Tuesday, 20 February 2024

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం : అమ్మ భాషను మరవొద్దు : మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం : అమ్మ భాషను మరవొద్దు : మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు



"అష్టావధానాల సమ్మేళనమిది

అమృతం కన్నా తియ్యనిది

అక్షరాలకే మణిహారమిది

అరుదైన భాష యిది

అమ్మ భాష యిది

అందమైన తెలుగు భాష నాది"

★★★★★★★★★★★★★★★

అమ్మ భాష కమ్మనైనది !!!

సహజమైనది ..సరళమైనది !!!

మదిలో పారే భావ పరంపరల నదిని

ఆహ్లాదంతో.. ఆనందంతో.. ప్రవహింపజేస్తుంది !!!

★★★★★★★★★★★★★★★

        మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మన మాతృభాషను రక్షించుకోవాలి.  

మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21 నే ఎందుకు జరుపుకోవాలి...?

     మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారటా అందుకే ఫిబ్రవరి 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో (నవంబర్ 17, 1999)న ఫిబ్రవరి 21వ తేదీని 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 

  2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది. 

     అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది. ‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి’ అనేది ఈ ఏడాది థీమ్. పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏడు సెమినార్లు, ఒక వర్క్‌షాప్ జరగనున్నాయి. ‘భాషల లెక్కింపు’ పై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 

తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం:

   ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. 

అయితే ఈ ఇంగ్లిష్ భాష నేర్చుకోవటం అన్నది అవసరం మాత్రమే, విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగపడాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. *కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top