Tuesday, 21 December 2021

గదితప్పిన చదువులు - ఉన్నత పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు. విలీనమే అసలు సమస్య.

 గదితప్పిన చదువులు - ఉన్నత పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు. విలీనమే అసలు సమస్య.



శ్రీకాకుళం జిల్లాలో 373 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 98 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. 

ప్రతి 40 మందికి ఒక గది ఉండాలి. కానీ విద్యార్థుల సంఖ్య, గదులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఈ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తున్నా నూతన భవనాల నిర్మాణానికి అడుగులు పడటం లేదు. మరోవైపు చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. ఆరుబయట కూర్చుంటున్నవారు చలి తీవ్రతకు వణుకుతూ ఇబ్బంది పడుతున్నారు. 

జిల్లాలోని ఉన్నత పాఠశాలలను తరగతి గదుల కొరత వేధిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో చాలాచోట్ల వరండాలు, క్రీడా మైదానాలు, చెట్లే గదులుగా మారుతున్నాయి. అసలే కొవిడ్‌ కాలం,  ఆపై నిబంధనలు పాటించడం మరింత కష్టతరంగా మారింది. ఫలితంగా వసతుల్లేక, విద్యార్థులను సర్దుబాటు చేయలేక ఉపాధ్యాయులు సైతం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పరిశీలన కథనం.

విలీనమే అసలు సమస్య : 

ఇటీవల 200 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.

241 చోట్ల ఒక ప్రాథమిక, మరో 11 చోట్ల రెండు ప్రాథమిక బడులకు చెందిన తరగతులను కలిపారు.

ఎక్కడా గదుల అవసరంపై అధికారులు ముందస్తుగా కసరత్తు చేయలేదు.

ఇప్పటికే 6-10 తరగతుల వారికి భవనాలు లేవు. దీనికితోడు విలీన ప్రక్రియతో సమస్య మరింత ఎక్కువైంది.

ఫిర్యాదుల వెల్లువ :

నాడు-నేడు తొలివిడతలో కొన్ని బడుల రూపురేఖలను ప్రభుత్వం మార్చింది. ప్రస్తుతం రెండో విడత నడుస్తోంది. పూర్తి శిథిలావస్థలో ఉన్న వాటిని రెండోదశలో చేర్చలేదు. కొన్ని తరగతులు విలీనం చేయడంతో కొత్తగా ఏర్పడిన భవనాల కొరతపై అధికారులకు ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అదనపు గదుల అవసరంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులు వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమగ్ర ప్రతిపాదనలు పంపించాలి. ఇప్పటికే కొన్ని పంపారు. అక్కడి నుంచి అనుమతులు రావాలి. తర్వాతే టెండర్ల దశకు వస్తాయి.

ప్రతిపాదనలు పంపించాం - బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి.

గదుల కొరత ఉన్నమాట వాస్తవమే. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్ని అదనపు తరగతులు అవసరమో ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు రాష్ట్రస్థాయి అధికారులకు పంపించాం. అనుమతులు రాగానే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top