Sunday 20 August 2023

ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా...? సుప్రీంకోర్టు ఏం చెప్పింది ?

ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా...? సుప్రీంకోర్టు ఏం చెప్పింది ?బిఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) చదివిన అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టులకు అర్హులు కారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

రాజస్థాన్‌కు చెందిన దేవేశ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆగస్టు 14వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

దీని ప్రకారం, ప్రాథమిక తరగతులకు, అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు బోధించేందుకు బీఈడీ చేసిన అభ్యర్థులకు అవకాశం లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

ఈ పోస్టులను డీఈడీ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అభ్యర్థులతోనే నింపాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా డిగ్రీ చదివి బీఈడీ చేసిన వారు ఇప్పటికే ఏళ్ల తరబడి స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

ఒకవేళ బీఈడీ అభ్యర్థులకు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారమే అవకాశాలు ఇవ్వాలని భావిస్తే.. ప్రాథమిక స్థాయిలో పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని బీఈడీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కోరుతున్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం మంచిది'' అని హైదరాబాద్‌కు చెందిన విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ అన్నారు.

అసలు సమస్యేంటి...?

దేశంలో ఉపాధ్యాయ విద్య, శిక్షణను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పర్యవేక్షిస్తుంది.

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీ‍ఇఎల్ఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) వంటి కోర్సులను డిజైన్ చేయడం, బోధనలో మార్పులు తీసుకురావడం, పరిశోధన వంటివి ఎన్‌సీఈటీ చేస్తుంది.

జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా కోర్సులు డిజైన్ చేస్తుంది.

2018 జూన్ 28న ఎన్‌సీఈటీ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీని ప్రకారం, ప్రాథమిక తరగతులకు బోధించేందుకు డీఈడీ(డి.ఎల్.‍‍ఇ.డి) అభ్యర్థులతోపాటు యాభై శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండి, బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులవుతారు.

ఇలా ఎంపికైన అభ్యర్థులు తప్పకుండా ఆరు నెలలు బ్రిడ్జి కోర్సు చేయాలనే నిబం‍ధన ఉంది.

బీఈడీ అభ్యర్థులకు ఇచ్చిన అవకాశాల కారణంగా తమ అవకాశాలు తగ్గిపోతున్నాయని డీఈడీ అభ్యర్థులు ఆందోళన చెందుతూ వచ్చారు.

ఎన్‌సీటీఈ ఆదేశాలు ఇవీ...

బీఈడీ అ‍భ్యర్థులకు అవకా‍శం కల్పిస్తూ ఎన్‌టీఈ ఇచ్చిన ఆదేశాల వెనుక మరో కారణం కూడా లేకపోలేదు.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రాథమిక టీచ‍ర్ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు దొరకని పరిస్థితి.

దేశవ్యాప్తంగా డీఎడ్ కోర్సుకు డిమాండ్ తగ్గిపోతుండడంతో కాలేజీలు మూతపడుతూ వచ్చాయి.

ఉదాహరణకు 15 ఏళ్ల కిందట తెలంగాణలో 2౦౦ డీఎడ్ కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం అవి 50కు తగ్గిపోయాయి.

దీనివల్ల డీఈడీ చదివే అభ్యర్థులు క్రమంగా తగ్గుతూ వచ్చారు.

అదే సమయంలో బీఈడీ చదివిన అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. వీరికి ఆరు, ఆపై తరగతులకు బోధించేందుకే వీలుండేది.

ఈ క్రమంలో బీఈడీ అ‍భ్యర్థులను ప్రాథమిక తరగతులకు టీచర్లుగా ఎంపిక చేసేందుకు వీలు కల్పిస్తూ ఎన్‌సీటీఈ ఆదే‍శాలు జారీ చేసింది.

దీనికి తగ్గట్టుగా 2010 ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తూ 2018లో మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

సుప్రీం కోర్టు తీర్పులో ఏముంది...?

ఎన్‌సీటీఈ ఇచ్చిన ఈ ఆదే‍శాలపై రాజస్థాన్‌కు చెందిన దేవేశ్ శర్మ అక్కడి హైకోర్టుకు వెళ్లారు. కేసు విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు 2021లో ఎన్‌సీటీఈ ఆదేశాలను కొట్టివేసింది.

దీనిపై ఎన్‌సీటీఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై (దేవేశ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా) విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈ ఆదే‍శాలు చెల్లవని తీర్పు చెప్పింది.

రాజస్థాన్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 14న తీర్పు చెప్పింది.

''ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బీఈడీని అర్హతగా నిర్ణయిస్తూ 2018లో ఎన్‌సీటీఈ తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది కాదు, ఏకపక్షమైనది.

విద్యా హక్కు చట్టం 2010 ప్రకారం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతోపాటు నాణ్యమైన విద్య అందించాలి.

అందుకు అర్హులైన ఉపాధ్యాయులు ఉండాలి.'' అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

డీఎడ్ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదువు చెప్పేలా శిక్షణ ఉంటుంది. బీఈడీ అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ మాధ్యమిక, ఉన్నత విద్యార్థుల బోధనకు తగ్గట్లుగా ఉంటుంది.

అలాంటప్పుడు, బీఈడీ అభ్యర్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బో‍ధన ఎలా ఆశించగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

బీఈడీ అర్హత ఉన్న వారిని ప్రాథమిక తరగతులకు టీచర్లుగా నియమించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

ఈ విషయంపై తెలంగాణ విద్యా శాఖ స్టేట్ రిసోర్స్ పర్సన్ పడాల సురేష్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

''సుప్రీంకోర్టు తీర్పు ఆమోదయోగ్యమైనది. డీఈడీలో అన్ని సబ్జెక్టులను ప్రాథమిక స్థాయిలో బోధించేలా శిక్షణ ఉంటుంది. బీఈడీలో శిక్షణ పూర్తిగా సబ్జెక్టు ఓరియెంటెడ్‌గా ఉంటుంది.

మన దగ్గర డీఈడీ, బీఈడీ అభ్యర్థులు 1:5 నిష్పత్తిలో ఉన్నారు. అందుకే బీఈడీ అభ్యర్థులకు వీలు కల్పించేలా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్) పేపర్-1 క్వాలిఫై అయితే ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అర్హత వస్తుంది. పేపర్-2 క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాసేందుకు వీలుంటుంది.

రెండు పేపర్లలో క్వాలిఫై అయితే రెండు పోస్టులకూ అర్హులవుతారు. అందుకే రెండింటిలోనూ అర్హత సాధించేందుకు డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ రాస్తుంటారు.

కానీ తర్వాత, ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు కచ్చితంగా బీఈడీ చదవాల్సి ఉంటుంది.'' అని సురేష్ కుమార్ చెప్పారు.

బీఈడీ, డీఈడీ శిక్షణలో వ్యత్యాసం:

ప్రభుత్వ పాఠశాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది బీఈడీ చదివిన వారే ఉంటున్నారు. వీరు ముందుగా ఎస్జీటీ(స్కూల్ గ్రేడ్ టీచర్)లుగా ఎంపికవుతున్నారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు సాధిస్తున్నారు.

డీఈడీ చదివేందుకు ఇంటర్(+2) అర్హత సరిపోతుంది. బీఈడీ చేసేందుకు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ ఉండాలి.

డీఈడీ కోర్సు గతంలో తొమ్మిది నెలలు ఉండేది. ప్రస్తుతం దాన్ని రెండేళ్లకు పెంచారు. బీఈడీ కోర్సు రెండేళ్లు ఉంటుంది.

డీఈడీ కోర్సును ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు బోధించేలా డిజైన్ చేసినది. చిన్నవయసు పిల్లలను ఆకట్టుకునేందుకు వీలుగా బోధన ఏ విధంగా చేయాలనే విషయాలను డీఈడీ అభ్యర్థులకు చెబుతారు.

బీఈడీ కోర్సును ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు బోధించేందుకు వీలుగా డిజైన్ చేశారు.

ఈ రెండు కోర్సుల మధ్య తేడాలపై హైదరాబాద్‌కు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆశాలత ఇలా స్పందించారు.

''డీఈడీ కోర్సులో జాయ్ ఫుల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. పిల్లలకు ఆటపాటలతో ఎలా చెప్పాలి. బేసిక్ వి‍షయాలను ఏ విధంగా బోధించాలి. తరగతి గది అలంకరణ నుంచి పిల్లల శుభ్రత వరకు.. అన్ని అంశాలపై అవగాహన ఉంటుంది.

రెండింటి పెడగాలజీ, బోధన మెథడాలజీలో తేడాలు ఉంటాయి.

బీఈడీలో పూర్తిగా సబ్జెక్టు బోధనకు ప్రాధాన్యం ఉంటుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌పై ఫోకస్ ఉంటుంది.'' అని చెప్పారు.

ప్రీప్రైమరీ స్థాయిలో మాంటిస్సోరీ, ప్రాథమిక స్థాయిలో డీఈడీ, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో బీఈడీ అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉంటే మంచిదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

''ఉద్యోగాల కొరత, ఉద్యోగాల కోసం పోటీ కారణంగా బీఈడీ చేసిన వారు ఎస్జీటీలుగా వస్తున్నారే కానీ కావాలని వస్తున్నట్లు కాదు.

ప్రభుత్వ ఉపాధ్యాయ నోటిఫికేషన్లలో డీఈడీ లేదా బీఈడీ అర్హత ఉండాలని ఉంటుంది.'' అని చెప్పారు ఆశాలత.

విద్యా హక్కు చట్టం ఏం చెబుతోంది...!

దేశంలో విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

ఇందులో సెక్షన్ 23 ప్రకారం, ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, నిబంధనలు, షరతులు కచ్చితంగా పాటించాలి.

ఎన్‌సీటీఈ ఆదేశాల ప్రకారం.. బీఈడీ అభ్యర్థులను ప్రాథమిక తరగతులకు చదువు చెప్పేందుకు ఎంపిక చేస్తే ఆరు నెలలపాటు బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. అది పూర్తయ్యాకే పోస్టింగులు ఇవ్వాలి.

ఈ వి‍ధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంపై తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్(ఎస్‌సీఈఆర్టీ) ఆచార్యుడు కాసర్ల రవికాంత్ బీబీసీతో మాట్లాడారు.

''సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఉపాధ్యాయుల ఎంపికపై ఉంటుంది. ఇకపై బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రాథమిక తరగతులకు తీసుకునేందుకు వీలుపడదు. డీఈడీ, బీఈడీ కోర్సుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. డీఈడీ చదివిన అభ్యర్థులు అన్ని సబ్జెక్టులు బోధించగలుగుతారు. బీఈడీలో సబ్జెక్టుకే పరిమితం అవుతారు'' అని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పుపై హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో ఉండే బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థి చొప్పర ప్రభాకర్ బీబీసీతో మాట్లాడారు.

''ఎన్‌సీటీఈ 2021 వార్షిక నివేదికను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 70వేల బీఈడీ సీట్లు ఉన్నాయి. ఏటా 3౦-35 వేల మంది బీఈడీ పూర్తి చేస్తున్నారు.

గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టులకు డీఈడీ పూర్తి చేసిన వారితోపాటు బీఈడీ పూర్తి చేసినా అర్హులని ఉండేది.

ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ కోసం తెలంగాణలో వేలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

పోస్టులకు అర్హత విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చి నోటిఫికేషన్ విడుదల చేయాలి.'' అని కోరారు.

ఏపీలో ౩వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఐదో తరగతి వరకు డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

''ఒకవేళ బీఈడీ అభ్యర్థులకు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారమే అవకాశాలు ఇవ్వాలని భావిస్తే.. ప్రాథమిక స్థాయిలో పోస్టుల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి.

అలాగే ఆరు, ఆపై తరగతుల పోస్టులను హేతుబద్ధీకరణ పేరిట తగ్గించిన పోస్టులను మళ్లీ పునరుద్ధరించాలి.'' అని కర్నూలుకు చెందిన బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థి రమాదేవి బీబీసీకి చెప్పారు.

ప్రైవేటు స్కూళ్లపై చర్చ:

సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ప్రైవేటు పాఠశాలలపై ఉంటుందా.. అనే చర్చ జరుగుతోంది.

తీర్పునకు లోబడి రాష్ర్ట ప్రభుత్వాలు జారీ చేసే ఆదేశాలకు అనుగు‍ణంగా ప్రభావం ఉంటుందని ప్రైవేటు యాజయాన్యాలు చెబుతున్నాయి.

దేశంలో దాదాపు చాలా వరకు ప్రైవేటు పాఠ‍‍శాలల్లో బీఈడీ, డీఈడీ లేకపోయినా.. ఇంటర్, డిగ్రీ అర్హతలతో ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

రాష్ర్ట ప్రభుత్వాల పర్యవేక్షణ లేకపోవడం వల్లే విద్యా హక్కు చట్టం నిబంధనలు పాటించడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఏ మేరకు అమలవుతుందనేది ప్రశ్నగా మారింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top