Friday 24 November 2023

NPS విత్‌డ్రా కొత్త రూల్‌. SLWతో క్రమం తప్పని ఆదాయం

NPS విత్‌డ్రా కొత్త రూల్‌. SLWతో క్రమం తప్పని ఆదాయం



నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS)లో ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA)’ ఇటీవల కీలక మార్పులు చేసింది. అందులో ‘సిస్టమేటిక్‌ లంప్‌ సమ్‌ విత్‌డ్రా (SLW) వసతి’ ఒకటి.

 ఏంటీ ఎస్‌ఎల్‌డబ్ల్యూ:

దీని ప్రకారం.. ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులు ఇకపై తమ పింఛను నిధి మొత్తం నుంచి 60 శాతం ఎస్‌ఎల్‌డబ్ల్యూ (SLW) ద్వారా వాయిదా పద్ధతుల్లో పొందొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. ఇలా అవసరానికి అనుగుణంగా నిర్దేశిత మొత్తాన్ని పొందొచ్చు. 75 ఏళ్ల వయసు వచ్చే ఇలా క్రమం తప్పని ఆదాయం పొందే వీలుంది. రిటైర్మెంట్‌ సమయంలో ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

 పాత నియమం ఇదీ:

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులు తమ నిధి నుంచి 60 శాతం రిటైర్మెంట్‌ సమయంలో ఉపసంహరించుకోవాలి. కావాలంటే దీన్ని 75 ఏళ్ల వయసు వరకు దశలవారీగా వాయిదా వేసుకోవచ్చు. తద్వారా కొంత మంది ఎన్‌పీఎస్‌లో వచ్చే అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందుతుంటారు. లేదా ఏడాదికోసారి అవసరమైన మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, డబ్బు కావాలనుకున్న ప్రతిసారీ విధిగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తంటా లేకుండా తాజాగా తీసుకొచ్చిన ఎస్‌ఎల్‌డబ్ల్యూను ఎంచుకుంటే క్రమం తప్పకుండా విత్‌డ్రాకు అవకాశం లభిస్తుంది.

 ప్రయోజనాలు:

• రిటైర్మెంట్‌ అనంతర అవసరాల కోసం క్రమం తప్పకుండా డబ్బును పొందొచ్చు.

• యాన్యుటీ ద్వారా వచ్చే పింఛన్‌తో పాటు ఎస్‌ఎల్‌డబ్ల్యూ నుంచి వచ్చే ఆదాయంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా నెలవారీ నిధులను పొందే వీలుంటుంది.

• మొత్తం ఒకేసారి తీసుకోకపోవడం వల్ల ఎన్‌పీఎస్‌లో ఉన్న మిగిలిన మొత్తానికి అధిక వడ్డీరేటు ప్రయోజనం పొందొచ్చు.

• ఎస్‌ఎల్‌డబ్ల్యూ విత్‌డ్రాలకు సైతం పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి.

 40% యాన్యుటీలో మార్పులేదు:

ఎన్‌పీఎస్‌ (NPS)లో జమ చేసిన మొత్తం నిధిలో నుంచి రిటైర్మెంట్‌ సమయంలో 40 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా యాన్యుటీలో ఇన్వెస్ట్‌ చేయాలి. దీనిలో మాత్రం ఎలాంటి మార్పులేదని పీఎఫ్‌ఆర్‌డీఏ స్పష్టం చేసింది. కేవలం ఏక మొత్తంలో పొందడానికి వీలున్న 60 శాతం నిధికి మాత్రమే ఎస్‌ఎల్‌డబ్ల్యూ వెసులుబాటు వర్తిస్తుంది.

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఎన్‌పీఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వాల్లోని 62 లక్షల మంది ఉద్యోగులు, 30 లక్షల మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు, 24 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 18 లక్షల మంది కార్పొరేట్‌ సంస్థల సిబ్బంది ఉన్నట్లు ఇటీవల పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ దీపక్‌ మొహంతీ తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.9.84 లక్షల కోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ మొత్తం రూ.11 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top