Sunday 29 August 2021

కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి...? : : కృష్ణాష్టమి విశిష్టత , పూజా విధానం ఇదే... కృష్ణాష్టమి సంబరాల పరమార్ధం ఇదే...

 కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి...?శ్రావణమాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినం శీకృష్ణాష్టమి.

 "కృష్ణం వందే జగద్గురుమ్" అని సకల జాతులవారూ ఆ పరమాత్మను స్తుతిస్తారు. ధర్మమునకు హాని, అధర్మమునకు అభ్యుత్థానం జరిగినపుడు, ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తనను తానే సృజించుకొంటాడు. 

సకల లోకేశ్వరుడు, ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడి యెుక్క ఆవిర్భావం జరిగిన రోజు శ్రావణమాసం, కృష్ణ పక్షం, అష్టమి. 

ఒకప్పుడు వేలకొలది రాక్షసులు ద్వాపరయుగం చివరి పాదంలో మహారాజుల వంశములో జన్మించారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాల, దంతవక్త్రాదులు, కలిపురుషుని అంశతో దుర్యోధనాదులు జన్మించారు. వీరి పరిపాలనను భూమి తట్టుకోలేక పోయింది. గోరూపం  ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమని ప్రార్థించింది. బ్రహ్మ ఆమెను ఓదార్చి, ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీహరి వారికి అభయం యిచ్చి కనబడకుండా వారితో త్వరలో భూమి మీద అవతరించి దుష్టశిక్షణ చేస్తానని వరమిచ్చాడు. 

అలా వరమిచ్చిన స్వామి వారు శ్రావణమాసంలో బహుళాష్టమీ తిథినాడు సరిగ్గా అర్ధరాత్రి పూట, సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు ఈ ఐదుగురు ఉచ్ఛ స్థితిలో నుండగా శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడు. 

125 సంవత్సరాలు ఈ అవతారంలో భూమి మీద నివసించి అనేక లీలలు చేసి చూపించాడు. భూభారం తొలగించాడు. అన్నింటినీ మించి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అందించని మహాద్భుత గ్రంథాన్ని "భగవద్గీత" ను లోకానికి అర్జునుడనే శిష్యుని మిషతో అందించాడు. 

జగద్గురుడంటే శ్రీకృష్ణుడే అని ఆదిశంకరుల వంటివారు అన్నారంటే దానికి కారణం భగవద్గీతయే. 

భగవంతుడు 22 అవతారాలు ఎత్తుతాడనీ, వాటిలో 21 అంశావతారాలనీ, ఒక్క శ్రీకృష్ణావతారమే పరిపూర్ణావతారమనీ శ్రీమద్భాగవతం చెబుతోంది.

 "ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్" అని వ్యాసుడన్నాడు.

 ఇంతటి శ్రీకృష్ణావతారాన్ని లోకానికి అందించిన పవిత్రమాసం శ్రావణ మాసం.

ఈ తిథినాడు శుచిగా  ఉండి, శ్రీకృష్ణుడిని పది తులసీదళాలతో పూజిస్తూ, 

1) కృష్ణాయ నమః,

 2) విష్ణవే నమః

3) అనంతాయ నమః

 4) గోవిందాయ నమః

5) గరుడధ్వజాయ నమః 

6) దామోదరాయ నమః 

7) హృషీకేశాయ నమః 

8) పద్మనాభాయ నమః 

9) హరయేనమః

10) ప్రభవే నమః 

అనే దశ మంత్రాలను ఉచ్చరించాలి. 

తరువాత ప్రదక్షిణాదులు చేసిన వానికి శ్రీకృష్ణానుగ్రహం కలుగుతుంది. 

శ్లో|| దశాహం కృష్ణదేవాయ పూరికాదశచార్పయేత్||

అష్టమి మెుదలుకొని వరుసగా పదిరోజులు శ్రీకృష్ణుని  తులసీదళాలతో అర్చిస్తూ పది పూరీలు నివేదించిన వానికి సారూప్యం(కృష్ణుని వంటి రూపం) అనే ముక్తి లభిస్తుంది. 

కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా, ఫలమునైనా, పుష్పమునైనా, పత్రమునైనా స్వీకరిస్తాడు. 

కృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజలు చేయాలి, తులసీదళాలతో పూజించాలి. 

మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో పూజించాలి. 

కృష్ణుడికి తాజా వెన్న సమర్పించాలి. కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఆవు పాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. సాయంత్రం కృష్ణ మందిరానికి వెళ్లి కృష్ణ దర్శనం చేసుకోవాలి. 

కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టే కార్యక్రమం చేయాలి. 

ఈరోజు తప్పకుండా గోసేవ చెయ్యాలి.


కృష్ణాష్టమి విశిష్టత , పూజా విధానం ఇదే... కృష్ణాష్టమి సంబరాల పరమార్ధం ఇదే...


శ్రావణ మాసంలో అన్నీ విశేషాలే. అత్యంత భక్తిభావంతో , ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు , వరలక్ష్మీ వ్రతంతో పాటు మరో విశేషం కూడా ఉంది. ఈ మాసంలోనే శ్రీ కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు. తన లీలలతో భక్తి , జ్ఞానం , యోగం , మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం శ్రీ కృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు.

కృష్ణాష్టమి రోజు తల్లులు యశోదలుగా .. పిల్లలు కృష్ణయ్యలు , గోపికలుగా

ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి , యశోదలుగా భావించుకుంటూ , తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు , కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు.

కృష్ణాష్టమి పూజా విధానమిదే

కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి , గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి , పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు . జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే , చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో , ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో .. అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి , ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి , చక్కగా పట్టు వస్త్రాలు కట్టి , ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేయాలి.

కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు

కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇక ఎవరి శక్తికొలది వాళ్ళు ప్రసాదాలను తయారుచేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి. ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.

వెన్నదొంగకు వెన్నంటే ఇష్టం .. కృష్ణుడి పాదాలు వేసేది అందుకే

శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండివంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెబుతారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న , పాలు , పెరుగు , బెల్లం , శనగ పప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్టు పాద ముద్రలు వేసి ఆహ్వానిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం , చిన్నారుల్లోనూ యువత లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.

ఉట్టి కొట్టే సంబరం

యువతలో ఉత్సాహం

ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు . ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు పాలు చిల్లరడబ్బులు సేకరించి దానిని ఉట్టి లో పెట్టి ఆతర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక్కరుగా కానీ , సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. వసంత నీళ్ళు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు .

కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్యలే , గోపికమ్మలే

కృష్ణాష్టమి రోజున ఏ ఇంట్లో చూసినా నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది. ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు , కృష్ణుడి వేషధారణలో కనిపిస్తారు. చక్కగా పంచె కట్టుకుని నిలువు నామాలు పెట్టుకొని తలపై నెమలి పింఛంతో , చేతిలో వేణువును పట్టుకుని వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ఆడపిల్లలైతే కృష్ణుని ఆరాధించే గోపికల్లాగా, కృష్ణుడికి ప్రియమైన రాధికలాగా చక్కని వేషధారణతో కనువిందు చేస్తారు.

కృష్ణుడి ఆలయాల్లో , ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలు

కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంతా కాదు. కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్య కు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం , గీతాపఠనం , ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారం

శ్రీకృష్ణ అవతారం ఇచ్చిన అద్భుత సందేశం

ధర్మాన్ని రక్షించడానికి మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం. బాలకృష్ణుడు గా అల్లరి పనులు చేసిన , వెన్నదొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది. గోవర్ధన గిరిధారిగా , కాళీయమర్దనుడిగా , గోపికా లోలుడిగా , అసుర సంహారిగా , గీత ప్రబోధకుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను నడిపిస్తుంది. మరి అలాంటి నల్లనయ్యకు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం. ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

కృష్ణాష్టమి – కృష్ణ జయంతి : : కృష్ణాష్టమి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ


సింహ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిధి రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమిని జరుపుకుంటాము. కానీ వాస్తవంగా ద్వాపర యుగం చివరలో ఈ

సింహ మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణావతారం జరిగింది అని కల్పతరువు అనే గ్రంథంలో బ్రహ్మ వాక్యం.


తధా భాద్రపదే మాసి

కృష్ణాష్టమ్యాం కలే:పురా

అష్టావింశతి తమే జాత:

కృష్ణో సౌ దేవకీ సుత:


అని కల్పతరువు వాక్యము. కలియుగం కంటే ముందు అనగా ద్వాపర యుగం చివరలో భాద్రపద అష్టమి నాడు దేవకీ పుత్రుడుగా శ్రీహరి అవతరించాడు. ఇది 28వ ద్వాపర యుగము అప్పుడు సింహ మాసం భాద్రపద మాసంలో ప్రవర్తించినది. సూర్య సంచారం , గ్రహ సంచారాన్ని బట్టి కలియుగం వచ్చిన తరువాత సింహ మాసం శ్రావణ మాసంలోకి ప్రవర్తించినది. ఇప్పటికీ కొన్ని సార్లు కృష్ణాష్టమి భాద్రపద మాసంలో ప్రవర్తిస్తుంది. ఈ కృష్ణాష్టమి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి జన్మాష్టమి , మరొకటి కృష్ణ జయంతి. అందులో కేవలం

అష్టమి ఉంటే జన్మాష్టమి అంటారు.


యే న కుర్వంతి జానంత: కృష్ణ జన్మాష్టమీ వ్రతం

తే భవంతి నరాప్రాజ్ఞ వ్యాలా వ్యాఘ్రాస్త కాననే

దివావా యదివా రాత్రౌ నాస్తి చేత్‌ రోహిణీ కలా

రాత్రి యుక్తాం ప్రకుర్వీత విశేషేణ ఇందు సంయుతాం

శ్రావణ బహుళే పక్షే కృష్ణ జన్మాష్టమి వ్రతం

న కరోతి నరో యస్తు భవతి క్రూర రాక్షస:

అని భవిష్య పురాణ వాక్యం. అనగా తెలిసి కూడా కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించని వారు అరణ్యంలో సర్పములు , పులులుగా జన్మిస్తారు

అనేది స్కాంద పురాణ వాక్యం. పగలు కానీ , రాత్రి కానీ రోహిణి అంశ కూడా లేనపుడు ఈ కృష్ణాష్టమి వ్రతం రాత్రి పూట ఆచరించాలి అనేది బ్రహ్మాండ పురాణ వాక్యం. ఇక శ్రావణ కృష్ణ పక్షంలో *అష్టమి నాడు కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించని వారు క్రూర స్వభావం గల రాక్షసుడిగా పుడతారని భవిష్య పురాణ వచనం.* ఇలా రోహిణి నక్షత్రం లేకుండా కేవలం అష్టమి అయినచో జన్మాష్టమి అంటారు. రోహిణితో కూడిన అష్టమిని కృష్ణ జయంతి అంటారు.


కృష్ణాష్టమ్యాం భవేద్యత్ర

కలఇకా రోహిణీ యదీ

జయంతీ నామ సాప్రోక్త

ఉపోష్యాసా ప్రయత్నత:


అని అగ్ని పురాణ వచనం

అష్టమీ కృష్ణ పక్షస్య

రోహిణీ ఋక్ష సంయుతా

భవేత్‌ ప్రౌష్ట పదేమాసి

జయంతీ నామ సాస్మృతా

అనేది విష్ణు ధర్మంలో విష్ణు రహస్య వచనం.

శ్రావణ బహుళ అష్టమి కానీ భాద్రపద బహుళ అష్టమి కానీ రోహిణీ నక్షత్రంతో ఒక కలా మాత్రం ఉన్నా దాన్ని జయంతి అంటారు. ఆనాడు తప్పకుండా ఉపవాసం చేయాలి. ఈ రోహిణి నక్షత్రం పగలు , రాత్రి ఉంటే ఉత్తమం , కేవలం రాత్రి ఉంటే మధ్యమం , పగలు ఉంటే అధమం ఈ విధంగా అష్టమి నాడు రోహిణి నక్షత్రం ముహూర్త కాలం ఉన్నా , కలా (12 సెకెండ్లు) మాత్రం ఉన్నా ఆ రోజు కృష్ణ జయంతిగా వ్రతాన్ని అనుష్ఠించి ఉపవసించాలి అనేది వసిష్ఠ సంహితా వచనం. ఆ రోజు అర్థరాత్రి చంద్రోదయ కాలంలో రోహిణీ యోగం ఉన్నట్లైతే ఆ సమయంలో స్నానం చేసి పవిత్రులై పూజాది వ్రతములు చేయవలెను. ఉదయం నుంచి ఉపవసించవలెను. అర్థ రాత్రి బ్రాహ్మణులను , పురోహితులను , బంధువులను పిలుచుకుని కృష్ణ జన్మోత్సవం జరుపుకోవాలనేది విష్ణుధర్మ వచనం.

శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజునాడు పగలు గానీ రాత్రి కానీ రోహిణీ ఏ మాత్రం ఉన్నా లేదా భాద్రపదంలో ఉన్నా ఆనాడు కృష్ణ జయంతి జరుపుకొనవలెనని పురాణ వచనం. సూర్యోదయం కంటే ముందు స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అర్చా మూర్తులకు పంచామృతాది ద్రవ్యములతో అభిషేకం జరిపించి విశేషమైన అలంకారం చేసి శక్తి కొలది పక్వాన్నములు చేసి అవన్నీ నివేదన చేసి కృష్ణావతార రహస్యాలు ఆ పగలంతా విని రాత్రి కాగానే స్వామిని ఊయలలో పరుండబెట్టి యశోదామాత విగ్రహాన్ని కూడా ఊయలలో పెట్టి సూతికా ఉత్సవం జరుపుకోవాలి. ప్రతి వర్షం కృష్ణ జయంతి లేదా కృష్ణ జన్మాష్టమి వ్రతం ఆచరించని స్త్రీ లేదా పురుషులు సర్పములుగా పుట్టెదరని స్కాంద పురాణం మధన రత్న కల్పంలో తెలుపబడింది. జన్మాష్టమి వ్రతాన్ని తాము స్వయంగా చేసినా ఇతరులతో చేయించినా వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. వారు ఆచరించే అన్ని కార్యములు విజయవంతం అవుతాయి. ఈ జయంతి వ్రతం నిత్య వ్రతం , కామ్య వ్రతం , నిష్కామ వ్రతం అని మూడు విధాలుగా ఉంటుంది. రాజులు యుద్ధంలో జయం కోసం , జ్ఞానులు ముక్తి కోసం ఈ వ్రతం చేస్తారు.

ధర్మ మర్థంచ కామంచ

మోక్షంచ మునిపుంగవా

దధాతి వాంఛితా నర్ధాన్‌

యే చాన్యే ప్యతి దుర్లభా

అనగా ధర్మమును , అర్థమును , కామమును , మోక్షమును కోరిన వాటిని వేటినైనా అతి దుర్లభములైనా జన్మాష్టమి , జయంతి వ్రతం ఆచరించిన వారికి పరమాత్మ ప్రసన్నుడై ఇస్తాడు.

ఒకవేళ రోహిణీ నక్షత్రం అష్టమి తరువాత ఉంటే అనగా నవమి నాడు వచ్చినచో లేదా ముందురోజే వచ్చినచో జయంతి ఉత్సవం జరపాలి కానీ జన్మాష్టమి జరపాల్సిన అవసరం లేదు. రోహిణీ నక్షత్రం ఉన్నరోజు ఉపవాసం చేయాలి. అలా ఉపవసించి వ్రతం చేసిన వారికి మూడు జన్మల పాపం తొలగిపోతుంది. అర్థరాత్రి రోహిణీ యోగం ఉన్నచో ఆనాడు చేసిన వ్రతం మూడు జన్మల పాపాన్ని పోగొడుతుంది. ఈ కృష్ణాష్టమి రోహిణీ బుధవారం ఈ మూడు కలిసిన యోగం ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే లభిస్తుంది. జయంతి నామ శర్వరీ అనుప్రమాణంతో జయంతి అనగా రాత్రి అని అర్థం.

బ్రహ్మాండ పురాణానుసారం రాత్రి పూట రోహిణీ ఉన్నపుడు జయంతి వ్రతం చేయాలని వచనం. అలాగే *‘అష్టమి పూర్వ విద్ధాంతు నకార్య’* అని విష్ణు ధర్మ ప్రమాణాన్ని బట్టి సప్తమితో కూడిన అష్టమి నాడు ఈ వ్రతం ఆచరించరాదు. నవమితో కూడిన అష్టమి నాడే ఆచరించాలి. ఆరోజే రోహిణీ నక్షత్రం బుధవారం కూడా కలిసి ఉన్న యోగం నూరు సంవత్సరాలకు ఒకసారైనా దొరకదు. కృష్ణాష్టమి , కృష్ణ జయంతి వ్రతములను ఆచరించిన వారు లభించిన ప్రేత తత్వాన్ని నశింప చేసుకుంటారు.

కృష్ణం ధర్మం సనాతనం

పవిత్రాణాయ సాధూనాం

వినాశయ చతుష్కృతాం

ధర్మ సంస్థాప నార్ధాయ

సంభవామి యుగేయుగే

అని ఉద్ఘోషించిన పరమ దయాళువు శ్రీకృష్ణ పరమాత్ముడు. సజ్జన రక్షణను దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలో అవతరిస్తాడని దానికి అర్థం.

చెరసాలలో పుట్టి గోశాలలో పెరిగి గోపాల బాలకులతో గోపికలతో ఆడిపాడి తానాడిన ప్రతి ఆటలో ఒక దుష్ట సంహారాన్ని జరిపి శిష్ట రక్షణ , ధర్మ స్థాపన చేసిన వాడు శ్రీకృష్ణుడు. పూతన ఇచ్చిన విషం తాగి ఆమెకు మోక్షం ఇవ్వడంలో ఏ భావంతో చేసినా తనకు అర్పిస్తే చాలు మోక్షం ఇస్తాననే ఉపదేశం దాగి ఉంది. ఆమె దగ్గర ఉన్న విషం ఆమె అర్పించింది , తనకు విషం , అమృతం సమానమేనని తనకు ఇవ్వాలనే భావనే ముఖ్యమని వైరంతో ఇచ్చినా ప్రేమతో ఇచ్చినా తాను మోక్షమే ఇస్తానని ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు.

శ్రీకృష్ణుడు తనను చంపడానికి వచ్చిన వారందరికీ మోక్షం ఇచ్చాడు. తన భక్తులకు అపకారం చేస్తున్న కాళియుని శిక్షించి దూరంగా పంపాడు. వర్షాధిపతిని తానేనని తానే వర్షింప చేస్తానన్న ఇంద్రుని అహంకారాన్ని గోవర్థన పర్వతంతో , సృష్టికర్తను తానేనన్న బ్రహ్మ అహంకారాన్ని

గోవత్సల రూపంతో తొలగించిన వాడు శ్రీకృష్ణుడు.

రామావతారంలో తన మోహన సౌందర్యానికి మోహించి భార్యలుగా ఉందామని కోరుకున్న ఋషులను , అప్సరసలను , దేవతా స్త్రీలను గోపికలుగా , 16 వేల మంది భార్యలుగా అవతరింప చేసి వారి కోరికకు అనుగుణంగా ప్రవర్తించి వారిని రక్షించాడు శ్రీకృష్ణుడు. ఏ ప్రాణికైనా పెద్ద ఆపద కోరిక తీరకపోవడమే , అది ఆహారం , విహారం , వస్త్రాలు , ఆభరణాలు ఏమైనా సరే. కుచేలుడు కోరకున్నా సంపద ఇచ్చాడు కృష్ణుడు అదే అకృరుడు కోరినా ఆపద తొలగించలేదు. తనను నమ్ముకున్న వారిని బాధిస్తున్న కంసాదులను సంహరించాడు. 18 సార్లు జరాసంధుని సైన్యాన్ని అంటే 384 అక్షౌహిణుల సైన్యాన్ని బలరాముడుతో కలిసి సంహరించి నిజమైన భూ భారాన్ని తగ్గించాడు కృష్ణుడు.

పాండవులను చేరదీసి కౌరవుల అధర్మాన్ని , రాజ్య కోరికను పెంపొందింప చేసి సకల లోకాలకు ఉపకరించే గీతోపనిషత్‌ను అందించి 18 అక్షౌహిణుల కౌరవ , పాండవ సైన్యాన్ని అవతరింప చేసి భూ భారాన్ని తొలగించిన వాడు శ్రీకృష్ణడు. అధర్మం తన వారు చేసినా ఇతరులు చేసినా పక్షపాత బుద్ధి లేకుండా వారిని నిర్మూలిస్తానని తనకు ‘తన’ ‘పర’ అన్న బేధం లేదని ధర్మమే తన స్వరూపం , అధర్మం తన పృష్ట భాగం అని ఉపదేశించడానికి తన వంశాన్ని కూడా నిర్మూలించి పరిపూర్ణంగా భూ భారాన్ని , అధర్మాన్ని తొలగించి అన్న మాట ప్రకారం ధర్మాన్ని స్థాపించి అవతారాన్ని ముగించిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కావున ‘కృష్ణ ధర్మం సనాతనం’ అని ఋషుల వచనం. ఆ సనాతన ధర్మాన్ని సాక్షాత్కరించుకుని సేవించుకుని తరిద్దాం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top