50-55 భయం ! - ముందస్తు రిటైర్‌మెంట్‌పై కేంద్రం తాజా మెమోరాండం
పాత మార్గదర్శకాలపై కేంద్ర సర్కారు పునరుద్ఘాటన
✔️ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ‘ముందస్తు-నిర్బంధ’ పదవీ విరమణపై మోదీ సర్కారు సవివరమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉద్యోగులకు సుపరిచితమైన 56(జే)/(ఎల్) నిబంధనలను పునరుద్ఘాటిస్తూ, ఒక్కచోట గుదిగుచ్చుతూ శుక్రవారం ఒక మెమోరాండం జారీ చేసింది.
✔️ ఫండమెంటల్ రూల్ 56(జే)/(ఎల్), సీసీఎస్ పెన్షన్ రూల్స్‌లోని 48వ నిబంధన ప్రకారం... ప్రజా ప్రయోజనం, సమర్థ పాలన, ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసం ఉద్యోగులకు ముందుగానే రిటైర్‌మెంట్ ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన హక్కులున్నాయి. ఇందులో భాగంగా... 30 సంవత్సరాల సర్వీసు లేదా 50/55 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. సదరు ఉద్యోగి వ్యక్తిగత సమగ్రత (నిజాయితీ) సందేహాస్పదంగా ఉంటే కచ్చితంగా రిటైర్ చేస్తారు. మరో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులను కేవలం ‘అసమర్థత’ కారణంగా ముందుగానే తీసేయకూడదు. శారీరకంగా, మానసికంగా ఒక్కసారిగా తీవ్రమైన మార్పు వస్తే మాత్రం ముందస్తు రిటైర్‌మెంట్ ఇవ్వొచ్చు. ✔️ ప్రమోషన్ వచ్చి కొత్త బాధ్యతలు స్వీకరించిన వారిని కూడా కనీసం ఐదేళ్లపాటు రిటైర్ చేయవద్దు. ఇక... ‘ముందస్తు రిటైర్‌మెంట్’పై నిర్ణయం తీసుకునేముందు సదరు ఉద్యోగి సర్వీస్ రికార్డు మొత్తాన్ని పరిశీలించాలి. ఏసీఆర్/ఏపీఏఆర్‌పై మాత్రమే ఆధారపడకూడదు. ఉద్యోగుల పనితీరును ఏ స్థాయి వారు, ఎప్పుడెప్పుడు సమీక్షించాలనే వివరాలను కూడా ఈ మెమోరాండంలో వివరించారు. 56(జే) నిబంధనలు కొత్తేమీ కాదు. కానీ, మోదీ సర్కారు వచ్చిన తర్వాతే ఈ అస్త్రాన్ని విరివిగా వాడటం మొదలుపెట్టింది. ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు అనేక మందికి ‘నిర్బంధ పదవీ విరమణ’ పేరిట ఇంటికి పంపించింది.
✔️ తాజాగా... ‘ఉద్యోగుల తొలగింపు కేంద్రం హక్కు’ అని పునరుద్ఘాటిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మెమోరాండం జారీ చేయడం గమనార్హం. అంతేకాదు... ‘‘56(జే) కింద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగిని తొలగించే హక్కు కేంద్రానికి ఉంటుంది. సుపరిపాలన కోసం అసమర్థులను/పనికిరాని వారిని పక్కన పెట్టాల్సిందే’’ అంటూ సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను కూడా ఈ మెమొరాండంలో ఉటంకించింది. అయితే... ఈ నిబంధనల కింద రిటైర్‌మెంట్ ఇవ్వడాన్ని ‘పెనాల్టీ’గా భావించకూడదని తెలిపింది. సదరు ఉద్యోగికి అందాల్సిన అన్ని ప్రయోజనాలు లభిస్తాయని... ‘కంపల్సరీ రిటైర్‌మెంట్’కూ, దీనికీ సంబంధం లేదని వివరించింది.
0 Post a Comment:
Post a Comment