పర్యవేక్షణ పెరిగే కొద్దీ విద్యా ప్రమాణాలు పతనం : ఆంధ్రజ్యోతి , Dated: 04-03-2023
రమేష్ పట్నాయక్ , కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ
బోధన ఒక శారీరక శ్రమ కాదు. అది ఒక సృజనాత్మకమైన పని. పని భారాన్ని అలవి కాకుండా పెంచితే విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటాయనే స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు. అడుగడుగునా ఉపాధ్యాయుణ్ని పర్యవేక్షించడం ద్వారా ప్రమాణాలు గల విద్య సాధించవచ్చని మన ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వం ఎంతగా పర్యవేక్షణ పెంచుతుందో ఫలితాలు అంత దిగనాసిగా ఉంటున్నాయి.
‘ప్రజలకు విద్యను అందిస్తే ప్రమాదమని పాలకులకు తెలుసు. అందుకే విద్యను నిరాకరిస్తారు. కానీ పైకి మాత్రం ప్రజలను విద్యావంతులను చేయటంలో నిరంతరం తలమునకలైనట్లు కనిపిస్తారు’ అంటాడు ప్రముఖ రష్యన్ రచయిత టాల్‌స్టాయ్. మన రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమూ అలాగే ఉంది. ప్రతి నెలా రివ్యూలు, ప్రతి రివ్యూ తరువాత కొత్త దాడులు. ఇలా ఎన్ని సర్కస్‌లు చేసినా ప్రైవేటు విద్యాసంస్థలపై మాత్రం ఈగ వాలదు. ప్రభుత్వం తీసుకువచ్చే అర్థరహితమైన విధానాలన్నీ ప్రభుత్వ పాఠశాలల మెడకే చుట్టుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, దళిత, బలహీన, మైనారిటీ బాలబాలికల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ప్రతి ఏటా విడుదలవుతున్న ఎ.యస్.ఇ.ఆర్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అయినాసరే ప్రభుత్వం తన నిర్వాకాలను పునరాలోచించదు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మాతృభాషా మాధ్యమాలపై దాడిచేసింది. ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా నడుస్తున్న తెలుగు, ఉర్దూ, ఇతర మాతృభాషా మాధ్యమాలను రద్దుచేసింది. దీనిపై పత్రికలలో చర్చ జరిగినా, నిరసన ప్రదర్శనలు జరిగినా, చివరికి ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా ప్రభుత్వం తన మొండి వైఖరినే కొనసాగిస్తున్నది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ‘కేంద్ర విద్యాహక్కు చట్టం 2009’ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలి. చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయడానికి బదులు, ప్రభుత్వ పాఠశాలలలో మాతృభాషా మాధ్యమాన్ని రద్దుచేయడం విపరీత ధోరణికి నిదర్శనం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా నడుస్తున్న మాతృభాషా మాధ్యమ సెక్షన్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం పది నుంచి పన్నెండు వేల ఉపాధ్యాయులను మిగుల్చుకుంది. అసలు ఉద్దేశ్యం అదే కావచ్చు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తరువాత ఎన్నో పోరాటాలు, చర్చలు, ప్రాతినిధ్యాలతో ప్రజలు సాధించుకున్న విద్యారంగ ప్రయోజనాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. 2017 జీవో నెంబరు 29 ద్వారా సాధించుకున్న: ఎ) ఉన్నత పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాలకు సమాంతరంగా ఉపాధ్యాయుల కేటాయింపు, బి) 1 నుంచి 8 వరకు తరగతులు గల ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎనిమిది తరగతులకు 8మంది ఉపాధ్యాయులు, సి) విద్యార్థి నమోదు 80 దాటిన 3,884 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తింపు, ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల కేటాయింపు వంటి ప్రయోజనాలను ఈ ప్రభుత్వం 2020లో ఇచ్చిన జీవో 53 ద్వారానూ, మరలా 2022 జూన్ నెలలో ఇచ్చిన జీవో 117 ద్వారాను రద్దు చేసింది. ఉన్నత పాఠశాలల్లో ముందుగా చెప్పుకున్నట్లు మాతృభాషా మాధ్యమాలను రద్దుచేసింది. అత్యధిక ప్రాథమికోన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుల సంఖ్యను 8 నుంచి 4కి తగ్గించింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానాన్ని మొత్తంగా రద్దు చేసింది.
విధ్వంసం ఏ స్థాయిలో ఉందంటే విద్యా హక్కు చట్టం అమలు కోసం కేంద్రం 2010లో ఇచ్చిన నమూనా నిబంధనావళి, అలాగే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఇచ్చిన నిబంధనావళి (జీవో 20) రెండింటి ప్రకారమూ 5వ తరగతి వరకు విద్య ఆవాస ప్రాంతానికి ఒక కిలో మీటరు పరిధిలో అందుబాటులో ఉండాలని నిర్దేశిస్తే ఈ ప్రభుత్వం 2021 డిసెంబరులో జీవో85 తీసుకువచ్చి ఆ నిబంధనను మూడు కిలోమీటర్లకు మార్చింది. దేశ వ్యాప్తంగా ఎంతో చర్చ తర్వాత నిర్దేశించబడిన నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘జాతీయ విద్యా విధానం 2020’లో ఉన్న సమస్యలు ఇక్కడ ప్రధానం కాదు. కాని 5+3+3+4 పాఠ్య ప్రణాళిక వ్యవస్థను ప్రతిపాదించిన ‘జాతీయ విద్యా విధావిధానం 2020’ సదరు పాఠ్య ప్రణాళికను అమలు చేయడానికి పాఠశాలలను భౌతికంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం లేదని పేరా 4.3లో స్పష్టంగా చెప్పినా గత సంవత్సరం జీవో 84ను తీసుకువచ్చి, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను పూర్తిగా గందరగోళం లోనికి నెట్టివేసింది. ఒక్క పాఠశాల కూడా మూసేది లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 4,500 ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేసింది, 2,500 ప్రాథమిక పాఠశాలలను మూసివేయడానికి కొత్తగా ప్రయత్నాలు ప్రారంభించింది.
విద్యా ప్రమాణాలు పెంచడానికే పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం అని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులన్నీ అందుకు విరుద్ధంగానే ఉన్నాయి. 3, 4, 5 తరగతుల బాలబాలికలకు తరగతుల వారీ పాఠ్య బోధన అవసరం అని ఉపాధ్యాయ విద్య జాతీయ సమితి (యన్.సి.టి.ఇ) నిర్దేశిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు తరలించి అక్కడ సబ్జెక్టుల వారీ బోధన అందిస్తామని చెప్తుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే సబ్జెక్టులవారీ బోధన అవసరమైన 6, 7, 8 తరగతులకు, అవి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉంటే, యస్.జి.టిలను మాత్రమే కేటాయించడం. అంటే చిన్నతరగతుల వారికి స్కూలు అసిస్టెంటులు, పెద్ద తరగతుల వారికి యస్.జి.టిలు! ఇదేదో తలతిక్క వ్యవహారం అనుకోవడానికి లేదు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు పంపినప్పుడు అత్యధిక సందర్భాలలో వాటికి అదనపు పోస్టులు ఇవ్వరు. కాగా ప్రాథమిక పాఠశాల్లో తరగతులు తగ్గినందుకు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిస్తారు. అలాగే, ప్రాథమికోన్నత పాఠశాలలలో ఇంత వరకు ఇద్దరు యస్.జి.టిలు, ఆరుగురు స్కూలు అసిస్టెంట్లు ఉండేవారు. ఈ కొత్త విధానంలో అత్యధిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను తొలగించి ఇద్దరు యస్.జి.టిలను ఇస్తున్నారు. ఈ చర్య వలన కనీసం పది వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులుతాయి. ప్రతి చర్య ఉపాధ్యాయ పోస్టులు మిగుల్చుకోవడానికే అనేది సుస్పష్టం!
ప్రమాణాలు గల విద్య సాధనకు భౌతిక వసతులతో పాటు, తగిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని రూపొందించడం అవసరమని ఎవరైనా అంగీకరిస్తారు. ఈ ప్రభుత్వం దశాబ్దాలుగా అమలు జరుగుతున్న విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తిని తారుమారు చేసింది. ప్రాథమిక విద్యలో ప్రమాణాలు గల విద్య కొరకు విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తిని 20:1కి అభివృద్ధి చేయాలనే సూచన పట్టించుకోలేదు. ఆ పైన ప్రాథమిక తరగతులలో సెక్షన్ గరిష్ఠ పరిమితిని 30 నుంచి 40 పెంచింది. అలాగే 6, 7, 8 తరగతులలో గరిష్ఠ పరిమితిని 35 నుంచి 52కి 9, 10 తరగతులలో గరిష్ఠ పరిమితిని 50 నుంచి 60కి పెంచింది. తరగతి గదిలో విద్యార్థుల గరిష్ఠ పరిమితిని పెంచడం ప్రమాణాలపై తీవ్ర ప్రభావం కలుగజేయగలదు. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఎక్కువగా ఉంటే ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగత శ్రద్ధ పెట్టడం మాట అటుంచి కనీసం పాఠం చెప్పడం కూడా వీలు కాదు. వెనుక ఉన్న విద్యార్థులకు పాఠం వినబడదు. వారు తమలో తాము మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు పోట్లాడుకోవడం సహజం. తరగతి నిర్వహణ గురించి ప్రభుత్వానికి కనీసమైన అవగాహన లేదు. తరగతి గదిలో విద్యార్థుల గరిష్ఠ పరిమితిని పెంచడం కూడా ఉపాధ్యాయుల పోస్టులు మిగుల్చుకోవడానికే అని వేరుగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలుగా ఉన్న శాస్త్రబద్ధమైన సాంప్రదాయాలను నిర్లక్ష్యంగా రద్దు చేస్తున్నారు. అలాగే, వారంలో ఉపాధ్యాయుడు బోధించవలసిన పీరియడ్ల గరిష్ఠ సంఖ్యను 30 నుంచి 38కి పెంచారు. హిందీ సబ్జెక్టులో ఈ పనిభారం మరింత చేశారు. బోధన ఒక శారీరక శ్రమ కాదు. అది ఒక సృజనాత్మకమైన పని. ప్రధానంగా బాలబాలికలకు ఎంతో శ్రద్ధతో ఓపికతో పాఠాలు చెప్పాలి. పని భారాన్ని అలవి కాకుండా పెంచితే విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటాయనే స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు.
అడుగడుగునా ఉపాధ్యాయుణ్ని పర్యవేక్షించడం ద్వారా ప్రమాణాలు గల విద్య సాధించవచ్చని మన ప్రభుత్వం భావిస్తుంది. మధ్యాహ్న భోజన ప్రమాణాలు పెంచడానికి బదులు, మధ్యాహ్న భోజనం తినే వారి సంఖ్య ఎందుకు తగ్గుతుందని ప్రభుత్వం ఉపాధ్యాయులను నిలదీస్తుంది. విద్యార్థులు ఇంటిలో హోంవర్క్ ఎందుకు చేయలేదని ఉపాధ్యాయులనే అడుగుతున్నారు. ఉపాధ్యాయులు అనేక రకాలైన యాప్స్, రిజిస్టర్లు నింపాలి. నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయులే ఇప్పటికీ అధికం. అయితే వారికి పాఠాలు చెప్పడానికి మానసికంగా స్వేచ్ఛ గాని, భౌతికంగా తీరిక గాని ఉండడం లేదు. అందుకే ప్రభుత్వం ఎంతగా పర్యవేక్షణ పెంచుతుందో ఫలితాలు అంత దిగనాసిగా ఉంటున్నాయి.
0 Post a Comment:
Post a Comment