Wednesday 13 December 2023

మీకు లేని రూలు మాకెందుకు? ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదివించరు...?

మీకు లేని రూలు మాకెందుకు? ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదివించరు...?


ప్రజాతంత్ర దినపత్రికలో మన ఉపాధ్యాయ మిత్రులు "నరసింహుడు" గారి వ్యాసం.

-డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు.



తమకు రావలసిన హక్కుల కోసం నిలదీసినప్పుడల్లా, ఉద్యమించినప్పుడల్లా వారి ఉద్యమాలను నీరుకార్చడం కోసం, ప్రజల్లో ఉపాధ్యాయులపై తప్పుడు అభిప్రాయాల్ని కలిగించడం కోసం కొంతమంది తరచుగా ''ఉపాధ్యాయుల పిల్లలు వారు పనిచేసే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారా?'' అనో లేక ''చదువుకునేలా చర్యలు తీసుకుంటామనో'' అంటూ  డీమోరలైజ్‌ చేయడంకోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో  ప్రాథమిక విద్యాశాఖా మంత్రి ప్రైవేటు విద్యాసంస్థల అధినేత నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడ అటువంటి వివాదాస్పద ప్రకటన చేస్తూ ఉపాధ్యాయుల నైతిక నిష్టను ప్రశ్నించారు. చాలామంది వ్యాసకర్తలు కూడా ఈ ప్రశ్నవేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులను జీతభత్యాలుగా పొందుతూ కూడా వారి పిల్లలను వాటిలో చదివించకపోవడం, చేర్పించకపోవడం ప్రధానమైన చర్చనీయాంశమే. ఉపాధ్యాయుడు, తన పిల్లలను, తను బోధించే పాఠశాలలో చేర్పించడం లేదంటే ఆ పాఠశాలలో ఏవో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నాయని, ఆ లోపాల్ని సరిచేయడంలో ప్రభుత్వం, అధికార వ్యవస్థ వైఫల్యం చెందిందని భావించాల్సి కూడా ఉంటుంది. ఆ లోపాలను చర్చించడమే ఈ వ్యాసం యొక్క ప్రధానోద్దేశ్యం.        

1990లకు ముందు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఉండటమేకాదు, ఆ గ్రామంలోని అందరి పిల్లలతోపాటు ఉపాధ్యాయుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. 90ల అనంతరం విస్తరించిన గ్లోబలైజేషన్‌ వల్ల  తల్లిదండ్రుల మానసిక స్థితిలో చాలా మార్పు వచ్చి ఇంగ్లీష్‌ భాషలో పాఠశాల, ఇంటర్‌ విద్యతో పాటుగా, ఐ.ఐ.టి, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లకు మోజు పెరిగింది. ఈ మార్పును గమనించి ప్రైవేటులో 40 సంవత్సరాల కిందనే ఇంగ్లీష్‌ మీడియం మరియు నర్సరీ, ఎల్‌.కె.జీ, యు.కె.జి  తరగతులు ప్రారంభించి ఇ-టెక్నో, ఒలంపియాడ్‌ల స్థాయికి వెళితే అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం తను నడిపే పాఠశాలల్లో కనీసం అంగన్‌వాడీల విలీనం చేయలేదు సరికదా కె.జి టు పి.జి నినాదం ఇచ్చి కూడా ఒక్క పాఠశాలలో కూడా ఈ రోజు వరకు ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టలేదు! గురుకులాలకు సింగిల్‌విండో పద్ధతిలో ఇంగ్లీష్‌ మీడియంకు అనుమతిని ఇస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఆ పద్దతిలో అనుమతిని ఇవ్వడంలేదు!  అడ్మిషన్వ వయస్సు ప్రైవేటులో 2 ప్లస్‌ సంవత్సరాలు ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో 5 ప్లస్‌ సంవత్సరాలు ఉందంటే, ప్రభుత్వ పాఠశాలలపై ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ది కనబరుస్తుందో అర్థమవుతున్నది. ప్రైవేటులో తరగతి గదికో ఉపాధ్యాయుడుంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులున్నారు. ఇంజనీరింగ్‌ విద్యలో అతిముఖ్యమైన ఫిజికల్‌ సైన్స్‌ మరియు ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిన్టెంట్‌ పోస్టులను సృష్టించి పాఠశాలల్లో నియమించడానికి స్వాతంత్య్రానంతరం 56 సంవత్సరాలు (2002లో మొదటిసారి నియమించారు) పట్టిదంటే, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా పాఠశాల విద్య పట్ల వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ 56 సంవత్సరాల కాలం ఈ సబ్జెక్టులను ఆ పాఠశాలలో పనిచేసే ఇతర స్కూల్‌ అసిస్టెంట్‌లు అదనంగా, అనుభవం లేకపోపోయినా, శిక్షణ లేకపోయిన బోధించారు. గ్లోబలైజేషన్‌లో కంప్యూటర్‌ విద్యకు ఎంతో ప్రాధాన్యత పెరిగినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికి కంప్యూటర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు సృష్టించబడనేలేదు! లక్షల రూపాయలు వెచ్చించి కొన్ని పాఠశాలల్లో నెలకొల్పిన కంప్యూటర్‌ ల్యాబ్‌లు అన్ని బోధకులులేక మూతపడ్డాయి. ఆంగ్ల మాధ్యమంతోపాటుగా ఇంజనీరింగ్‌, ఐ.ఐ.టి, మెడిసిన్‌లకు ఈ రెండు సబ్జెక్టులు చాలా ప్రధానమైనవి కాగా ఈ బోధనాంశాల్ని బోధించే ఉపాధ్యాయుడు తన పాఠశాలలో లేడు అనుకున్నప్పుడు, ఆ లోపం అర్థమై అదే పాఠశాలలో పనిచేస్తూన్న ఉపాధ్యాయుడు, ఒక తండ్రిగా ఏ విధంగా తన పిల్లల్ని ఆ పాఠశాలలో చదివించగలడు? వీటికి తోడు కనీస సౌకర్యాలైన నీరు, టాయిలెట్స్‌, కరెంట్‌ లేని పాఠశాలలు 75 శాతం ఉన్నాయి. 

ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉదాహరణకు జూన్‌ 30న ఒక గణితం/ఫిజికల్‌ సైన్స్‌ బోధించే టీచర్‌ రిటైర్‌ అయితే, జూలై 1న అతని స్థానంలో మరొక ఉపాధ్యాయుడి నియామకం జరిగి ఆ పోస్టు భర్తీ కావాలి. ఆ విధానం అమలులో ఉన్నదా? నియామకాలను ప్రభుత్వం ఎప్పుడు చేపడుతుందో, నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తుందో, పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తుందో, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తుందో, ఎప్పుడు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇస్తుందో ఎవ్వరికి తెలియదు. ఒక భర్తీ నోటిఫికేషన్‌కు, పరీక్షకు, రిక్రూట్‌మెంట్‌కు మధ్య నాలుగు సంవత్సరాలకు పైబడి పట్టిన సందర్భం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా టి.ఆర్‌.టి నోటిఫికేషన్‌ ఇచ్చి 2018లో ఆ పోస్టుల్ని నింపడానికి హామి ఇచ్చింది. మేము ఆత్మహత్యలు చేసుకుంటామన్న వారికి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వడంలేదు. మరి పాఠశాలలోని ఆ ఖాళీ పోస్టు మాటేమిటి? కనీసం విద్యావాలేంటీర్లనైన ఏ విద్యాసంవత్సరంలోనైనా సకాలంలో భర్తీ చేసారా అంటే అదీలేదు! వారికి నెల నెల జీతాలు కూడా చెల్లించరు, విద్యాసంవత్సరాంతం వరకు పనిచేసే గ్యారెంటీ కూడా ఇవ్వరు!  ప్రైవేట్  పాఠశాలలు అన్ని 'కాన్‌సెన్‌ట్రేటెడ్‌ క్యాంపుల్లాగా' నడుస్తుంటే, ప్రభుత్వం ఆటల, పాటల ద్వారా బోధన చేయాలని విద్యా సంవత్సరపు మధ్యలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ నెలల తరబడి పాఠశాలలో విద్యా బోధనను కుంటుపరుస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు కంప్యూటర్లతో ఆటలాడుతుంటే, ప్రభుత్వం ఉపాధ్యాయులకు కాగితాలతో బొమ్మలు చేయించడంలో శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది! డిపిఇపి, సర్వశిక్ష అభియాన్‌లాంటి లత్తకోరు పథకాల ప్రయోగాలు ప్రారంభమైన నాటినుండి అడిగిన నివేదికనే మళ్ళీ అడగడం ఆ నివేదికల్లోని కాలమ్స్‌నే తిప్పి తిప్పి అడుగడం వల్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు పూర్తిగా ఈ నివేదికలను నింపే గణాంకకుడిగా, ఒక క్లర్‌్్గా మారిపోయిన దుస్థితి నెలకొనడమే కాదు తయారీ కోసం కొన్ని సందర్భాల్లో తరగతి గదిని వదిలి నెలల తరబడి సమయం వృధా చేయవలసి వస్తున్నది.

పాఠశాల విద్యా వ్యవస్థలో ఉన్న ఈ సమస్యలను ప్రభుత్వ యంత్రాంగంలోని  గ్రామ సర్పంచ్‌, వార్డ్‌ మెంబర్‌ దగ్గరి నుండి మొదలుకొని మండలాధ్యక్షులు, ఎం.పి.టి.సిలు, జెడ్‌.పి.టి.సిలు శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఐ.ఏ.ఎస్‌., ఐ.పి.ఎస్‌ ఇతర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధులు అర్థం చేసుకోలేక పోవడానికి, సకాలంలో స్పందించకపోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించకపోవడానికి ముఖ్య కారణం 90వ దశకం అనంతరం వచ్చిన ఇంగ్లీష్‌, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లపై మోజుతో ప్రభుత్వ పాఠశాలల్లో వారి వారి పిల్లలు చదివించకపోవడమేకాక వాటిని మొత్తం వ్యాపారమయం చేసారు. మారుతున్న తల్లిదండ్రుల మానసిక స్థితికి అనుకూలంగా పాఠశాల విద్యలో మార్పులు చేయకపోవడంవల్ల, రాకపోవడంవల్ల ఇంత సంక్షోభ, సంకట స్థితిని ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్నాయి. ఉపాధ్యాయుడొక్కడే తన పిల్లల్ని తను పనిచేస్తున్న పాఠశాలలో చదివించడం ద్వారా పాఠాలు సక్రమంగా బోధిస్తే బోధించవచ్చు కాని ఇంగ్లీష్‌ మీడియం పెట్టలేడు, కె.జిని ప్రారంభించలేడు, తరగతి గదికో ఉపాధ్యాయున్ని ఇవ్వలేడు, కనీస సౌకర్యాల్ని తీర్చలేడు, కొత్త పోస్టు సృష్టించలేడు, కనీసం ఒక విద్యావాలేంటీర్‌నైనా నియమించలేడు! ఏ ప్రజా ప్రతినిధికి, ప్రభుత్వ ఉద్యోగికి లేని నిభందన ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఎందుకుండాలి? ఉపాధ్యాయుల పిల్లలుగా పుట్టడమే వారు చేసిన నేరమా? వారికి ఐఐటి, మెడిసిన్‌, విదేశాల కలలు వద్దా! విద్య వ్యాపారీకరణం చెందిన తరువాత ఆ వ్యాపారం మొత్తం చేస్తున్నది కేవలం రాజకీయ నాయకులు, ఉన్నతోద్యోగులే! ఇవ్వాళ మొత్తం శాసనసభ్యుల్లో 60% మందికి ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు రాజకీయాల్లోకి వచ్చి విద్యావేత్తలుగా పేర్కొనబడి ఏకంగా  మంత్రులయ్యారంటే ఆ వ్యవస్థలో ఏం జరుగుతుందో, ప్రభుత్వ విద్యావ్యవస్థలో రావలసిన మార్పులను ఏలా అడ్డుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు! విద్యావ్యాపారులు విద్యావేత్తలు కావడం ఏమిటి? మొన్నటివరకు మన పక్క రాష్ట్రంలో సూడో విద్యావేత్త నారాయణ హవా చూడండి ఎట్లా ఉండేదో! తెలంగాణ ఉద్యమంతో కించెత్తు సంబంధంలేని ఓ విద్యావ్యాపారవేత్తను  మంత్రి పదవి వరించడం వారి హవాకు ఒక ఉదాహరణ! వారు ఓ సంఘంగా మారి ఏకంగా ప్రభుత్వాల్ని సవాల్‌ చేసే స్థాయికి ఎదిగారంటే అది ఎంత పెద్ద వ్యాపారమో అర్థంచేసుకోవచ్చు. ఇట్లా ప్రైవేటు విద్యా వ్యాపారంలో పీకల దాక మునిగిన ఈ రాజకీయులు రైతుల ఆత్మహత్యలకు, పరిశ్రమల, ఆర్‌.టి.సిలో అనేక డిపోల మూసివేతకు ప్రైవేటీకరణకు కారణమవ్వడమేకాక ఆ నాయకగణమే తమ స్వంతంగా బస్సులను కోనుగోలు చేసి హైర్‌ బస్‌ల పేరిట ప్రవేశపెట్టినట్లు, బ్యాంకుల కుంభకోణాలకు, ఫైనాన్స్‌ కుంభకోణాలకు కారణమైనట్లే ఇవ్వాళ పాఠశాలలపై ప్రజలు విశ్వాసం కోల్పోవడానికి కారణమై, ప్రైవేటీకరణను వేగవంతం చేయడంలో భాగంగా ఆ నెపాన్ని అవగాహనలేమితో ఉపాధ్యాయులపైకి నెట్టివేస్తున్నారు.

ఇప్పటికైనా పాఠశాల విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి మారుతున్న పరిస్థితులకు మరియు తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం మార్పులు తీసుకురావాలి. వార్డు మెంబర్‌ నుండి ప్రధానమంత్రి వరకు పోటీ చేయడానికి కుటుంబ నియంత్రణ ఏ విధంగా నిబంధనగా విధించారో, అదే విధంగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే నిబంధనను విధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికే ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తాం అన్న రాతపూర్వక నిబంధన అంగీకరిస్తేనే ఉద్యోగమివ్వాలి. ప్రైవేట్‌ పాఠశాలల్లో 'క్యాంపీకరణ' ఎత్తివేసి ప్రభుత్వపరం చేసుకోవాలి. విచ్చలవిడిగా ప్రైవేట్‌ పాఠశాలలకు ఇస్తున్న అనుమతిని రద్దు చేసి ప్రజల అవసరాలకు సరిపడా పాఠశాలల్ని ప్రభుత్వమే నెలకొల్పాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదికో ఉపాధ్యాయున్ని విద్యా సంవత్సరమంతా ఉండే విధంగా చర్యలు గైకొనాలి. ఒక పశువుల కాపరిగా, రేషన్‌ డీలర్‌గా, వంటవాడిగా, గ్రామ సుంకరిగా, లెక్కలను సేకరించే గణాంకకుడిగా మారిన ఉపాధ్యాయున్ని బోధనేతర విధుల నుండి తప్పించి, బోధించే వాతావరణం కల్పించాలి. శిక్షణలు, నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలు అన్నీ వేసవిలోనే నిర్వహించాలి.

విద్య యొక్క లక్ష్యం పౌరులను తయారు చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం కాదు. ఈ దేశానికి కావలసిన పౌరులను తయారుచేసే బాధ్యత రాజ్యానిది. ఆ విధంగా తయారుచేసే విద్యారంగం వ్యాపారీకరణ చెందితే అందులో నుండి ఉత్పత్తి అయిన విద్యార్థి వ్యాపార లక్షణాలను సంక్రమించుకొని తను వెచ్చించిన సొమ్మును వడ్డీతో సహా రాబట్టుకునే వాడుగా తయారవుతాడుగానీ పౌరుడు తయారుకాజాలడు. అందుకే విద్యను ఏ సమాజం వ్యాపార కోణంలో చూడకూడదు. మంచి సమాజం నిర్మాణం అనేది తరగతి గది నుండి ప్రారంభమవుతుంది. మనిషి, శ్రమ, సంపద విలువలను అర్థం చేయించే విధంగా తరగతి గదులుండాలి. అట్లాంటి పాఠశాల తరగతి గదుల్లో చదువుకునే పిల్లల మధ్య ధనిక, బీద వర్గాల మధ్య వర్గ, కుల, మతతత్వ దృక్పథాలు సమిసి ఒకరంటే ఒకరికి గౌరవభావం ఏర్పడుతుంది. అన్నింటికి అమెరికాను ఆదర్శంగా చూపే ప్రభుత్వాలకు అక్కడి కామన్‌ స్కూల్‌ విధానం ఎందుకు ఆదర్శం కాదు? ఈ విధానాన్ని మన దేశంలో అమలు పరుచాలని రిపోర్టు ఇచ్చిన కొఠారి కమీషన్‌ రిపోర్టును బుట్ట దాఖలు చేసింది ఈ రాజకీయాలు కాదా? ''దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దు కుంటుంది'' అని కొఠారి కమీషన్‌ చెప్పిన విషయాన్ని కొద్దిగా సవరిస్తున్నందుకు క్షమించండి. దేశ భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. తరగతిగదిలోని, పాఠశాలల్లోని ఈ సమస్యలను పరిష్కరించి తమ పిల్లల్ని కూడ ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు, సమాజంలోని ప్రతి ఒక్కరు విధిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అప్పుడు ఉపాధ్యాయులకు మాత్రం చదివించాలని ఎందుకు అనిపించదు? ఈ రాజకీయ వ్యాపారులు అందుకు ముందుకు వస్తారా? ప్రభుత్వాన్ని రానిస్తారా? ఈ చర్చ ముందుకు పోయి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ బాగుపడే రోజు వస్తే ఎంత బావుండు?!.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top