AP Academic Calender - విద్యాసంవత్సరంలో మార్పులు - పరీక్ష విధానంలో మార్పులు
దేశాన్ని కరోనావైరస్ కుదిపేసింది. ఇప్పటికే ఇది పంజా విసరడంతో అన్ని రంగాలు నష్టపోయాయి. వీటిలో విద్యారంగం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లల చదువులకు ఈ మహమ్మారి బ్రేక్ వేసింది. విద్యాసంవత్సరం అర్థాంతరంగా కరోనా కారణంగా ముగిసింది. 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. తాజాగా ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యాసంవత్సరంలో మార్పులు
కోవిడ్-19 కారణంగా 2019-2020 విద్యాసంవత్సరం పూర్తి స్తాయిలో ముగియలేదు. కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభించిన నేపథ్యంలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.
దీంతో అన్ని పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసింది. ఇక తాజాగా విద్యాసంవత్సరంకు సంబంధించిన క్యాలెండర్‌లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక ఏడాది జూన్ 12 నుంచి దాని తర్వాత ఏడాది జూన్ 11వరకు ఒక విద్యాసంవత్సరం ఉండేది. అయితే కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరంలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఇక నుంచి ఆగష్టు నుంచి జూలై వరకు విద్యాసంవత్సరం కొనసాగుతుంది. పరీక్షల విధానంలో కూడా మార్పులు చేపట్టింది.
ఆగష్టు నుంచి జూలై వరకు...
ఇప్పటికే అకడెమిక్ క్యాలెండర్‌లో రెండు నెలల కోల్పోయింది. దీంతో కొత్త విద్యాసంవత్సరంగా ఆగష్టు 1 నుంచి వచ్చే ఏడాది జూలై 31వరకు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు 10వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే 1995 వరకు ఇలాంటి విద్యాసంవత్సరమే అంటే ఆగష్టు 1 నుంచి జూలై 31వరుక ఫాలో అయ్యేవారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కనీసం 10వ తరగతి పాస్ అర్హతగా ఉండేది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్మీడియెట్‌గా ప్రభుత్వం నిర్ణయించింది.
పరీక్ష విధానంలో మార్పులు
ఇక పరీక్ష విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న యూనిట్ టెస్టులను రద్దు చేయాలని భావిస్తోంది. ఇవి ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ప్రీ ఎగ్జామినేషన్ పేరుతో రెండు సార్లు నిర్వహించి ఆ తర్వాత నేరుగా ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కొత్త విద్యా సంవత్సరం అమలు కానుండటంతో సంక్రాంతి సెలవులు, వేసవి సెలవుల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. దసరా సెలవులను కూడా తగ్గించేలా ప్రభుత్వం గైడ్‌లైన్స్ రూపొందిస్తోంది. దసరా సెలవులను మూడు రోజులు, సంక్రాంతి సెలవులను 5 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని గైడ్‌లైన్స్ తయారు చేస్తోంది. అయితే వేసవి సెలవులు మాత్రం మే నెల నుంచి ఉంటాయని సమాచారం.లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మే 25 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం.
మొత్తానికి కొత్త విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను పూర్తి చేసిన విద్యాశాఖ ముఖ్యమంత్రి ఆమోదం కోసం వేచిచూస్తోంది. ఒక్కసారి సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఇది అమలవుతుందని సమాచారం.
0 Post a Comment:
Post a Comment