'చేయగలిగినంత చేస్తాం.. పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన' : సీఎం జగన్
ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నా.
అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తాను
దయచేసి ఉద్యోగులు, సంఘాల నేతలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి.
ఉద్యోగ సంఘాల అంచనాలు కొంత తగ్గాలి.. ఆర్థిక శాఖ కొంత మేర పెరగాలి.
14.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే.. ఇప్పుడిస్తున్న ఐఆర్ కంటే ఏటా రూ.7,137 కోట్ల అదనపు భారం.
తెలంగాణతో పోల్చితే అక్కడి ఆదాయం ఏపీలో వస్తోందా..?
అయినా అధికారంలోకి రాగానే 27% మధ్యంతర భృతి ఇచ్చాం.
ఉద్యోగుల వేతనాలు పెరుగుతున్నాయి.. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.
''రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇదే సమయంలో మీరు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటాను. వాళ్లు (ఆర్థిక శాఖ) చెప్పిన దానికి, మీరు (ఉద్యోగ సంఘాలు) చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కూడా కాస్త తగ్గాలి. వీళ్లు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. మీకు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను. ఇది నా హామీ.'' - సీఎం వైఎస్ జగన్.
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. పీఆర్సీపై చర్చించేందుకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాలుగా మేలు చేసే ప్రయత్నాలు చేస్తామని, రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉద్యోగులకు మంచి చేస్తూ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వేతనాల పెరుగుదల, ఆదాయం తగ్గుతున్న తీరును ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నా చేతికి ఎముక ఉండదంటారు..
► ఉద్యోగ సంఘాల నేతలు చాలా విషయాలు చెప్పారు. కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటుంటారు. ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథంతో ఉండే విషయంలో, నాకన్నా బాగా స్పందించే వాళ్లు, నా కన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారు.
►ఎవరికైనా మంచే చేయాలని తాపత్రయ పడతాను. వీలైనంత ఎక్కువ మందికి మంచి చేయాలని ఆరాటపడతాను. ఆ మంచిలో ఏ ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కాకుండా మిగిలి పోకూడదనేది నానైజం.
వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలి :
► కొన్ని వాస్తవాలను, కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం తర్వాత సంవత్సరాలన్నింటిపైనా ఉంటుంది. మనం అధికారంలోకి వచ్చాక అనుకోని పరిస్థితులు వచ్చాయి.
►ఒకవైపు పీఆర్సీ గురించి మాట్లాడుతున్నాం.. మరో వైపు ఒమిక్రాన్ విస్తరిస్తోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియదు? దాని ప్రభావం దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు? అలాంటి పరిస్థితుల మధ్య పీఆర్సీపై మాట్లాడుతున్నాం.
► కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు దేశ వ్యాప్తంగా 98 వేల కేసులు నమోదయ్యాయి. రేపటికి 2 లక్షలు అంటున్నారు. అనేక రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా వచ్చేసింది. ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి.
ఆదాయం తగ్గుతోంది :
►నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ.. రెండు ఆదాయాలు తగ్గిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం నిర్ణయం తీసుకోవడానికి కూర్చున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసరే... ఆ నిర్ణయంతో మనం కలిసి ముందుకు సాగాలి. మనం చేయదగ్గ పరిస్థితి ఉందా? అన్న ఆలోచన చేయాలి.
►ఒక్కసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్ (ఎస్‌ఓఆర్స్) గమనిస్తే.. 2018–19లో ఎస్‌ఓఆర్ రూ.62,503 కోట్లు అయితే 2019–20లో అది రూ.60,934 కోట్లకు, 2020–21లో రూ.60,688 కోట్లకు తగ్గింది.
►మామూలుగా ప్రతి ఏటా 15 శాతం పెరగాలి. ఈ లెక్కన 2018–19లో ఉన్న రూ.62 వేల కోట్లు 2019–20లో రూ.72 వేల కోట్లు కావాలి. 2020–21లో రూ.72 వేల కోట్లు రూ.84 వేల కోట్లు కావాలి. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం.
జీతాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతోంది :
► 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.67,340 కోట్లకు చేరుకుంది. ఉద్యోగులకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పెరుగుదల వచ్చింది.
►మనం అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చాం. దాదాపు రూ.18 వేల కోట్ల వరకు చెల్లించాం. 2019 జూలై 1 నుంచి ఈ రోజు వరకు ఐఆర్ ప్రభావం ఇది. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది.
►కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తదితర విభాగాలకు చెందిన 3,01,021 ఉద్యోగులకు జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది.
►ఈ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను అందించింది. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింప చేసింది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా వీరికి కూడా అమలు చేస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.360 కోట్ల మేర భారం పడుతోంది.
ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంతో అదనపు భారం
►ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశాం. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జనవరి 2020 నుంచి అక్టోబర్ 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.
► పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకు వచ్చాం. 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఏడాదికి రూ.2,300 కోట్ల భారం పడింది.
ఆరోగ్య రంగంలో భారీగా నియామకాలు :
►ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ తదితర సిబ్బందిని గతంలో ఎప్పుడూలేని విధంగా భారీగా నియమించాం. ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరనే మాట రాకూడదని నియామకాలు చేపడుతున్నాం. మొత్తంగా 39 వేల మందిని ఈ ఫిబ్రవరి నాటికి నియమిస్తాం.
► రిపోర్టు సబ్‌మిట్ చేసే నాటికి చూస్తే, 14 వేల మందిని నియమించారు. దీనివల్ల అదనంగా ఇప్పటికే ఏడాదికి రూ.820 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడింది.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు
►అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్‌ను ప్రారంభించాం. మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తున్నాం. లక్ష మందికి ఆప్కాస్‌లో ఉద్యోగాలు కల్పించాం. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు కల్పించాం.
► అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2,040 కోట్ల భారం పడుతోంది. ఎంపీడీఓలకు ప్రమోషనల్ ఛానల్ అంశాన్ని పరిష్కరించాం. గ్రేడ్–1 వీఆర్వోలకు ప్రమోషన్ ఛానల్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో, వీఆర్‌ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది కూడా మన ప్రభుత్వమే.
►మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేశాం. రీలొకేట్ అయిన ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తున్నాం.
ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అడుగులు
► మొట్టమొదటి రోజు నుంచి ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మనం అడుగులు వేసినందు వల్ల, స్టేట్ ఓన్ రెవెన్యూస్‌లో ఆదాయాలు ఒకవైపు తగ్గుతున్నా.. మొత్తం శాలరీలు, పెన్షన్ల్ ఖర్చు రూ.52,513 కోట్లు నుంచి రూ.67 వేల కోట్లకు పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరం పరిస్థితి ఇది. ఈ ఏడాది ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది వాస్తవం.
తెలంగాణలో పరిస్థితి చూడండి..
►పొరుగు రాష్ట్రం తెలంగాణలో వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? వారి తలసరి ఆదాయం ఎంత? వీటన్నింటినీ ఒకసారి పరిశీలించాలని కోరుతున్నా. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ.1,70,215 మాత్రమే.
►లంగాణాలో జీతాల మీద వాళ్లు ఖర్చు చేసింది రూ.17 వేల కోట్లు. పెన్షన్ల కోసం రూ.5603 కోట్లు. మొత్తం కలిపి వాళ్లు ఖర్చు చేసింది (కాగ్ రిపోర్టు ప్రకారం) రూ.22,608 కోట్లు. ఇది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. అంటే తొలి ఏడు నెలల కాలానికి అయిన ఖర్చు.
►అదే మన రాష్ట్రంలో 2021–22లో తొలి 7 నెలల కాలంలో జీతాలకు రూ.24,681.47 కోట్లు చెల్లించాం. పెన్షన్ల కోసం రూ, 11,324 కోట్లు చెల్లించాం. దాదాపు 36 వేల కోట్లు చెల్లించాం.
► ఇదే సమయంలో గుజరాత్‌లో వేతనాలు, పెన్షన్ల కోసం ఇచ్చింది కేవలం రూ.16,053 కోట్లు. బీహార్‌లో వేతనాలు, పింఛన్ల కోసం రూ.25,567.5 కోట్లు చెల్లించారు.
►రాష్ట్ర విభజనతో మనం హైదరాబాద్‌ను కోల్పోయాం. అందువల్ల మనకు ఆదాయాలు తగ్గుతున్నాయి. తెలంగాణకు ఆదాయాలు పెరుగుతున్నాయనేది వాస్తవం.
14.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఏటా రూ.7,137 కోట్లు భారం
► మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. ఈ రోజు మనం ఐఆర్‌తో పాటు ఏ జీతాలు ఇస్తున్నామో.. అవి ఇస్తూ.. కమిటీ చెప్పినట్టుగా 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం.
► ఫిట్‌మెంట్ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్ కావాలి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం.
► ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి..ఉద్యోగ సంఘాలకు వివరించిన అధికారులు :
► రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జనాభా 58.32 శాతం వస్తే, రెవిన్యూ 46 శాతం మాత్రమే వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అతితక్కువగా తలసరి ఆదాయం రూ.1,70,215 మాత్రమే ఉంది.
► షెడ్యూలు 9లో పేర్కొన్న సంస్థల కారణంగా రూ.1.06 లక్షల కోట్ల ఆస్తులను వదిలి వచ్చాం. షెడ్యూలు 10లో ఉన్న సంస్థలను వదులు కోవడం ద్వారా రూ.39,191 కోట్ల విలువైన ఆస్తులను కోల్పోయాం. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం.
►విన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి రూ.18,969 కోట్ల బకాయి ఉంది. కోవిడ్ కారణంగా మరింత ఆదాయాన్ని కోల్పోయాం. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా గణనీయంగా తగ్గింది.
►చీఫ్ సెక్రటరీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. తెలంగాణాలో, ఛత్తీస్‌గఢ్‌లో, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, హరియాణ రాష్ట్రాల కంటే అధికం.
0 Post a Comment:
Post a Comment