Sunday 10 July 2022

బడుల బలోపేతానికి ఏం చేయాలి ?

 బడుల బలోపేతానికి ఏం చేయాలి ? ౼ యం.రాం ప్రదీప్యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

కరోనా కాలంలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కేరళ,ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సదుపాయాలని కల్పించారు.ఎక్కడైతే బడుల్లో మౌలిక సదుపాయాలు ఉండి, విద్యార్థులకు అనుగుణంగా బోధనా సిబ్బంది ఉన్నారో,అక్కడ నాణ్యమైన విద్య అందుతుంది.ఇప్పటికీ దేశంలో నవోదయ మరియు సైనిక పాఠశాలలకు ఆదరణ లభించడానికి మౌలిక సదుపాయాలతో పాటు,మంచి బోధనా సిబ్బంది ఉండటమే ప్రధాన కారణం.

మిగతా ఉద్యోగుల పోల్చితే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఎక్కువే. దీనికి తోడు వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఇటువంటి వారి వల్ల మిగతా వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. పాఠశాలలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయడం లేదు.అయితే పాలకులు వీరి నియంత్రణకు తీసుకొనే చర్యలు కూడా ఆశ్చర్యాన్ని  కలిగిస్తున్నాయి.

ఇటీవల నల్లగొండ జిల్లాలోని దేవర కద్ర మండలంలో గుంటిపల్లి గ్రామంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావెద్ అలీ  వచ్చిన ఆరోపణల నేపథ్యంలో  విజిలెన్స్ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు యావత్ తెలంగాణా ఉపాధ్యాయ లోకాన్ని విస్మయానికి గురిచేసింది.

ఆ ఉత్తర్వుల ప్రకారం విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులందరూ ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలనీ,అదేవిధంగా స్థిర చరాస్థుల క్రయవిక్రయాలకూ ముందస్తు అనుమతిని తప్పక తీసుకోవాలని  తెలియజేస్తున్నాయి.విద్యాశాఖ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించే కోణంలో ఏమైనా ఉత్తర్వులు వెలువడితే ఉపాధ్యాయలోకం హర్షించేది. కానీ ఈ  ఉత్తర్వుల వల్ల విద్యావ్యవస్థకు వచ్చే ప్రయోజనం ఏముంది ?అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. 

ఉపాధ్యాయులందరూ ప్రతీ సంవత్సరం తమ జీత భత్యాలకు సంబంధించి ఇన్కంటాక్స్ సబ్మిట్ చేస్తూనే ఉంటారు. ప్రతీ ప్రాపర్టీ కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వారి పేరుతోనే డాక్యుమెంటేషన్ ఉంటది. అవే వివరాలను అదనంగా ఇంకో కాగితంలో నిర్ణీత ఫార్మట్ లలో ఉన్నతాధికారులకు అందజేస్తారు.

ఆస్తుల వివరాలు చెప్పడం,క్రయవిక్రయాలకు అనుమతి తీసుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించినట్టేనా ? అనే ప్రశ్న తలెత్తుతుంది.కానీ అసలు సమస్య పాఠశాల సమయాన్ని వృథా చేస్తున్నరని కదా...! పాఠశాల పనివేళల్లో ఉపాధ్యాయుడు విద్యార్ధులకు అందుబాటులో ఉండడం కద. 

పాఠశాల పనివేళల్లో బోధన చేయకుండా,ఇతర వ్యక్తిగత పనులు,బిజినెస్ లు,రియల్ దందాలు చేసే వారిని దారిలోకి తీసుకురావాలనేది కదా అందరూ కోరుకునేది.సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా కొందరు తప్పులు చేస్తుంటారు.తప్పుచేసిన ఆ కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలి. అది వదిలేసి, చెప్పి కొనండి. ఉన్న ప్రాపర్టీ చూపించండి అంటే దానివల్ల  ఉపాధ్యాయ లోకం మొత్తాన్ని  ఏదో తప్పుడు వారిలా చిత్రీకరించమే తప్ప మరోటి కాదు అని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

 తెలుగు రాష్ట్రాలలో   ఉపాధ్యాయులను పర్యవేక్షించడానికి చాలా మండలాల్లో  రెగ్యూలర్ మండల విద్యాశాఖాధికారులు లేరు.ఒకరే రెండు లేదా మూడు మండలాల బాధ్యతలు చూస్తున్నారు.ఒక్కరు తప్పుచేస్తే  అతన్ని శిక్షించి మిగిలిన వారిని క్రమశిక్షణలో ఉంచితే  సరిపోతుంది.

రెవెన్యూశాఖ,పోలీసుశాఖ,ఇరిగేషన్శాఖ,ఆరోగ్యశాఖ,రిజిస్ట్రేషన్ శాఖ ఇంకా ఇతర ప్రభుత్వశాఖలకు ఇట్లాంటి ఉత్తర్వులు  ఇవ్వనందున ఉపాధ్యాయులకే ఇటువంటి ఉత్తర్వులు ఇస్తే ప్రజల్లోకి మరిన్ని తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్నారు ఉపాధ్యాయులు. అయితే తెలంగాణ ప్రభుత్వం క్షణాల వ్యవధిలో వీటిని వెనక్కి తీసుకుంది.

ప్రభుత్వ బడులు బాగు పడాలంటే ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రతి ఏటా వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలి.ప్రతి నెలా పదోన్నతులు కల్పించాలి.ఎవరైనా ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవులో ఉంటే, వారి స్థానంలో తాత్కాలికంగా వలంటీర్లని నియమించాలి.ఊరి జనాభా ప్రాతిపదికన అన్ని వసతులతో కూడిన ఒక పాఠశాల ఉండాలి.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మార్పులని దశల వారిగా అమలు చేయాలి.

నూతన విద్యా విధానం లో నిధులు మంజూరు విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వాలు విద్యా రంగానికి అధికంగా నిధులు మంజూరు చేయాలి.మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే,నాణ్యమైన ఆంగ్ల విద్యని అందించాలి.

మౌలిక సదుపాయాల కల్పన, ఎప్పటికప్పుడు బోధనా సిబ్బంది నియామకం, నిరంతర పర్యవేక్షణ తదితర మార్గాల ద్వారా బడులని బలోపేతం చేయవచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top