Tuesday 1 February 2022

కోర్టులో ఉండగా సమ్మె ఎలా చేస్తారు...?

 కోర్టులో ఉండగా సమ్మె ఎలా చేస్తారు...?



ఉద్యోగ సంఘాలకు ధర్మాసనం చురకలు

కోర్టు ముందుకు పే స్లిప్లు

జీతాల నుంచి ఎలాంటి రికవరీ చేయద్దు

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఉద్యోగుల జీతాల నుంచి ఎలాంటి రికవరీలు చేయరాదని హైకోర్టు ప్ర భుత్వాన్ని ఆదేశించింది. వేతన సవరణకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణ కోర్టు ముందుంటే సమ్మె ఎలా చేస్తారని ఉద్యోగ నేతలను ప్రశ్నించింది. ఇది కోర్టుపై ఒత్తిడి తేవటమే అవుతుంది.. మా ఆదేశాల మేరకు సమ్మెకు వెళ్లరనే భావిస్తున్నాం.. చట్టానికి లోబడి వ్యవహరించే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని వ్యాఖ్యానించింది. కొత్త వేతన సవరణపై ప్రభుత్వం జారీచేసిన జీవో 1 రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనలతో పాటు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తిరిగి వేతన సవరణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ గజెటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణపై ఇప్పటి వరకు ఉన్న సందేహాలను సీజే నివృత్తి చేశారు. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వస్తుందని మొదట విచారించిన జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాంను ప్రశ్నించారు. పిటిషనర్ తరుపు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. వేతన సవరణపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. జీతం ప్రభుత్వ దాతృత్వం కాదన్నారు. ప్రభుత్వంలోని వ్యక్తుల అభీష్టం మేరకు ఆధారపడి ఉంటుందన్నారు. కొత్త వేతన సవరణకు సంబంధించి జీవో 1ను ఏకపక్షంగా జారీ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం ప్రతి ఉద్యోగి వాదనలను వినలేదు.. అందుకే జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చించింది.. పలు దఫాలుగా చర్చలు జరిగాయి కదా అని ప్రశ్నించింది. జేఏసీతో సంప్రతింపులు జరిపితే ఉద్యోగులతో మాట్లాడినట్లు కాదా అని ప్రశ్నించింది. కొత్త వేతన సవరణతో పిటిషనర్ ఏ విధంగా ప్రభావితమవుతారో తేల్చాలని స్పష్టం చేసింది. కొత్త పీఆర్సీ వల్ల పిటిషనర్ జీతం ఏరకంగా తగ్గిందనే విషయమై మెమో దాఖలు చేశామని న్యాయవాది వివరించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎంత జీతం వచ్చిందని ప్రశ్నించింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరాం జోక్యం చేసుకుంటూ పిటిషనర్ పే స్లిప్లతో మెమో దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ మూల వేతనం డిసెంబర్ 51,230 ఉంటే పీఆర్సీ తరువాత జనవరలి 78820కి పెరిగిందని స్థూల జీతంలో పెరుగుదల రూ. 22432 అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ హోదాల్లో గతంలో వచ్చిన జీతం, ఇప్పుడు అందుతున్న జీతం వివరాలను ఏజీ ధర్మాసనం ముందుంచారు. ధర్మాసనం స్పందిస్తూ ఇంటి అద్దె అలవెన్స్, కరవు బత్యం, సీసీఏల్లో కోత విధించలేదా అని ప్రశ్నించింది. ఆర్థిక సర్దుబాటులో భాగంగా కరవు బత్యం తగ్గిందని ఏజీ వివరణ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి, ఇప్పుడు నిర్ణయించిన ఫిట్మెంట్లో వ్యత్యాసాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని దీనిపైనే ప్రధానంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని దీనిపై తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా రికవరీ చేస్తారని ప్రశ్నించింది. హెచ్ఎస్ఏ, డీఏల జోలికి తాము వెళ్లబోమని వాటిపై ప్రస్తుతానికి విచారణ అవసరంలేదని అభిప్రాయపడింది. 2021-22 మధ్య జీతాల్లో తగ్గుదల లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తారని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్యోగులు దురభిప్రాయంతో ఉన్నారని అనవసర ఆందోళన చెందుతున్నారని ఏజీ బదులిచ్చారు. 2021 డిసెంబర్ నెల్లో అందుకున్న జీతంతో పోలిస్తే ఏ ఒక్క ఉద్యోగి వేతనం తగ్గలేదని వివరించారు. అనంతరం విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top