Thursday 27 July 2023

ITR e-Filing: ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌కు గడువు పొడిగిస్తారా...?

ITR e-Filing: ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌కు గడువు పొడిగిస్తారా...?




ITR Filing Due Date: ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువును పొడిగించాలని పలువురు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో వారికి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు (Tax payers) ఐటీఆర్‌ ఫైలింగ్‌కు (ITR Filing) డెడ్‌లైన్‌ సమీపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలుకు జులై 31 చివరి తేదీ. ఈ సారి గడువు పొడిగించేదీ లేదని ఇప్పటికే రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా స్పష్టంచేశారు. అయితే, డెడ్‌లైన్‌ పొడిగించే విషయమై ఈసారి కేంద్రం పునరాలోచన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆ మేర ఊరట కల్పించే అవకాశం ఉన్నట్లు పలువురు ఛార్టెట్‌ అకౌంటెంట్లు అభిప్రాయపడుతున్నారు.

ఐటీఆర్‌ దాఖలుకు జులై 31తో గడువు ముగుస్తుంది. కొవిడ్‌ సందర్భంలో నవంబర్‌ 30 వరకు గడువు ఇచ్చారు. కొత్త ఐటీఆర్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆ మరుసటి ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగించారు. గతేడాది మాత్రం గడువు పొడిగించలేదు. అయితే, ఈ సారి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట ఇచ్చే అవకాశం ఉందని పలువురు సీఏలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై తాజాగా గుజరాత్‌కు చెందిన ట్యాక్స్‌ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ సైతం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో గడిచిన 15 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయని, గడువు పెంచాలని కోరింది. మరికొందరు పన్ను చెల్లింపుదారులు తమకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ట్వీట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్నుల ఫైలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ష పరిస్థితులను కేంద్రం పరిగణనలోకి తీసుకుని గడువు పెంపు కోరుతున్నారు. మరోవైపు గతేడాది మొత్తం 7.4 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని కొన్ని రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు (జులై 26 వరకు) 4.75 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఐటీ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడైంది. ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటోందనని ఆసక్తి నెలకొంది. ఒకవేళ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5 వేల ఆలస్యపు ఫీజులను చెల్లించాలి. ఒకవేళ మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే.. వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top