీవనంలోని ప్రతి రంగమూ గణితంతోనే నడుస్తోంది. మరోవైపు, చాలామంది పిల్లలకు లెక్కల పుస్తకం తెరవగానే నిద్ర ముంచుకొస్తుంది. దాని పేరు చెబితేనే వణుకు పుడుతుంది. పాఠశాలల్లో గణితాన్ని బోధించే తీరులోనే లోపం ఉంది. విద్యార్థులకు అన్ని భయాలూ పోగొట్టి వారు గణితంపై ఆసక్తి పెంచుకునే వాతావరణం కల్పించాలి. ఉపాధ్యాయులు ఎంతో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ విద్యార్థుల్లో కుతూహలం, దృఢ సంకల్పాన్ని పెంచాలి. గణితం నేర్చుకోవడానికి వారు ఉవ్విళ్లూరేలా బోధన చేపట్టాలి. వారిలో సృజనాత్మక ఆలోచనా శక్తి, తర్కం, విమర్శనాత్మక ఆలోచనా విధానం, సమస్యా పరిష్కార శక్తులను పెంచిపోషించాలి. ముందస్తు అభ్యాస తరగతులు నిర్వహించాలి. తరగతి గదుల్లో ప్రశ్నలను ఆహ్వానించాలి. అన్ని వయసుల పిల్లల్లో తార్కిక, ఉన్నత స్థాయి ఆలోచనా శక్తిని పెంపొందించాలని నూతన విద్యావిధానం పిలుపిస్తోంది. చిన్నారుల్లో సహజంగానే ఆటలంటే ఆసక్తి ఉంటుంది. గణిత అభ్యసనాన్నీ ఆటపాటల్లా ఆసక్తికరంగా సాగిపోయేట్లు చూడాలి.

బోధనకు సాంకేతిక ఆసరా : 

గణిత సమస్యలను త్రీడీ రూపంలో ప్రతిపాదించి పరిష్కారించడానికి విద్యార్థులను పురిగొల్పాలి. ఆయా సమస్యలను చిత్రరూపంలో సమర్పించే మొబైల్‌ యాప్స్‌ చాలానే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు యూట్యూబ్‌, యానిమేషన్లు, టెడ్‌ ప్రసంగాల వీడియోలను ప్రదర్శిస్తూ గణిత బోధన చేపట్టవచ్చు. ఇంటరాక్టివ్‌ వైట్‌బోర్డ్స్‌, ఈ-పుస్తకాలు, ఉపాధ్యాయుల బ్లాగులనూ ఉపయోగించాలి. దీనివల్ల బోధన, అభ్యాసాలు సులభతరమవుతాయి. ప్రస్తుత సంక్లిష్ట, పోటీ ప్రపంచంలో రాణించాలంటే విజ్ఞాన, నైపుణ్యాలను మేళవించి సమస్యలను పరిష్కరించే ఒడుపును విద్యార్థులు అలవరచుకోవాలి. విస్తృత సమాచారాన్ని విశ్లేషించి, లోతైన అవగాహన ఏర్పరచుకుని సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని వారు సంపాదించాలి. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, గణితాలను కలిపి స్టెమ్‌ కోర్సులు అంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలకు, వాటితోపాటు స్టెమ్‌ పట్టభద్రులకు గిరాకీ పెరుగుతోంది. కాబట్టి గణితాన్ని విద్యార్థులు కానీ, సమాజం కానీ అలక్ష్యం చేయకూడదు. విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి, వారికి ఇంకాస్త తోడ్పాటు అందించి... వారు గణితంలో రాణించేట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీద ఉంది. పాఠశాల యాజమాన్యాలు అవసరమైతే నిపుణుల సలహాలను సూచనలను స్వీకరించవచ్చు. ఆ విధంగా బహుముఖ కృషి సాగితేనే- గణిత భావాలు విద్యార్థులకు సుబోధకమై, సమస్యల  పరిష్కారంపై వారి ఆసక్తి ఇనుమడిస్తుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top