ప్రజాస్వామ్యం నుదుట చెరగని తిలకం
• ప్రస్తుత ఎన్నికలకు 26.55 లక్షల ఇండెలిబుల్ ఇంక్ వయల్స్ సరఫరా
• 1962 నుంచి ప్రత్యేకంగా ఎన్నికల సంఘానికే అందిస్తున్న 'మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్'
• 25కు పైగా దేశాలకూ ఎగుమతి
ప్రజాస్వామ్యానికి పండగ వంటి ఎన్నికల నిర్వహణలో కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ దశాబ్దాలుగా చెక్కు చెద రని ఒక అంశం మాత్రం ఈ ప్రక్రియలో కీలక భూమిక వహిస్తూనే ఉంది. అదే... ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలుపై వేసే సిరా ముద్ర! కొన్ని రోజుల పాటు చెరిగిపోకుండా ఉండే ఈ సిరా (ఇండెలిబుల్ ఇంక్)కు పెద్ద చరిత్రే ఉంది. 1962 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన 'మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమి టెడ్' దీనిని ఉత్పత్తి చేస్తోంది. ఎన్నికల సంఘానికి మాత్రమే సరఫరా చేస్తోంది. చెరగని సిరాను దిల్లీలోని 'కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ' ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసమే అభివృద్ధి పరిచి ఇచ్చింది.
ప్రస్తుత లోక్సభ, దాంతో పాటే నిర్వహించే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే 12 లక్షల పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిరా సరఫరా ఇప్పటికే పూర్తయ్యిందని తయారీ సంస్థ వెల్ల డించింది. రూ.55 కోట్ల విలువైన 26.55 లక్షల సిరా బుడ్ల(వయల్స్)ను అందించినట్లు తెలిపింది. అత్యధి కంగా ఉత్తర్ ప్రదేశ్కు 3.64 లక్షల వయల్స్, అత్యల్పంగా లక్షద్వీప్కు 125 వయల్స్ పంపించారు. ఒక్కో బుడ్డీలో 10 మిల్లీలీటర్ సిరా ఉంటుందని, 700 మంది ఓటర్ల వేలికి రాయడానికి వస్తుందని కంపెనీ మేనే జింగ్ డైరెక్టర్ కె. మహమ్మద్ తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికలకు రూ.36 కోట్ల విలువైన 25.98 లక్షల వయల్స్ సరఫరా చేశామన్నారు.
అక్కడ సిరాలో వేలిని ముంచుతారు:
చెరిగిపోని సిరాను 25కు పైగా దేశాలకు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎగుమతి చేస్తోంది. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేసియా, నేపాల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు, తుర్కియే తదితర దేశాలు మన సిరాను ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి వినియోగిస్తున్నాయి. అయితే, సిరా వినియోగించే విధానం వేర్వేరుగా ఉంటుంది. కంబోడియా, మాల్దీవులలో ఓటరు తన వేలిని సిరాలో ముంచాలి. బుర్కినాఫాసోలో కుంచెతో, తుర్కియేలో నాజిల్ తో ఇంక్ ముద్ర వేస్తారు.
0 Post a Comment:
Post a Comment