Monday 7 February 2022

ఆ రాత్రి ఏం జరిగింది...? ఆ చర్చల వెనుక "సానుకూలం చేసింది ఆ హస్తాలే"

ఆ రాత్రి ఏం జరిగింది...? ఆ చర్చల వెనుక "సానుకూలం చేసింది ఆ హస్తాలే"ఓ మంత్రి, కొందరు పెద్దల కీలక పాత్ర

◆ మొదట్లో నేతలను లెక్కచేయని ప్రభుత్వ పెద్దలు. ఉన్నతాధికారులదీ అదే తీరు

◆ "చలో విజయవాడ" తో సర్కారులో కలవరం. సమ్మె మొదలైతే ప్రమాదమేననే భావన. అందుకే ఉద్యోగ నేతలపై ఒత్తిళ్లు

◆ ఎవరిపై ఎవర్ని  ప్రయోగిస్తే పనవుతుందో లెక్కలు...

◆ సీఎంతో భేటీ ఏర్పాటు చేయిస్తామని పదే పదే హామీలిచ్చిన వైనం

చర్చల రోజు రాత్రి ఏం జరిగింది...?

ఉద్యోగులు, మంత్రివర్గ ఉపసంఘం మధ్య వేతన సవరణ విషయంలో సుదీర్ఘ చర్చలయితే జరిగాయి. అంతకు ముందూ జరిగాయి. కానీ శనివారం నాటి చర్చల వెనుక కొన్ని ప్రచ్ఛన్న హస్తాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జీఏడీ సర్వీసెస్‌ విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉద్యోగ సంఘాలంటే డోంట్‌ కేర్‌ అన్నట్లుగానే మాట్లాడుతూ వచ్చారు. సంఘాల నేతలు కూడా చర్చలకు వెళ్లేది లేదంటూనే భీష్మించుకున్నారు. దీంతో చర్చలకు ఇక అవకాశం లేదన్నంతగా ప్రతిష్టంభన నెలకొంది. ఎన్ని అడ్డంకులు, నిర్వంధాలు సృష్టించినా మూడో తేదీన ‘చలో విజయవాడ’ సభ విజయవంతం కావడాన్ని కళ్లారా చూసిన ప్రభుత్వ పెద్దలు.. సమ్మె మొదలైతే మొదటికే మోసమన్న ఉద్దేశంతో చర్చలు జరిగేతేనే ఉద్యోగుల దూకుడును కొంతమేరకు తగ్గించగలమని భావించారు. అందుకు ఉన్న మార్గాలన్నిటినీ అన్వేషించారు. తుదకు ‘తాడేపల్లి’ ఆదేశాలతో కొన్ని ప్రచ్ఛన్న హస్తాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. చర్చలను ముందుండి నడిపించాల్సిన స్టీరింగ్‌ కమిటీ నేతలపై వేర్వేరు వ్యక్తులను ప్రయోగించారు. ఎవరిపై ఎవరిని ప్రయోగిస్తే పనవుతుందో ముందే లెక్కలు వేసుకున్నారు. ఆ ప్రకారం మాస్టర్‌ప్లాన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు.

అంతే.. చర్చలకు వెళ్లాలంటూ ఉద్యోగ నేతలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు మొదలయ్యాయి. చర్చల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసినమంత్రుల కమిటీలో లేని ఓ మంత్రి, కొందరు రాజకీయ, రాజకీయేతర శక్తులు రంగంలోకి దిగి ఉద్యోగ నేతలను విడివిడిగా కలిసి దారిలోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అప్పటి వరకు తమ మూడు డిమాండ్లకు సర్కారు అంగీకరించేదాకా అసలు చర్చలకే వెళ్లకూడదని, సమ్మె మొదలయ్యాకే చర్చల గురించి ఆలోచించాలని గట్టి పట్టుదలకు వెళ్లిన ఉద్యోగ నేతలు సదరు పెద్దల ఒత్తిళ్లతో మెత్తబడినట్లు తెలిసింది. ఆ తర్వాత స్టీరింగ్‌ కమిటీ భేటీలో చర్చలకు వెళ్దామని తీర్మానించి.. ఇదే విషయాన్ని మంత్రుల కమిటీకి తెలియజేశారు.

ఫలితం ముందే..!చర్చలకు వెళ్లేముందే...ఈ రోజే దీనికి ముగింపు అన్న నిర్ణయానికి చాలా మంది ఉద్యోగ సంఘాల వచ్చేశారు. ఆ అభిప్రాయానికి రావడంలోనూ తెరవెనుక పెద్దలే కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి.

సమ్మెను ముగించేస్తారని శనివారం సాయంత్రం నుంచే లీకులు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ రేగింది. ఏం జరుగుతోందంటూ ఎవరికి వారు ఆరాతీశారు. దీనిపై కూడా రచ్చ జరిగింది. చర్చల సందర్భంగా ఒకరిద్దరు నేతలు తమకు అన్యాయం జరుగుతోందంటూ మంత్రుల కమిటీతో వివాదానికి దిగి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేసినా.. మళ్లీ చర్చల్లో కొనసాగినట్లు తెలిసింది. పట్టుబిగించి నేతలను గుప్పిటపట్టిన ప్రభుత్వ పెద్దలు.. మీరడిగింది మేం కాదంటామా అన్న ధోరణిలో శనివారం అర్ధరాత్రి దాటినా చర్చలను కొనసాగించినట్లుగా ఉందని నేతలే  చెబుతున్నారు. లీకులిచ్చినట్లుగానే అర్ధరాత్రి ఇరుపక్షాలూ మీడియా ముందుకొచ్చాయి. సమ్మెను విరమిస్తున్నట్లుగా ఉద్యోగ నేతలు ప్రకటించారు. ఏతావాతా కనిపించని ఆ శక్తులే చర్చలకు అవసరమైన సానుకూలతను తీసుకొచ్చి కీలకపాత్ర వహించి కథను సుఖాతం చేశారని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

స్పెషల్‌ దర్శనం ఇప్పిస్తాం...

 చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్‌సీ నివేదికతోపాటు ఫిట్‌మెంట్‌, పలు డిమాండ్లను గట్టిగానే ప్రస్తావించారు. అయితే సీఎం జగన్‌ వద్దకు తీసుకెళ్తాం.. ఆయన సమక్షంలోనే కీలక విషయాలపై ప్రకటన చేయిస్తామని పెద్దలు పదేపదే చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి పీఆర్‌సీ అంశం తెరమీదకు వచ్చినప్పుడు సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసినా అప్పట్లో సాధ్యంకాలేదు. శనివారం రాత్రి చర్చల్లో మాత్రం.. ఏ అంశంపై ప్రతిష్టంభన వచ్చే అవకాశం కనిపించినా.. వెంటనే సీఎం వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తామని పెద్దలు చెప్పినట్లు సమాచారం. చర్చల అనంతరం చివరగా పీఆర్‌సీ సాధన సమితి స్టీరింగ్‌కమిటీ సమావేశం జరిగింది. మంత్రుల బృందం ప్రతిపాదనల నేపథ్యంలో సమ్మెను విరమించాలో వద్దో నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగ నేతలు ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నారు. వారు పునరాలోచన చేసుకుంటారమోనని అనుమానం వచ్చిన మంత్రులు.. ఆ సమావేశంపై ఓ కన్నేసినట్లు తెలిసింది. పక్కనే ఉన్న మరో గదిలో ఇద్దరు మంత్రులు మకాం వేశారు. వారు ఉద్యోగుల వద్దకు వెళ్లి.. ఇక ప్రెస్‌మీట్‌ నిర్వహిద్దాం రమ్మని ఆహ్వానించినట్లు తెలిసింది. 

ప్రెస్‌మీట్‌కు ఉపాధ్యాయ నేతలు దూరం :

మంత్రుల బృందంతో శుక్ర, శనివారాల్లో జరిగిన చర్చల్లో స్టీరింగ్‌ కమిటీలోని ఉపాధ్యాయ సంఘం నేతలు కూడా పాల్గొన్నారు. శనివారం నాటి చర్చల్లో వారు ఫిట్‌మెంట్‌ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. 30శాతం ఇవ్వాలని కోరగా.. మంత్రుల కమిటీ తిరస్కరించింది. అయితే ఉపాధ్యాయ సంఘాలను కూడా సీఎం వద్దకు తీసుకెళ్తామని పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే చర్చలు ముగిసి ఉమ్మడి ప్రెస్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించే సమయానికి ఉపాధ్యాయ నేతలు వెళ్లిపోయారని కమిటీ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవడం, అనేక డిమాండ్లకు అంగీకరించడం, సీఎంతో భేటీ ఏర్పాటు చేయడం.. తదితర పరిణామాలన్నీ ‘చలో విజయవాడ’ పుణ్యమేనని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ‘ఆ కార్యక్రమం నిర్వహించకపోయి ఉంటే.. మమ్మల్ని కన్నెత్తిచూసేవారే కాదు. చలో విజయవాడ అనూహ్య రీతిలో భారీ సక్సెస్‌ కావడం వల్లే చర్చలు జరపాలని ప్రభుత్వం గట్టిగా భావించింది. మంత్రుల బృందం కూడా మా డిమాండ్లను పరిశీలించింది. చలో విజయవాడ తర్వాత సీఎంను కలిసే అవకాశం దక్కింది అని ఉద్యోగ సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు".

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top