Sunday 18 April 2021

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం ఏప్రిల్ 18 - భారతదేశంలో నమ్మశక్యం కాని 6 దేవాలయాలు

 అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం ఏప్రిల్ 18 - భారతదేశంలో నమ్మశక్యం కాని 6  దేవాలయాలు

   భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం. చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగునా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం. సైన్స్ కు కూడా అంతుచిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవడం, ఆ ప్రదేశాలకు పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కధ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అటువంటి 6  దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. సంగీతాన్ని వినిపించే మెట్లు:

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో 'ఐరావతేశ్వర ఆలయం' ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమ శివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్ధంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే ఏడు రకాల శబ్ధాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు.

2. స-రి-గ-మ సంగీత స్తంభాలు - హంపి ఆలయం

కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది. శిధిలమైన విట్టల బజార్ కు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డో-రె-మి-స సంగీత స్వరాలు వినిపిస్తాయి.

3. వేలాడే స్తంభం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది. దీనినే లేపాక్షి ఆలయం అని కూడా అంటారు. అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ పరిసరాల్లో ఉండే 70 స్తంభాలలో ఒకటి మాత్రం ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది. వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు. ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది.

4. గ్రానైట్ దేవాలయం - బృహదీశ్వర ఆలయం

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్ప కళతో అలరారే ఆలయం 'బృహదీశ్వర దేవాలయం'. ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడ కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం. ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సుదూర ప్రాంతాల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నా ఏక శిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయం నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భారతనాట్యం భంగిమలో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృహదీశ్వరాలయం ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

5. 22 బిలియన్ డాలర్ల ఖజానా గల ఆలయం:

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో 7 రహస్య ఖజానాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు అభ్యర్ధన మేరకు ఈ ఆలయంలోని 6 రహస్య ఖజానాలను తెరిచి బంగారు ఆభరణాలను లెక్కించగా వాటి విలువ సుమారు 22 బిలియన్ డాలర్లుగా తేలింది. 7వ ఖజానా ఇనుప ద్వారాలతో రెండు కోబ్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది. అయితే ఇది కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరువబడుతుందని, కాదని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉపద్రవం తప్పదనే నమ్మకం ఉంది.

6. పూరీ ఆలయంపై గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా:

హిందూ భక్తులకు పూరీ జగన్నాధస్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది. భారతదేశంలోని ఛార్ థామాలలో పూరీ ఒకటి. ఈ ఆలయం శిఖరం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం విశేషం. ప్రతి రోజూ ఓ పూజారి 45 అంతస్తులు గల ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు. సుమారు 1800 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ జెండాను ఏ రోజైనా మార్చని యెడల ఆలయాన్ని 18 రోజుల పాటు మూసివేస్తారు.


Collected by

RV RAMANA DISTRICT SCIENCE OFFICER CHITTOOR

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top