హేతుబద్ధతతో పిఆర్‌సిని మళ్లీ ప్రకటించాల్సిందే - ఉపాధ్యాయుల మెరుపు రాస్తారోకో
పీలేరు నుంచే పోరాటం ప్రారంభం : యుటిఎఫ్ ఎమ్మెల్సీలు
ప్రజాశక్తి-చిత్తూరు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దండగమారి పిఆర్‌సిని రద్దు చేసి హేతబద్ధత కలిగిన పిఆర్‌సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పీలేరులో ఉపాధ్యాయులు మెరుపు రాస్తారోకో నిర్వహించారు. యుటిఎఫ్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు పాల్గొని మద్దతు తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న యుటిఎఫ్ చిత్తూరు జిల్లా 16వ మహాసభ పీలేరులోని ఎస్‌విఎస్‌ఎస్ కల్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమైంది. ప్రారంభ సభ అనంతరం అక్కడి నుంచి ఆర్‌టిసి బస్టాండు వరకు, అక్కడి నుంచి తిరిగి గాంధీ విగ్రహం వరకూ ఉపాధ్యాయులు భారీ ర్యాలీ, అక్కడ మెరుపు రాస్తారోకో నిర్వహించారు. దీనిలో పాల్గను పిడిఎఫ్ ఎమ్మెల్సీలు యండపల్లి శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ పిఆర్‌సి విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలో మొట్టమొదటి పోరాటం పీలేరు నుంచే ప్రారంభించామన్నారు. రాష్ట్ర మొత్తానికి తాము సమర శంకం పూరిస్తున్నామని తెలిపారు. పిఆర్‌సి విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను మోసగించిందని విమర్శించారు. ఇకపై పదేళ్లకు ఒకమారు మాత్రమే పిఆర్‌సి అని, అది కూడా కేంద్రం ఇచ్చేది తప్ప రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకుండా చేసిందని విమర్శించారు. సిపిఎస్‌పై నానబెట్టి ఆఖరుకు ఏమీ తేల్చలేదని అన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు చాలా దుర్మార్గం, ఏకపక్షంగా ఉందని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.బాబురెడ్డి, ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్, కార్యదర్శి రఘుపతిరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, జివి.రమణ పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment